ఈ ‘ఉచిత’ సంస్కృతి మానకపోతే రాష్ట్రాలు నిండా మునగడం ఖాయం
అయోగ్య ‘ఉచితాల’నుంచి ప్రభుత్వాలు బయటపడాలి
ఉచితాలు కావాలని ప్రజలు కోరడంలేదు
అలవాటు చేసి తలకు రోకలి చుట్టుకుంటున్న పార్టీలు
పరాన్న భక్కులను తయారుచేస్తున్న ఉచితాలు
అధికారం మత్తులో పట్టించుకోని పార్టీలు
పార్టీల నిర్వాకానికి అప్పుల ఊబిలో రాష్ట్రాలు
హైదరామాద్,నేటిధాత్రి:
ఎన్నికలముందు రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా ప్రకటిస్తున్న ‘ఉచిత’ హామీలు ప్రజలను సోమరిపోతుల్లాగా, పరాన్నభుక్తులుగా మారేలా చేస్తున్నాయంటూ బుధవారం సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు అక్షరసత్యం. ఈ అనుచిత ఉచితాలతో ప్రజలు ఇక పనిపై దృష్టిపెట్టరు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని చెప్పడం రాజకీయ పార్టీలకు ఒక హెచ్చరిక వంటిదే. ఈ ఉచితాల వల్ల మనుషులు పనిచేయడానికి ఇష్టపడరు. ముఖ్యంగా ఉచిత రేషన్లు, పనిచేయకుండానే డబ్బులు చేతిలో పడుతుండటంతో ఎవరు పనిచేయడానికి ఇష్టపడతారు? ఈవిధంగా దేశంలో ‘పరాన్నభుక్తుల’ వర్గాన్ని మనం చేజేతులారా తయారుచేస్తున్నామని కోర్టు వ్యా ఖ్యానించింది. నిజానికి ప్రభుత్వాలు అమలు చేస్తున్న చాలా సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధులను నిరుపేదల ఖాతాల్లోకి నేరుగా జమచేస్తున్నారు. అర్హులకు ఇది అందితే ఫర్వాలేదు. కానీ అనర్హుల ఖాతాల్లోకి కూడా ఇవి వెళితే వారిక పనిచేయడం మానేస్తారు. ఆవిధంగా పనిచేసే సామర్థ్యమున్నవారి విషయంలో ఇది ఎంత మాత్రం శ్రేయస్కర ఫలితాలనివ్వదు. ఎన్నికల్లో గెలవడానికి రాజకీయపార్టీలకు ఆయా పథకాలు ఉపకరిస్తాయేమో కాని, ప్రభుత్వ ఆర్థికవ్యవస్థతో పాటు శ్రామిక మార్కెట్లు దారుణంగా దెబ్బతింటాయన్న సంగతిని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నా రు.
అన్నీ ఉచితంగా లభిస్తున్నప్పుడు ఎవ్వరూ పనికెళ్లరు. ప్రధానంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రతికూల ప్రభావం ఎక్కువ. ఉచితరేషన్‌ను చాలా రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. ఫలితంగా చాలా గ్రామాల్లో వ్యవసాయ సీజన్‌లో శ్రామికులు దొరకని పరిస్థితి! అన్నీ ఉచితంగా లభిస్తుంటేపనికెళ్లేవారెవరు? పొట్ట నింపుకోవడానికే పనికెళ్లడం! ఇంటివద్దే పొట్ట నిండుతుంటే పనినెవరు పట్టించుకుంటారు? సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యల నేపథ్యంలో, రాజకీయ పార్టీలు ఇచ్చే ఎన్నికల వాగ్దానాలపై మరోసారి చర్చ మొదలైంది. ఈవిధంగా ఎన్నికల ముందు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే రీతిలో హామీలివ్వడం, నగదు ప్రోత్సాహకాల పంపిణీ వంటివి ఎన్నికల చట్టాల పరిధి లో నేరంగా పరిగణించే విషయంలో సుప్రీంకోర్టు మరింత కఠినంగా వ్యవహరించాలి. ఈ నేప థ్యంలో, ఇటువంటి హామీలు ఎన్నికల చట్టాల ఉల్లంఘనకిందికి రాదని 2013లో తానిచ్చిన తీ ర్పును సరిదిద్దే అవకాశం వుంది. అయితే ఇటువంటి అంశాలపై న్యాయవ్యవస్థ కల్పించుకోవడంఎంతవరకు సమంజసం? వీటికి సంబంధించి తగిన ఆదేశాలు జారీచేయవచ్చా? లేక ఇటువంటి విధానాలను నియంత్రించేందుకు ఒక ప్రత్యేక ‘బాడీ’ని ఏర్పాటు చేయాలా? అనే అంశాలపై విచారణ 2022నుంచి సుప్రీకోర్టు వద్ద పెండిరగ్‌లో వుంది.
ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. అందరికీ నిత్యావసరాలను అందుబాటు ధరల్లో అందించేఉద్దేశంతో కొన్ని వస్తువులపై సబ్సిడీలు ప్రకటించడంలో తప్పులేదు. కానీ ఇప్పుడు రాజకీయ పార్టీలు సబ్సిడీ స్థాయిని దాటి ఉచితాల దశకు చేరుకున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే సబ్సిడీకి,ఉచితాలకు మధ్య ఉన్న విభజనరేఖను రాజకీయ పార్టీలు చెరిపేశాయనే చెప్పాలి. ఇందుకు కారణం రాజకీయపార్టీల మధ్య వుండే నిర్లక్ష్యపూరిత పోటీ!
ఈ ఉచితాల ప్రభావంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక పరిశోధనా పత్రాన్ని విడుదల చే సింది. దీని ప్రకారం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తాము రాయితీ ఇవ్వాలనుకుంటున్న వాటిల్లో కొ న్నింటిని ఉచితంగా ప్రజలకు అందించడానికి ముందుకొస్తున్నాయి. అయితే ఈ ఉచితాలకు ఒక స్పష్టమైన నిర్వచనం లేదు. ప్రజలకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించేవి అయితే అటువంటి సబ్సి డీలవల్ల ఇబ్బంది వుండదు. ఉదాహరణకు ప్రజాపంపిణీ వ్యవస్థ, ఉపాధి హామీ పథకాలు, విద్య, ఆరోగ్య అంశాలకు ప్రభుత్వ మద్దతు వంటివి సామాజిక ప్రయోజనానికి, ప్రజల ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తాయి. కానీ ఉచిత విద్యుత్, ఉచితంగా మంచినీటి సరఫరా, ఉచిత రవాణా సదు పాయం, పెండిరగ్‌లో వున్న రుణాలను రద్దు చేయడం వంటివి ‘ఉచితాలు’గా చెప్పవచ్చు. ఇవి రుణాలు తీసుకునే సంస్కృతినే దారుణంగా దెబ్బతీస్తాయి. ఎట్లా అంటే ఒక వ్యక్తి తన స్థాయికి తగిన రుణాన్ని తీసుకొని తిరిగి చెల్లించడానికి ప్రయత్నిస్తాడు. అదే ప్రభుత్వమే ఆ చెల్లింపు జరిపితే రుణాలు తీసుకోవడంలో ప్రజలు బాధ్యతారాహిత్యాన్ని ప్రదర్శిస్తారు. ఇక క్రాస్`సబ్సిడైజేషన్ ( అంటే ఒక వర్గానికి ప్రయోజనం కలిగించేందుకు మరో వర్గంవారిపై ఎక్కువ ధరలు విధించడం) ప్రైవేటు పెట్టుబడులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. ఇక వర్తమాన ధరల ప్రకారం ఎటువంటి ప్రోత్సాహకాలు లేని పనివల్ల, శ్రామికుల భాగస్వామ్యం దారుణంగా పడిపోతుందని ఈ పరిశోధనా పత్రం వెల్లడిరచింది.
