ముందస్తు విద్యార్థుల నమోదు కార్యక్రమం.

Veeraswamy

ముందస్తు విద్యార్థుల నమోదు కార్యక్రమం

పాఠశాల ప్రధానోపాధ్యాయులు తాటికొండ వీరస్వామి

కమలాపూర్, నేటిధాత్రి :

 

రాబోయే విద్యా సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకొని కమలాపూర్ మండలం భీంపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ బృందం ముందస్తుగా విద్యార్థుల నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించింది.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తాటికొండ వీరస్వామి మాట్లాడుతూ విద్యా సంవత్సరం చివర్లోనే తల్లిదండ్రులు,యువత, ప్రజాప్రతినిధులను కలవడం ద్వారా ముందుగా బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తే,వచ్చే ఏడాది విద్యార్థుల ప్రవేశాలు పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు.అందుకే ఈ కార్యక్రమాన్ని ముందుగా చేపట్టామన్నారు.పాఠశాల అందిస్తున్న సౌకర్యాలను వివరించేందుకు,అలాగే ఉపాధ్యాయ బృందం విద్యార్హతలను తెలియజేయడానికి ప్రత్యేక కరపత్రాన్ని ముద్రించి మండల విద్యాశాఖ అధికారిచే ఆవిష్కరించారు.గత వారం రోజులుగా ఉపాధ్యాయ బృందం గ్రామంలోని వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ, గ్రామ పెద్దలు,తల్లిదండ్రులు, యువతతో సమావేశమై, వారికి కరపత్రాలను అందజేస్తూ,తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందించేందుకు గట్టి పునాది వేస్తామనే నమ్మకాన్ని తల్లిదండ్రుల్లో కల్పిస్తున్నారు.తల్లిదండ్రులు సానుకూలంగా స్పందించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు సిద్దంగా ఉన్నారని తెలిపారు. త్వరలోనే బడి ఈడు పిల్లల తల్లిదండ్రులతో ఉపాధ్యాయ బృందం సమావేశం నిర్వహించనుందని తెలిపారు.ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఇలాంటి కార్యక్రమాలు మార్గదర్శకమని మండల విద్యాశాఖ అధికారి అభిప్రాయపడ్డారు.భీంపల్లి పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని మండల విద్యాశాఖ అధికారి శ్రీధర్,కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు వాణి అభినందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాలఉపాధ్యాయులు ఎన్. ప్రభాకర్ రెడ్డి,బి.జోత్స్న, కె.సుజాత అంగన్వాడీ టీచర్ ఏ.వరలక్ష్మి,ప్రీ ప్రైమరి టీచర్ కె.పూజిత,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!