*ప్రభుత్వ పాఠశాల ముందు వెలిసిన అక్రమ డబ్బాలు..*
*నాళాల అక్రమనతో నిలిచిన నీరు..ప్రమాదంలో విద్యార్థులు*

*నర్సంపేట,నేటిధాత్రి:*
వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల జలమయమైంది.

పాఠశాల ముందు ఉన్న నాళాపై అక్రమ డబ్బాలు వెలువడంతో గ్రామంలోని పలు వీధుల్లో నుండి వచ్చే వర్షపు నీరు మొత్తం పాఠశాల ప్రంగంలోకి వెళ్లి చెరువును తలపించే విధంగా మారింది.ఈ నేపథ్యంలో పాఠశాలకు వచ్చిన విద్యార్థులు వారి వారి ఇండ్లలకు వెళ్ళడానికి తీవ్ర ఇబ్బందులకు గురైయ్యారు.పాఠశాల ముందు ప్రహరీ గోడను ఆనుకుని ఉన్న నాళపై కొన్ని అక్రమ డబ్బాలు వెలువడంతో గ్రామం నుండి వచ్చే వరద నీరు మొత్తం పాఠశాల ప్రాంగణం మొత్తం నిండిపోయిందని పలువురు గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.గ్రామ పంచాయితీ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి అక్రమ కట్టడాలు వెలువడుతున్నాయని,అలాగే గ్రామ దేవత బొడ్రాయి వద్ద గల ఇటీవల నిర్మించిన ఒక వ్యాపార సముదాయం నాళ ఆక్రమించి అక్రమ నిర్మాణం చేపట్టారని పలువురు ఆరోపిస్తున్నారు.ఈ సందర్భంగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామస్వామి మాట్లాడుతూ బుదవారం కురిసిన భారీ వర్షానికి పాఠశాల ప్రాంగణంలో నిలిచిన నీరు విద్యార్థులు బయటికి పోయేందుకు దారి లేకుండా అయ్యిందని అవేదన వ్యక్తం చేశారు. దారి వెంట డబ్బాలు ఏర్పాటు చేయడంతో వర్షం నీరు మొత్తం పాఠశాల ప్రాంగణంలో నిలిచి విద్యార్థులు నడవకుండా అసౌకర్యాన్ని కలిగించిందని అన్నారు.కాగా తప్పని పరిస్థితుల్లో భారీగా చేరిన వరద నీటినుండి భయాందోళనలకు మధ్య విద్యార్థులు బయటకు వచ్చారని పేరొన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం టాయిలెట్లకు వెళ్లకుండా నీరు నిలవడం వల్ల ఇబ్బందిపడ్డారని హెచ్ ఎం పేర్కొన్నారు.కాగా పాఠశాల యందు గ్రావెల్ తో లెవెల్ చేయడం ఎంతగానో అవసరం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేశారని తెలిపారు. ప్రహరీ గోడ పక్కన ఏర్పాటు చేసినటువంటి షాపులను తొలగిస్తే వర్షంనీరు బయటకు వెళ్లడానికి అవకాశం ఉంటుందని గ్రామస్తుల అభిప్రాయం వ్యక్తం చేశారన్నారు. ఎస్ఏ వన్ ఎగ్జామ్ నిర్వహణ ఉన్న నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు ఉదయం పరీక్షా అనంతరం మధ్యాహ్నం విద్యార్థులకు సెలవు ప్రకటించి పరీక్షా వాయిదా వేయడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామస్వామి తెలిపారు.

