చకచకా జమిలి వైపు అడుగులు!

`2026 ఆఖరులోనే దేశమంతటా ఎన్నికలు?

`జమిలి వాయిదా పడితే కథ అడ్డం తిరుగొచ్చు!

`ఊరించి ఊరించి ఉసూరుమనించారని వ్యతిరేకత రావొచ్చు.

`జమిలీ ఎన్నికలు ఇప్పుడు కొత్త కాదు.

`గతం గురించి ఈ తరానికి అవగాహన వుండకపోవచ్చు.

`వన్‌ నేషన్‌, వన్‌ ఎలక్షన్‌ పై పెరుగుతున్న ఉత్కంఠ.

`ఆలస్యం అమృతం విషమని నమ్ముతున్న బిజేపి!

`సాధ్యం కాదని సవాలు చేస్తున్న కాంగ్రెస్‌!

`డోలాయమానంలో ప్రాంతీయ పార్టీలు 

`వద్దంటే బిజేపి తో తంటా!

`సై అంటే గట్టెక్కుతామా అని ఆందోళన!

`కేంద్రం నిర్ణయంపై ఆచి తూచి అడుగులు.

`ఓవైపు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతూనే వున్నాయి.

`మరోవైపు జమిలి సన్నహాలు సాగుతూనే వున్నాయి.

`నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కోసం కూడా ఎదురు చూస్తున్న అన్ని పార్టీలు.

`రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లు పెరిగితే అన్ని పార్టీలకు సంబరమే!

`వచ్చిన చిక్కల్లా పార్లమెంటు సీట్లతోనే.

`దక్షిణాన సీట్లు తగ్గొచ్చని మేధావుల ఆలోచన.

`ఉత్తరాధిన విపరీతంగా సీట్లు పెరిగే అవకాశం.

`జనాభా ప్రాతిపదికన పెరిగే సీట్లపై దక్షిణాది రాష్ట్రాల కలవరం.

`నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఉద్యమాలు మొదలుకావొచ్చు.

`అయినా బిజేపికి నష్టం జరగకపోవచ్చు.

`ఉత్తరాది సీట్లతోనే బంపర్‌ విక్టరీ కొట్టొచ్చు.

`దక్షణాన సీట్లు తగ్గితే సమైక్యతకు అవరోధంగా మారొచ్చు.

`తెలంగాణ, ఏపిలలో అప్పుడే ఎన్నికల వాతావరణం.

`జమిలి వస్తే రెడీగా వుండేందుకు సంకేతం.

`రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు అందులో భాగం.

` కేటిఆర్‌ పాదయాత్ర తో క్యాడర్‌లో ఉత్సాహం పెంచేయత్నం.

`ఏపిలోనూ వేడెక్కిన రాజకీయం.

`రోడ్లకు మహార్థశ పట్టనున్నట్లు ప్రకటనల సందేశం.

`లేదు లేదు అనుకుంటూనే అన్ని పార్టీలు సన్నద్దం.

`జమిలితో అధికారంలోకి రావాలని అందరిలో ఆరాటం.

 

