ఖాళీ స్థలాలను పట్టించుకోని సింగరేణి అధికారులు…
సింగరేణి స్థలాల ఆక్రమణ పట్టింపులు సామాన్యులకేనా….
అధికార ప్రజాప్రతినిధుల అండదండలతో సింగరేణి భూముల కబ్జాలు…
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
రామకృష్ణాపూర్ పట్టణం లోని సింగరేణి స్థలాలు ఆలయాల పేరిట ఆక్రమణలకు గురవుతున్నాయి. రామకృష్ణాపూర్ పట్టణంలో సింగరేణి బొగ్గుబావులు నడిచన కాలంలో ఖాళీ స్థలాలను ఆక్రమించుకోకుండా కాపాడిన సింగరేణి అధికారులు ప్రస్తుతం పట్టించుకోవడంలో విఫలమవుతున్నారని పట్టణ ప్రజలు బాహటంగానే విమర్శిస్తున్నారు. పట్టణంలోని సూపర్ బజార్ ఏరియాలో ఆలయం పేరిట సుమారు 10 గుంటల భూమి ఆక్రమణకు గురవుతున్నా సరే సింగరేణి అధికారులు పట్టించుకోవడం లేదు. గతంలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం కొరకు ఒక రూమ్ ఏర్పరుచుకున్నప్పటికీ రూమ్ ముందు ఉన్న స్థలాన్ని ఆ సంఘం నాయకులు మొత్తం ఆక్రమించేందుకు ప్రయత్నించగా సింగరేణి ఎస్టేట్ అధికారులు వచ్చి నిర్మాణాన్ని ఆపేశారు. అయినప్పటికీ నిర్మాణాన్ని నిలిపివేయకుండా చుట్టూ ప్రహరీ గోడ సంఘ సభ్యులు నిర్మించారు. పట్టణంలో నివసించే పేదవాళ్లు కూలిన ఇండ్ల స్థలంలో మళ్లీ కొత్త నిర్మాణం చేపడితే నిమిషాలలో స్థలం వద్దకు వచ్చి చేరే ఎస్అండ్ పిసి అధికారులు సింగరేణి అధికారులు ఇంత పెద్ద ఆస్తి ఆక్రమణకు గురవుతున్నా సరే పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సింగరేణి స్థలాలు ఆక్రమిస్తున్నారని ఆరోపణలు సామాన్యులకే నా అంటూ పుర ప్రజలు విరుచుకుపడుతున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధుల అండదండలతోనే పట్టణంలోని సింగరేణి స్థలాలు అన్యాక్రాంతానికి గురవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఆర్కేపి లో సింగరేణి ఖాళీ స్థలాలను కాపాడాల్సిన అధికారులు నిమ్మకు నేరెత్తినట్లు వ్యవహరిస్తుండటం, ఆలయాల పేరిట భూములు కబ్జాలకు గురవడంతో స్థలాలను కాపాడాల్సిన అధికారుల మతలబు ఏమిటో అని ప్రజలు గుస గుసలాడుతున్నారు.ఆక్రమణ జరిగే స్థలానికి సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది వెళ్ళినా సరే కబ్జాదారులు యధేచ్చగా ప్రహారి నిర్మాణాన్ని చేపడుతున్నారు.తమకు గతంలోనే అనుమతులు వచ్చాయని ,అందుచేతనే నిర్మాణాన్ని చేపడుతున్నామని తెలుపుతున్నారు.ఏదేమైనా ఆలయాల పేరిట సింగరేణి స్థలాలను ఆక్రమించుతున్న కబ్జాదారులపై కొరడా జలపించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. సింగరేణి స్థలాలను కాపాడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.