
Ravindra Bharathi Conference Hall,
డా. పత్తిపాక మోహన్ ` గరిపెల్లి అశోక్‌ల పుస్తకాల ఆవిష్కరణ
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)
సిరిసిల్ల పట్టణ కేంద్రనికి చెందిన బాల సాహితీవేత్త, మారసం వ్యవస్థాకులు డా. పత్తిపాక మోహన్ ` బాల సాహితీవేత్త, బాల వికాసకారులు గరిపెల్లి అశోక్‌ల పుస్తకాల ఆవిష్కరణ సభ 27 జులై, 2025న మధ్యాహ్నం రెండుగంటలకు రవీంద్ర భారతి సమావేశ మందిరం, హైదరాబాద్‌లో
జరిగినది.సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత డా. పత్తిపాక మోహన్ అధ్యక్షతన జరిగిన సభలో ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగుశాఖ పూర్వ అధ్యక్షులు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొనగా, బాల వికాసకారులు మాడభూషి స్మారక సమితి అధ్యక్షలు మాడభూషి లలితాదేవి, డా. అమరవాది నీరజ, డా. అమ్మిన శ్రీనివాస రాజు, శ్రీమతి శీలా సభద్రాదేవి, డా. హారిక చెరుకుపల్లి తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.
తొలుత డా. అమరవాది నీరజ రచించిన బాలల బొమ్మల పుస్తకం ‘అంజు’ పుస్తకం, డా. పత్తిపాక మోహన్ తెలుగు బాల గీతాలు ‘ఆకుపచ్చపాట’కు డా. షేక్ అబ్దుల్ ఘనీ చేసిన హిందీ బాల గీత అనువాదం ‘హరేభరే గీత్’ పుస్తకంతో పాటు ప్రముఖ బాల వికాసకారులు గరిపెల్లి అశోక్ పిల్లల కథల పుస్తకం ‘గోటీలాట’ ను ఆచార్య కసిరెడ్డి అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ ఇవ్వాళ్ళ తెలుగు బాల సాహితీ లోకంలో విశేష కృషిచేస్తున్న పత్తిపాక మోహన్, గరిపెల్లి అశోక్‌లు తన ప్రత్యక్ష విద్యార్థులని, బాల సాహితీ లోకంలో మరింత కృషి చేయాలని ఆశీర్వదిస్తూ’ అభినందించారు. డా. పత్తిపాక మోహన్ మాట్లాడుతూ ఇవ్వాళ్ళ తన పుస్తకాల సంఖ్య డెబ్బై అయిదు దాటిందని, గరిపెల్లి అశోక్ పదిహేను పుస్తకాలను ఆవిష్కరించారని అయితే ఇద్దరి తొలి పుస్తకాలను ప్రచురించింది ఆచార్య కసిరెడ్డి ని, ఆస్ఫూర్తితోనే ఇవన్నీ సాధ్యమైనాయని వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు.