‘‘డాలర్‌’’ కలలు ‘‘ఢమాల్‌’’!

usa trump effect on Indians

ఆవిరైన ఆశలు..కరిగిపోయిన కలలు.

-అమెరికా కలల్లో చేదు నిజాలను మిగిల్చుకున్నారు.

usa trump effect on Indians
usa trump effect on Indians

-బరువెక్కిన గుండెలతో దేశం తిరిగి వస్తున్నారు.

-ఇష్టంగా కష్టాలు పడినా మిగిలిన కన్నీళ్లు.

-సప్త సముద్రాలు ఆవల సంపాదన.

-దూరపు కొండల నునుపు ఆలోచన.

-చెల్లా చెదురైన యువత భవిష్యత్తు.

-కడుపు కట్టుకొని తల్లిదండ్రులు రూపాయి రూపాయి పోగేసుకున్నారు.

-అప్పులు చేసి పిల్లలను అమెరికా పంపించారు.

-పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం కలలుగన్నారు.

-మా పిల్లలు అమెరికాలో వున్నారని గొప్పగా చెప్పుకున్నారు.

-గంపెడాశలతో వెళ్ళిన పిల్లలు వట్టి చేతులతో వస్తున్నారు.

-అమెరికాలో జీవితం అని కలల్లో తేలియాడారు.

-ఒక్కసారిగా కలలు చెదిరి తిరిగి వస్తున్నారు.

-ట్రంప్‌ వస్తే మరింత మేలనుకున్నారు.