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

 ఆశపడడం వేరు అత్యాశ పడడం వేరు. దేశమంతా జమిలి ఎన్నికల నిర్వహించడం వల్ల కేంద్రంతోపాటు, అన్ని రాష్ట్రాలలో అదికారం దక్కించుకోవాలన్న లక్ష్యం మంచిదే కావొచ్చు. కాని ఆ ఆలోచనలు తిరగబడితే పరిస్దితి ఎలా వుంటుందన్నది ఎవరూ చెప్పలేరు. అయితే జమిలీ ఎన్నికల కోసం బిజేపి చకచకా అడుగులు వేస్తోంది. రాజకీయాల్లో కొన్నిసార్లు కఠినమైన నిర్ణయాలు తప్పవు. వాటి పర్యవసనాలు అనుకూలంగా వుంటాయా? వ్యతిరేకంగా వస్తాయా? అన్నది తర్వాత సంగతి. కాని ప్రధాని మోడీ విషయంలో మాత్రం ఆయన అనుకున్నది చేయాలన్న పట్టుదల మాత్రమే ఆది నుంచి కనిపిస్తుంది. ఆ విషయంలో ఇప్పటి వరకు అపజయం ఎదురు కాలేదు. రాజకీయంగా ఇప్పటి వరకు ఓటమి ఎరగని నేత. తాను ప్రదాని అభ్యర్ధిగా బిజేపి ప్రకటించిన నాటి నుంచి ఆయన పన్నుతున్న వ్యూహాలు చారిత్రాక విజయాలనే చవి చూస్తున్నాయి. బిజేపి పార్టీ ఉద్భవించిన నాటి నుంచి పార్టీకి తిరుగులేని విజయాలు సొంతం చేయించింది ప్రదాని మోడీ మాత్రమే. ఆయన రాజకీయ వ్యూహాలను అంచనా వేయడం కష్టం. ఇప్పటి వరకు మేదావి వర్గం కూడా ఆయన ముందస్తు చర్యలను అంచనా వేయలేకపోతోంది. ప్రజల్లో ప్రధాని మోడీ బలమైన నాయకుడే కాదు, ప్రజలను తన వైపు తిప్పుకున్న నాయకుడు. అందుకే ప్రధాని మోడీ ఏ పని చేసినా ప్రజలు నిరసించడం లేదు. వ్యతిరేకించడం లేదు. ఎలాంటి వారికైనా నిరసనలు కొన్నిసార్లు తప్పవు. కాని ప్రధాని మోడీ విషయంలో ప్రజల నుంచి తిరుగుబాటు గాని, వ్యతిరేకత గాని ఇంత వరకు లేదు. అదే ఆయన రాజకీయ చాణక్యానికి నిదర్శం. నిజానికి అటు మీడియా, ప్రతిపక్షాలు ఎంతగా ప్రధాని మోడీ మీద వ్యతిరేకత పెంచాలని ఎంత తపించినా కుదరడం లేదు. నానాటికీ మోడీ హవా పెరుగుతూనే వచ్చిందే తప్ప తగ్గడం లేదు. అయితే గత ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు సాధిస్తామని బిజేపి ప్రచారం చేస్తూ వచ్చింది. కాని అది కుదరలేదు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. దాంతో ప్రధాని మోడీ ప్రజలపై పెట్టుకున్న ఆశలు నెరవేరలేదు. సహజంగా మోడీ తనకు ఎదరులేని పాలన సాగిస్తూ ఇంత కాలం వచ్చారు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా వున్న సమయంలోనైనా, తర్వాత పదేళ్లపాటు ప్రధానిగా ఆయన ఏకచ్చత్రాదిప్యతం చేస్తూనే వచ్చారు. గత ఎన్నికల ఆయనకు కొంత ఆశనిపాతం మిగిల్చాయి. అందుకే ఆయన రాజకీయ చాణక్యంలోని అమ్ములపొది లోనుంచి జమిలీ ఎన్నికలు తెరమీదకు తెచ్చారు. నిజానికి ప్రదాని మోడీ జమిలీ ఎన్నికల గురించి గత ఐదారేళ్లుగా చెబుతూనే వస్తున్నారు. దేశంలో బిజేపి పాలిత రాష్ట్రాలను పెంచూతూనే వున్నారు. ఇటీవల కొంత ఇబ్బందికరమైన రాజకీయ పరిస్దితులు ఎదురుకావడంతో, మళ్లీ తనకు అనువైన రాజకీయ వాతావరణం కోసం మోడీ ప్లాన్‌ చేస్తున్నారు. అందుకే ఈసారి