రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట, రామడుగు మండల కేంద్రంలో ఎన్నికలు శాంతియుత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు సి.ఐ రవీందర్ తెలిపారు. ఈసందర్భంగా గోపాలరావుపేట, రామడుగు గ్రామాలలో బిఎస్ఎఫ్ బలగాలు, జిల్లా పోలీసు సిబ్బందితో ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమానికి కరీంనగర్ రూరల్ ఏసిపి టి.కరుణాకర్ రావు హాజరై మాట్లాడుతూ ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి తొలిమెట్టని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. ఈఎన్నికలను శాంతియుత వాతావరణంలో, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించడమే లక్ష్యంగా ఈఫ్లాగ్ మార్చ్ లు అన్ని ప్రాంతల్లో నిర్వహించడం జరుగుతుందని, ఎన్నికల సమయంలో కేంద్ర బలగాలు కీలకపాత్రను పోషిస్తాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఎటువంటి గొడవలకు పాల్పడకుండా, భయాందోళనలకు, అవాంఛనీయ సంఘటనకు, ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. రాజకీయ పార్టీలు మందు, డబ్బు, వస్తువులు పంచినట్టయితే సివిజిల్ యాప్ ద్వారా గాని, 1950, 100నంబర్ లకు మరియు సంబంధిత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని ఫిర్యాదుదారుని వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. ఈకార్యక్రమంలో రామడుగు ఎస్.ఐ తోట తిరుపతి, గంగాధర ఎస్.ఐ అభిలాష్, చోప్పదండి ఎస్.ఐ ఉపేంద్రా చారి, రామడుగు పోలీస్ సిబ్బంది, బిఎస్ఎఫ్ సిబ్బంది, వివిధ పార్టీల నాయకులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.