-మొదటికే మోసం తెచ్చాడు.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

  ఓ మనిషి ఏమిటి నీ ఆలోచన. ఎక్కడికి నీ ప్రయాణం. అంటూ ఎవరి మనసైనా ఎప్పుడైనా అడుగుతూనే వుంటుంది. నా మనసలు అమెరిక చుట్టూ తిరుగుతుంది. నా ప్రయాణం అమెరికా వైపు వెళ్లమంటోందని సమాధానం చెప్పుకుంటూ జీవితం గడిపేవారు కొంత మంది. తమకు జీవితంలో దక్కని అవకాశం తన పిల్లల ద్వారా నైనా నెరవేర్చుకొని వారి సంతోషంలో తన ఆనందాన్ని చూసుకోవాలనుకునే ప్రతి తల్లిదండ్రులు అనుభవిస్తున్న సమస్యే. కాకపోతే ఒక దశలో తండ్రి ఆలోచన..చివరి దశలో అదే తండ్రి ఆవేదన ఎలా వుంటుందో కూడా అందరూ తెలుసుకోవాలి. గత ఓ ముప్పై సంవత్సరాల కాలంగా అమెరికా పిచ్చి అందరికీ పట్టుకున్నది. అది అన్ని వర్గాలకు పాకింది. ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి అంటే అమెరికా వెళ్లడానికి ప్రిపేర్‌ అవుతున్నాడు. ఇంజనీరింగ్‌ అయిపోయింది. ఎంఎస్‌ చేయాలనుకుంటున్నాడు. అమెరికాకు వెళ్లే ఏర్పాట్లుచేస్తున్నాం అని కొందరు. మా అబ్బాయిని ఎలాగైనా అమెరికా పంపించాలి. మా పక్కింటి వాళ్ల పిల్లలు ఇద్దరూ అమెరికాలోనే వుంటున్నారు. మా ముందు వాళ్లు ఫోజులు కొడుతున్నారు. మా పిల్లలను కూడా పంపించి వారికంటే మేమే గొప్ప అనిపించుకోవాలి అనుకుంటున్న తల్లిదండ్రులు. ఇక పిల్లల మందు బాగా చదువుకో…మన ఆ బంధువులు పిల్లలు అమెరికా వెళ్లారు. ఈ బంధువుల పిల్లలు అమెరికా వెళ్తున్నారు. వాళ్లను చూసైనా బుద్ది తెచ్చుకో..బాగా చదవుకో..నా పరువు నిలబెట్టు..అంటూ పిల్లలను చిన్నప్పటి నుంచే అమెరికా ఆశల పల్లకిని ఎక్కిస్తున్నాం. వాళ్లను చూసి మరి కొందరు…ఇలా పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు అందరూ అమెరికా జపం తప్ప, ఇక్కడే వుంటాం..ఇక్కడే చదువుకుంటాం..ఇక్కడే గొప్పగా బతుకుతాం అనేవారు లేకుండాపోతున్నారు. ఇక్కడ ఎంత గొప్పగా బతుకున్నా అది బతుకు కాదన్నంతగా జనం మారిపోతున్నారు. అమెరికాలో అంట్లు తోముకుంటూ బతికినా సరే అంత బంగారమైన బతుకు మరొకటి లేదన్నంతగా గొప్పలకు పోతున్నారు. రూపాయిలకన్నా, డాలర్‌ కలలు గొప్పగా వుంటాయనుకుంటారు. కనిపించని దేశాల వెంట పరుగులు తీస్తున్నారు. ఓ నలభై సంవత్సరా క్రితం అమెరికా అంటే అబ్బో అనుకునేవారు. కాని ఇప్పుడు గ్లోబలైజేషన్‌ మూలంగా అమెరికా కూడా మన పక్క ఊరే అన్నంత మాటల దూరం తగ్గిపోయింది. ఇబ్బంది కర కాలం మళ్లీ వచ్చింది. ట్రంప్‌ రూపంలో మళ్లీ చిక్కులు ఎదురౌతున్నాయి. ఇప్పుడు మీ ఊరు మాకు ఎంత దూరమో..మా వూరు మీకు అంతే దూరం అన్న లాజిక్‌ మొదటికి వచ్చింది. మన దేశం నుంచి లక్షలాది మంది వెళ్లి అమెరికాలో చదువుకునే వారు చదువుకుంటున్నారు. వ్యాపారాలు చేసే వారు చేస్తున్నారు. ఉద్యోగాలు చేసేవారు వున్నారు. చిరు వ్యాపారుల నుంచి పెద్ద పెద్ద కంపనీలు పెట్టిన వారున్నారు. కాని చదువుకోవడానికి వెళ్లినా ఇక్కడి నుంచి పంపే సొమ్ము సరిపోక, అమెరికాలో బారీ బతుకులు బతకాలంటే కూలీ పనులు చేసుకోవాల్సిందే. ఇంట్లో వున్నప్పుడు ఇటు పుల్ల తీసి అటు పెట్టని వాళ్లయినా సరే..అంట్లు కడిగైనా అక్కడ బతకాల్సిందే. ఆ పని కోసం బతిమిలాడుకొని ఆ పని చేసుకొని సంపాదించుకొని బతకాల్సిందే..ఇదే అమెరికా జీవితం కాని..దూరపు కొండలు నునుపు. అక్కడ సంపాదించి విదేశీ మారకద్రవ్యం చెల్లించి, పన్నుల మీద పన్నులు అటూ, ఇటు కట్టి చివరకు చేతిలో కనిపించేది ఎంతైనా సరే అమెరికాలోనే బతకాలనుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోవడమే ఇందుకు కారణం. ఇండియాలో తరతరాలు కూర్చొని సరిపడ ఆస్దులున్నా సరే అమెరికాకే వెళ్లాలి. అక్కడే బతకాలి. అక్కడే ఎంజాయ్‌ చేయాలని అనుకునే వారి కధ వేరు. కాని రెక్కాడితే గాని డొక్కాడని పేదలు కూడా అమెరికా వైపు చూసుకుంటూ మబ్బుల్లో నీరు ఒలకబోసుకుంటున్నారు. తమ పిల్లలను కూడా అమెరికా పంపాలన్న ఆలోచనలతో అందిన కాడికి అప్పులు చేస్తున్నారు. కడుపు కట్టుకొని కూడబెట్టుకుంటున్నారు. ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులు కూడా మిగతా సమయాల్లో మరో పని చేస్తున్నారు. ప్రతి రూపాయిని ఆదా చేసుకుంటున్నారు. ఇలా రూపాయి రూపాయి కూడబెట్టి అమెరికా పంపిస్తే తమ తల్లిదండ్రుల మీద ప్రేమ వున్న పిల్లలు ఎంత మంది వున్నారు. అసలు తమను అమెరికా పంపించిన తల్లిదండ్రులను గుర్తుంచుకుంటున్న పిల్లలు ఎంత మంది వున్నారు. తల్లిదండ్రులు బతికి వున్నారా..