ఎలాగైనా జమిలీ ఎన్నికలకు వెళ్లాలన్న పట్టుదలతో వున్నారు. జమిలీ ఎన్నికలను ఇంకా సాగదీయడం సరైంది కాదని ఆయన నిర్ణయం తీసుకున్నారు. చకచకా అడుగులు వేస్తున్నారు. ఓ వైపు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతూనే వున్నాయి. హర్యానాలో బిజేపి ఓడిపోతుందని అందరూ అనుకున్నారు. అనూహ్యంగా బిజేపి గెలిచింది. దాంతో ప్రదాని మోడీకి మళ్లీ బలమొచ్చింది. రాజకీయ ప్రయోగాలు చేయడానికి దైర్యం వచ్చింది. హర్యానాలో బిజేపి ఓటమి ఖాయమని అటు మీడియా, ఇటు సర్వే సంస్ధలు ఏడాది కాలంగా ఊదరగొడుతూనే వున్నారు. కాని ప్రదాని మోడీ తన వ్యూహాలు ప్రతిపక్షాలు అంచనా వేయలేకుండా ఎత్తులు వేస్తూ వచ్చారు. హర్యానాలో హాట్రిక్‌ విజయం సాదించేలాచేశారు. ఇప్పుడు మహరాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా బిజేపి అనుకున్న లక్ష్యాలను చేరితే మాత్రం జమిలీ ఎన్నికలు వీలైనంత తొందరగా వచ్చే అవకాశాలు పుష్కలంగా వున్నాయి. నిజానికి జమిలీ ఎన్నికలు 2029లో వస్తాయని అందరూ భావించారు. ఓ గత ఎన్నికల్లో బిజేపికి అనుకున్న సీట్లు రాకపోవడం, జమిలీ ఎన్నికల మీద మాజీ రాష్ట్రపతి రాంనాద్‌ కోవింద్‌ నివేదిక సమర్పించడంతో ఒక్కసారిగా జమిలీ వైపు అందరి దృష్టి మళ్లింది. 2026లో నియోజకవర్గాల పునర్వవ్యవస్ధీకరణ జరగనున్న నేపధ్యంలో వెంటనే జమిలీకి వెళ్లాలని ప్రదాని మోడీ భావిస్తున్నారు. అందుకే నియోజకవర్గాల పునర్వవ్యవస్ధీకరణ జరిగిన వెంటనే 2026 ఆఖరులోనే జమిలీ ఎన్నికలు నిర్వహించాలన్న పట్టుదలతో ప్రధాని మోడీ వున్నారు. దేశ వ్యాప్తంగా జమిలీ మూడ్‌ వచ్చేసింది. ఒకే దేశం. ఒకే ఎన్నిక అన్నది బాగుంటుందని ప్రజలు అనుకుంటున్నారు. కాకపోతే ఏ పార్టీని ఆదరిస్తారన్నదే ఇక్కడ ప్రశ్నార్ధకంగా మారింది. జమిలీ ఎన్నికల వల్ల మాత్రం జాతీయ పార్టీలకే ఎక్కువ ప్రయోజనం అన్నది మాత్రం స్పష్టం. జమిలీ ఎన్నికల వల్ల బిజేపికి పూర్తి లాభం చేకూర్చాలన్నదే మోడీ వ్యూహాం. అందువల్ల జమిలీ ఎన్నికల నిర్వహిస్తే మాత్రం బిజేపికే అధికారం గ్యారెంటీ అన్న ప్రచారం బలంగానే వుంది. ఇది ప్రజల్లోకి బాగానే వెళ్లింది. గెలిచే పార్టీకే ఓట్లు వేయాలన్న ఆలోచన కూడా ప్రజలు చేస్తారని చెప్పడంలో సందేహం లేదు. ఇలా ప్రజలను బిజేపి వైపు తిప్పుకోవడంలో ప్రధాని మోడీ ఎప్పుడో సక్సెస్‌ ఫార్ములాను కనిపెట్టారు. అదే బిజేపికి తిరుగులేని విజయాలను అందిస్తోంది. ఇక జమిలీ ఎన్నికల కోలాహలం మొదలైందని తెలిసిన వెంటనే తెలంగాణ, ఏపి రాష్ట్రాలలో కూడా మళ్లీ ఎన్నికల వాతావరణం వచ్చేసిందనే చెప్పాలి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఇంకా ఏడాది పూర్తి కాలేదు. ఏపిలో చంద్రబాబు అధికారంలోకి కనీసం ఆరు నెలలు కూడా గడవలేదు. అయినా ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్ధితి ఎప్పుడు వచ్చినా సిద్దంగా