# గత ప్రభుత్వం వలె అంకెలగారడీలు చేయొద్దు
# ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్
నర్సంపేట,నేటిధాత్రి :
ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తక్షణమే అమలు చేసి ప్రజల ఆశలను నెరవేర్చాలని అందుకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు ఉండాలని అంతేతప్ప గత ప్రభుత్వం వలె అంకెల గారడీలు చేయవద్దని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రెండు లక్షల 75 వేల891 కోట్ల రూపాయల ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రతిపాదనపై ఎంసీపీఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ మాట్లాడుతూ కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను తక్షణమే అమలు చేసే విధంగా బడ్జెట్ కేటాయించినందుకు సంతోషమే అయినప్పటికీ ఆచరణ త్వరగా పూర్తి చేయాలని కోరారు అలాగే కుంటి సాకులతో లబ్ధిదారులను అనర్హులుగా చేయకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఇచ్చినట్లుగా అమలు చేయాలన్నారు. రాష్ట్రానికి తలమానికమైన వ్యవసాయ రంగానికి 19వేల కోట్ల రూపాయలే కాకుండా కనీసం 20% నిధులను కేటాయించాల్సిందన్నారు. అలాగే అభివృద్ధిలో వెనుకబడిన దళిత గిరిజన బీసీ మైనారిటీలను ముందుకు నడిపించేందుకు ఎలాంటి చర్యలు ప్రకటించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. అలాగే నిరుద్యోగులకు భృతి కల్పించేందుకు మౌలిక సదుపాయాల కల్పన కోసం రైతుల పంటల ధరల నియంత్రణ కోసం బడ్జెట్ కేటాయించకపోవడం సరైనది కాదన్నారు. ఏది ఏమైనా బడ్జెట్ ఆచరణలో అమలు అయ్యే విధంగా పేదలకు న్యాయం జరిగే విధంగా ఆశలు నెరవేరే విధంగా ప్రకటించిన హామీలను తక్షణమే అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.