లేదా అని తెలుసుకుంటున్న వాళ్లు ఎంత మంది వున్నారు. రోజూ కాకపోకపోయినా వారానికో..నెలకో తల్లిదండ్రులను పలకరిస్తున్నారా? అంటే అదీ లేదు. ఎప్పుడూ బీజీ..బిజీ..అన్న సమాదానలతో సరిపెట్టుకుంటున్నారు. తమ పిల్లలు అమెరికా వెళ్తే ప్రయోజకులౌతారు. గొప్పవాళ్లవుతారు. గొప్పగా బతుకుతారు. మమ్మల్ని కూడా గొప్పగా చూసుకుంటారని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. కాని తమను తల్లిదండ్రులను మర్చిపోతున్న పిల్లలు వున్నారని తెలిసినా తల్లిదండ్రులు అమెరికా కలలు కనకుండా వుండడం లేదు. తమ పిల్లలను అమెరికా పంపించకుండా వుండలేకపోతున్నారు. కష్టాలు కొని తెచ్చుకుంటూనే వున్నారు. కష్టాలు వస్తాయని తెసినా దైర్యం చేస్తున్నారు. సమస్య తమ దాకా వచ్చేవరకు తల్లిదండ్రులు బోరు మంటున్నారు. అమెరికా వెళ్లిన పిల్లల వల్ల ఎదురయ్యే సమస్యలపై సీతారామయ్య మనవరాలు అని ఓ సినిమా వచ్చింది. కంటే కూతుర్నే కనాలి అనే సినిమా తీశారు. ఇలాంటివి అనేకం వచ్చాయి. అయినా సినిమా చూస్తారు. కాసేపు కళ్ల నీళ్లు పెట్టుకుంటారు. మర్చిపోతారు. తమ పిల్లల్ని అమెరికా పంపేందుకు రకరకాల కష్టాలు పడుతూనే వుంటారు. అవసాన దశలో పదిహేను నిమిషాలు సినిమా చూస్తూ పెట్టుకున్న కన్నీళ్లు జీవితాంతం పెట్టుకుంటున్నారు. అయినా ఎవరూ ఆగడం లేదు. ఇప్పటికైనా మనలో మార్పు వస్తుందని ఆశించాద్దాం. విదేశాలలో గొప్ప గొప్ప చదవులు చదువుకొని దేశానికి సేవ చేయడం పక్కన పెడితే, కనీసం కన్న తల్లిదండ్రులకు అవసాన దశలో చూసుకునే దిక్కులేకుండాపోతోంది. కడసారి చూపులు చూడడానికి కూడా వీలు లేకుండాపోతోంది. అడ్డాల నాడు బిడ్డలు కాని, గడ్డాల నాడు బిడ్డలు కాదన్న సామెతలు నిజం చేస్తున్నారు. అయినా ఫరవాలేదని, తమ పిల్లలుతమను చూసుకోకపోయినా సరే..ఆఖరి దశలో తమ వద్దకు రాకపోయినా సరే అని కూడా పిల్లల్ని అమెరికా పంపించాలనే తల్లిదండ్రులే పెరుగుతున్నారు. అందుకే ఈ పరిస్దితి వస్తోంది. ఇప్పుడు ట్రంప్‌ ఆమెరికాకు వెళ్లిన వారిని తిరిగి పంపించేస్తున్నారు. లక్షలు ఖర్చు పెట్టుకొని అమెరికా వెళ్లిన వారిని దోషులుగా చూస్తున్నారు. దొంగలుగా ముద్రలు వేసి పంపిస్తున్నారు. నిజానికి మన దేశం నుంచి వెళ్లిన వాళ్లెవరూ అక్రమ మార్గల ద్వారా వెళ్లిన వారు కాదు. కాకపోతే అక్కడికి వెళ్లిన తర్వాత అక్రమంగా అక్కడ నివాసముంటున్నారు. అది కూడా తప్పే..ఆ దేశ చట్టాల ప్రకారం నేరమే..అందుకే అమెరికా నుంచి తిరిగి పంపిస్తున్నారు. అమెరికాలో వుండడానికి వారికి అర్హత లేదని బలవంతంగా పంపిచేస్తున్నారు. ఇది మంచి పరిణామమేనా కాదా? అన్నది ఇప్పటికిప్పుడు తెలియపోయినా రేపటి తరం ఆశల ఆవిరయ్యాయనే చెప్పాలి.. కన్నకలలు కల్లలయ్యాయనే అనుకోవాలి. అమెరికా ఆశల మీద ఇంకెవరు మోజు పెంచుకోవద్దని కూడా గుణపాఠంగా తీసుకోవాలి. అమెరికా కలల్లో చేదు నిజాలున్నాయని గమనించాలి. ఆ చేదు గుళిక ఇప్పటికప్పుడు గొంతు దిగకపోయినా, ఇక్కడ సంపాదించి అమెరికా అప్పుడప్పుడూ చూసి వచ్చే కల నెరవేరేందుకు ఉపయోపడాలని కోరుకోవాలి. అక్కడే వుండాలి. అక్కడే బతకాలి. అక్కడే భవిష్యత్తు వెతుక్కొవాలి అనేది ఆశే అయినా, అత్యాశ కాకుండా చూసుకోవాలి. స్ధోతమను ఇక్కడ కూడా పెంచుకోవచ్చు. ఇక్కడ కూడా అవకాశాలు వెతుక్కోవచ్చు. ఇక్కడ కూడా ఆదాయ వనరులను సృష్టించుకోవచ్చు. బరువెక్కిన గుండెలతో దేశం వస్తున్నామని అనుకోకండి. బరువు దించుకొని వస్తున్నామని సంతోషంగా రండి. లక్షలాది రూపాయలు వృధా అయ్యాయని అనుకోకండి. అంతకు మించి సంపాదించుకునేందుకు కూడా ఇక్కడ అవకాశాలు వెతుక్కొండి. లేకుంటే నిపుణులులైన విద్యావంతులుగా ఉన్నత చదువులు చదువుకున్న వాళ్లు అవకాశాలు సృష్టించండి. మీరే పది మందికి ఉపాది కల్పించేలా ముందుకు సాగండి. అందుకు బ్యాంకులు కూడా సహకారం అందించే అకాశాలున్నాయి. సంపద మీరే సృష్టించండి. ఎవరిమీదో ఆధారపడుకుండా మీ కాళ్ల మీద నిలబడి, దేశానికి ఆదాయం సమకూర్చండి. ఆల్‌దిబెస్ట్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!