కొన్ని రకాల ఉచిత పథకాలు తక్కువ లీకేజ్‌లతో నిజమైన లబ్దిదారులకు ప్రయోజనం కలిగించవచ్చు. అయితే ఇందుకు వెచ్చిస్తున్న పెద్దమొత్తం నిధులవల్ల కలుగుతున్న ప్రయోజనాలను కచ్చి తంగా అంచనా వేయాలి. లేకపోతే ఈ ఉచితాలవల్ల ధరల్లో వచ్చే వికృత మార్పులు, ప్రజల్లో పని సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీయడమే కాదు వనరుల దుర్వినియోగం కూడా సాధ్యం. ఉచిత విద్యుత్, ఉచిత నీటి సరఫరా వల్ల ఒకపక్క పర్యావరణం దెబ్బతింటే మరోపక్క విచ్చలవిడి నీటి వినియోగం వల్ల నీటితావులు ఎండిపోయే ప్రమాదముంది. ఉదాహరణకు గతంలో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌ను అమలు చేస్తామని ప్రకటించింది. ఇది అప్పట్లో పార్టీ అధికారంలోకి రావడానికి దోహదం చేసినా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బతినడమే కాదు, నెలవారీ జీతాలు కూడా చెల్లించలేని దుస్థితికి చేరుకుంది. ఇటువంటి పరిస్థితిలో అభివృద్ధి మాట ఎత్తడం సాధ్యమా? విచిత్రంగా మరికొన్ని రాష్ట్రాలు కూడా ఈ పథకాన్ని అమలు పరచడానికి ఆసక్తి చూపాయి. ఈ నేపథ్యంలో ‘‘స్టేట్ ఫైనాన్సెస్: ఎ స్టడీ ఆఫ్ బడ్జెట్ 2023`24’ పేరిట రిజర్వ్ బ్యాంకు విడుదల చేసిన నివేదికలో, ఈ పథకాన్ని అమలు చేయడం రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులకు ఆత్మహత్యా సదృశం వంటిదని పేర్కొంది. దీని అమ లు రాష్ట్రాల అభివృద్ధిని పరిమితం చేస్తుందని కూడా హెచ్చరించింది. ప్రస్తుతం అమల్లో వున్న జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్) స్థానంలో గతంలో రద్దుచేసిన ఓల్డ్ పింఛను విధానాన్ని అమల్లోకి తెస్తే ఎన్‌పీఎస్ కింద చెల్లించే మొత్తం కంటే 4.5శాతం అధిక మొత్తాన్ని ప్రభుత్వాలు ఖర్చు చేయాల్సి వుంటుంది. 2060 నాటికి దేశ జీడీపీలో ఈ చెల్లింపులు వార్షికంగా 0.9%కు చేరుకుంటాయని కూడా పేర్కొంది. పంజాబ్, కర్ణాటక రాష్ట్రాలు కూడా అలవిమాలిన ఉచితాలు ప్రకటించి ఇప్పుడు నానా ఇబ్బందులు పడుతున్నాయి.
కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ వంటి విపక్ష పార్టీలు విద్యుత్ సబ్సిడీపై హామీలు గుప్పిస్తున్నాయి. పరి శీలిస్తే వివిధ రాష్ట్రాలు కొన్ని యూనిట్ల వరకు విద్యుత్ సబ్సిడీని అమలు చేస్తున్నాయి. ఈ సబ్సిడీల చెల్లింపుకు తమ ఆదాయంలో 8 నుంచి 9శాతం వరకు ఖర్చుచేయాల్సి వస్తుండటంతో ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ఇబ్బందులకు గురవుతోంది. ఇటువంటి అయోగ్య సబ్సిడీలు ఆయా రాష్ట్రాల పెట్టుబడి వ్యయాలకు పెద్ద అడ్డంకిగా మారాయని ఆర్.బి.ఐ. నివేదిక స్పష్టం చేసింది.
ఫాలే ఇండియా ఫౌండేషన్ విడుదల చేసిన నివేదిక కూడా ఉచిత విద్యుత్ వల్ల ఆర్థికంగా రాష్ట్రాలకు అనర్థదాయకమని స్పష్టం చేసింది. పంజాబ్ వంటి తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న రాష్ట్రాలు ఈ సబ్సిడీని పూర్తిగా ఎత్తివేయడమే ఉచితమని కూడా సూచించింది.
కేవలం అధికారమే పరమావధిగా, నిర్లక్ష్య పూరిత వైఖరితో పార్టీలు అనుసరిస్తున్న ఈ ఉచితాల సంస్కృతివల్ల ప్రధానంగా నష్టపోయేది పన్ను చెల్లింపుదార్లు. తామిచ్చిన ఉచితహామీలను అమలు చేయడానికి అవసరమైన నిధులను కేవలం పన్నుల విధింపు ద్వారానే ప్రజల జేబులకు చిల్లులు పెట్టి ప్రభుత్వాలు వసూలు చేస్తున్నాయి. అభివృద్ధికి పెద్దమొత్తంలో పెట్టుబడి వ్యయం అవసరం. కానీ వచ్చిన ఆదాయంలో సింహభాంగా ఈ ఉచితాలకే పోతుంటే, ఇక అభివృద్ధి మాటెక్కడ? పన్నుల పెంపుకూడా ఒక స్థాయి వరకే చేపట్టగలవు. ఆ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చే యక తప్పడంలేదు. ఒక్కసారి అప్పు తీసుకోవడం మొదలైతే ఆ ఊబినుంచి బయటపడటం ఎవ్వరి వల్లా కాదు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో సహా పలు రాష్ట్రాలు అప్పుల ఊబిలో పీకల్లోతు కూరుకుపోయాయంటే ప్రధాన కారణం ఈ అనుచిత ఉచితాలే! నిర్లక్ష్య రాజకీయ పార్టీలు, ఆలోచన లేని ఓటర్లు ఈ ఉచితాల మాయలో పడి అభివృద్ధిని పట్టించుకోకపోవడం వర్తమాన విషాదం!