ఐ సి డి ఎస్ ఆధ్వర్యంలో ముందస్తు మహిళా దినోత్సవం.
పలమనేరు నేటి ధాత్రి :
పలమనేరు పట్టణం గుడియాత్తం రోడ్డు సమీపంలో ఉన్న ఐ సి డి ఎస్ కార్యాలయం ఆవరణలో ముందస్తు మహిళా దినోత్సవం నిర్వహించినట్లు సిడిపిఓ ఇందిరా ప్రియదర్శిని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపాల్సి ఉండగా శనివారం సెలవు రోజు కాబట్టి ముందుగా జరపాలసి వచ్చిందన్నారు. ఈ దినోత్సవానికి మహిళా డాక్టర్లు శారద, సుధారాణి, ఎస్సై స్వర్ణ తేజ ,లెక్చరర్ రుక్మిణి, బాలికల పాఠశాల హెచ్ఎం కుప్పమ్మ ముఖ్య అతిథులుగా హాజరైనారు.ఈ సందర్భంగా హాజరైన ముఖ్య అతిథులకు సామాజిక సేవాదాత శ్రీపురం సీతారామయ్య, వీరి పెద్ద కోడలు సునీత చేతుల మీదుగా శాలువులు కప్పి ఘనంగా సన్మానించారు. లెక్చరర్ రుక్మిణి, ఎస్సై స్వర్ణ తేజ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుండాలని, అప్పుడే సమ సమాజం ఏర్పడడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. టెక్నాలజీ పెరిగే కొద్దీ మహిళలు, బాలికల యొక్క మేదస్సు దానికి అనుగుణంగా పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం మహిళలకు కల్పించిన హక్కులు పూర్తిస్థాయిలో అమలు కాలేదని, వాటికోసం మనమందరము పెద్ద ఎత్తున శ్రమించాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే భారతదేశంలో పురుషాధిపత్యం చెలరేగుతున్నదనడానికి మహిళలు, బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలే నిదర్శనం అన్నారు.ఎక్కడో అమెరికా దేశంలో ఓ రాష్ట్రమునందు 5000 మంది మహిళా కార్మికుల చేత ప్రారంభమైన పోరాటం ప్రపంచ దేశాల్లో అలుముకుందని గుర్తు చేశారు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక చారిత్రాత్మకమైన ఉద్యమ పండుగగా జరుపుకోవాలని కోరారు. పిల్లల తల్లిదండ్రులు చిన్నతనం నుండి విద్యతోపాటు, సామాజిక నైపుణ్యతలు, మానవతా విలువలు ఇంటి దగ్గరే వారికి బోధించాలన్నారుబాలికలను అన్ని రంగాల్లో పాల్గొనడానికి తల్లిదండ్రులు ప్రోత్సాహం కల్పించి ధైర్యంగా ముందుకు పంపించాలన్నారుఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్లు నజ్మా, మాధవి లత, గీత, శారదమ్మ, ద్రాక్షాయని, పుష్ప, అంగన్వాడి వర్కర్లు, మినీ వర్కర్లు, హెల్పర్లు పాల్గొన్నారు.