బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్
రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం అయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సమగ్ర కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకొని అందుకోసం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశారని, కులగణన చేపట్టడానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 26ను విడుదల చేసి, రూ.150 కోట్ల బడ్జెట్ ను కూడా విడుదల చేసిందని ఆయన గుర్తు చేశారు. ఈలోపు లోక్ సభ ఎన్నికలు రావడంతో కులగణన లెక్కలు సేకరించడానికి కొంత బ్రేక్ పడిందన్నారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసినందున తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకుని కులగణన ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. కులగణన లేకుండా, బీసీ రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే బీసీలు రాజకీయంగా నష్టపోతారని మహేందర్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. బీసీలు ఆర్థికంగా లేరనే నేపంతో గత అసెంబ్లీ ఎన్నికలు, నిన్న మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు టిక్కెట్లు ఇవ్వలేదని, కనీసం స్థానిక సంస్థల ఎన్నికలలోనైనా బీసీలు పోటీ చేయడానికి అవకాశం రావాలంటే..జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలన్నారు