వుండేందుకు ఎన్నికల ముందు ఇచ్చిన హమీలను అమలు చేయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంలో ఎన్డీయేలో భాగస్వామిగా వున్న చంద్రబాబు నాయుడు నిధుల వరద పారించుకుంటున్నారు. ఏపి అభివృద్ది కోసం అహర్నిషలు కృషి చేస్తున్నారు. అయితే జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం వుంటే మళ్లీ ప్రజలు జగన్‌ వైపు మొగ్గుచూపుతారా? లేక చంద్రబాబునే ఆదరిస్తారా? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇప్పటికిప్పుడు చంద్రబాబు పాలనపై వ్యతిరేకత లేకపోయినా, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో ఇబ్బందికరమైన పరిస్ధితులున్నాయన్నది నిజం. వాటి నుంచి చంద్రబాబు గట్టెక్కితే తప్ప మళ్లీ అవకాశం రాదు. ఇక జమిలీ ఎన్నికలు జరిగితే కూటమిలో వున్న డిప్యూటీ సిఎం. పవన్‌ కళ్యాణ్‌ సగం సీట్లు అడిగే అవకాశంలేకపోలేదు. గత ఎన్నికల్లో పోటీచేసిన అన్ని స్ధానాలను గెల్చుకోవడంతో పవన్‌కు కూడా మరింత నమ్మకం ఏర్పడిరది. ఇక తెలంగాణలో అప్పుడే రాజకీయం వేడిక్కింది. ఓ వైపు ఎన్నికల ముందు ఇచ్చిన గ్యారెంటీల అమలుపై కొంత ఇబ్బందికరమైన పరిస్ధితులు ఎదుర్కొంటున్నా, ఎన్నికలు వచ్చేనాటికి అంతా సర్ధుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు. జమిలీ ఎన్నికలు రావడానికి ఇంకా ఏడాదిన్న సమయం వుంది. ఈలోపు కనీసం ఓ 10లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌ సర్కారు భావిస్తోంది. అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌కు తిరుగుండదు. బిజేపి అప్పుడు కూడా పుంజుకునే అవకాశం వుండదు. డబుల్‌ బెడ్‌ రూంలు అన్నది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పుతాయని చెప్పడంలో సందేహం లేదు. ఇదిలా వుంటే జమిలీని దృష్టిలో పెట్టుకొని బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంటు కేటిఆర్‌ పాదయాత్ర మొదలుపెట్టాలని చూస్తున్నారు. ఇప్పటికే ప్రకటన కూడా చేశారు. ఎప్పుడు మొదలౌతుందన్న సంగతి మాత్రం చెప్పలేదు. కాకపోతే పాదయాత్ర అన్నది చేయడానికి సిద్దపడుతున్నట్లు స్పష్టమైంది. గత ఎన్నికల్లో ఓ ముప్పై మంది ఎమ్మెల్యేలను మార్చితే బిఆర్‌ఎస్‌దే అదికారమని ఎంత మంది చెప్పినా కేసిఆర్‌ వినలేదు. వారి మాట పెడ చెవిన పెట్టి, మొదటికే మోసం తెచ్చుకున్నారు. జమిలీ ఎన్నికల్లో మళ్లీ గెలవాలంటే పాదయాత్ర ఒక్కటే శరణ్యమని కేసిఆర్‌ కూడా భావిస్తున్నారు. అటు కేటిఆర్‌ పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువ కావాలనుకుంటే, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల ద్వారా చేరువ కావాలని చూస్తున్నారు. మొత్తంగా జమిలీ ఎన్నికల పుణ్యమా అని నాయకులంతా మళ్లీ ప్రజలోకి వెళ్తున్నారు. ప్రజా సమస్యలను పట్టించుకోక తప్పడం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *