`అన్ని మాల్స్ చేసేది మోసమే! మీ సొమ్ముకు కన్నం వేయడమే!
`కాటన్ కార్పోరేషన్ ఏం చేస్తున్నట్లు!
`మాల్స్‌లో మోసం ఎందుకు బైట పెట్టనట్లు!
`అద్దాల మేడల్లో కళ్లకు గంతలు కట్టడమే
`రంగు రంగుల అబద్ధపు ప్రదర్శనే!
`క్వింటాళ్ల చొప్పున తెచ్చి కిలోల చొప్పున అమ్ముకోవడమే!
`ఇష్టమొచ్చిన ధరలు పెంచి అంటగట్టడమే!
`క్లియరెన్స్ సేల్ కిటుకంతా మోసమే!
`డిస్కౌంట్ పేరుతో బురిడీ కొట్టించడమే!
`కొత్త స్టాక్ వచ్చిందంటూ చేసే ప్రచారమంతా ఫేకే.
`అమ్మకాల కోసం జనం నమ్మకాలతో ఆటలాడుకోవడమే.
`ప్రజల బలహీనతలను సొమ్ము చేసుకోవడమే!
`రూపాయికి తెచ్చి వందకు అమ్ముకోవడమే!
`ధరల తగ్గింపు మాటల గారడే!
`ధరలు అమాంతం పెంచి అగ్గువ అని ప్రచారం చేసుకోవడమే.
`ఏ పండుగకు ఆ గొడుగు పట్టడమే.
`ఆషాడం సేల్ పేరుతో దోపిడే.
`శ్రావణ మాసంలో సగం ధరలు బూటకమే.
`దసరా, దీపావళికి దండిగా సంపాదనే!
`మొత్తంగా ప్రజలను నమ్మించి అమ్మకాలు పెంచుకోవడమే.
`అమ్ముడుపోని బట్టలు కాలబెట్టడమే!
`ఇన్సూరెన్స్‌లతో మళ్ళీ కోట్లు కొల్లగొట్టడమే.
`బట్టల వ్యాపారంలో ఇదంతా మయాజాలమే.
`దగదగ మెరిసే లైట్లు వేసి కళ్లకు కనికట్టుకట్టడమే.
`మాల్ చూసి మోసపోకండి.
`మంచి బట్టలని నమ్మకండి.
`పుట్టగొడుగుల్లా పెరిగిన మాల్స్‌లలో అమ్మకాలపై దృష్టి పెట్టరెందుకు!
బట్టల వ్యాపారం మంచిదే..గొప్పదే. పది మందికి ఉపాధి కల్పించేదే…కాని అదొక్కటే కాదు దాని వెనకాల మోసాలు దాగి వుంటున్నాయి. పైకి కనిపించే వ్యవహారమంతా మంచి వ్యాపారమేమీ కాదు. అంతా మోసం..దగా..కూడుకుంటోంది. ఎలాంటి వారికైనా బట్టల నాణ్యత కనిపెట్టడం ఎవరి వల్ల కాదు. మందులలో అవి మంచి మందులా కాదా? అని తెలుసుకోవచ్చు. వాటి నాణ్యత ఎంత కాలముంటుందో చెప్పొచ్చు. కాని బట్టల విషయంలో ఎవరూ అంచనా వేయలేరు. ఖచ్చితంగా చెప్పలేరు. దానికి ఇంత ఖరీదని ఎవరూ లెక్క వేయలేరు. ఏ వ్యాపారంలోనైనా ఒక ఖచ్చితమైన ధర వుంటుంది. కాని బట్టల వ్యాపారంలో ఒక ధర అనేది దేనికీ వుండదు. షాపుల యజమానులు నిర్ణయించిందే ధర. వారు చెప్పిందే లెక్క. అందుకే ఏ వ్యాపారం విస్తరించకపోయినా బట్టల వ్యాపారం ఎప్పుడూ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతూనే వుంటుంది. కూడు, గూడు, గుడ్డ అనేవి ప్రతి వ్యక్తికి నిత్యావసరాలకన్నా ఎక్కువ. తినకుండా వుండలేడు. బతకలేడు. కాని తినే బియ్యం ఏ రకమో తెలుసు. బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలు ఎలా వుంటాయో తెలుసు. వ్యాపారులు ఎంతకు అమ్ముతున్నారో తెలుసు. ఒక వేళ ఎక్కడైనా ఎక్కువ ధరలకు విక్రయించినా తెలిసిపోతుంది. ఆఖరుకు బంగారం ధరలను కూడా అంచనా వేయొచ్చు. బంగారు వస్తువుల నాణ్యత తెలుసుకోవచ్చు. ఇల్లు విషయంలో కూడా ఒక ఖచ్చితమైన లెక్కలు మనం వేసుకోవచ్చు. మనం ధరించే దుస్తుల విషయంలో ఆ లెక్క ఎప్పటికీ తేలదు. ఎవరు పసిగట్టలేదు. షాపుల యజమానులు చెప్పిందే లెక్క. వారి అమ్మకమే మన మన మీద దయ అన్నట్లు సాగుతుంది. చిన్న షాపుల్లో బట్టలను మనం ఎంతో కొంత బేరమాడి కొనుగోలు చేసుకోవచ్చు. కాని బట్టల వ్యాపారంలో విచ్చలవిడిగా పుట్టగొడుగుల్లా వచ్చిన మాల్స్‌లలో మాత్రం వారు చెప్పిందే ధర. వాటికి వేసిన స్టిక్కర్లే కొలమానం. మాల్స్ విపరీతంగా పెరిగిపోయాయి. ఒకప్పుడు నగరాలలో కూడా అనేక బట్టల షాపులు వుండేవి. ఇప్పుడు వాటన్నింటినీ మాల్స్ వచ్చేసి మింగేశాయి. చిన్న చిన్న పట్టణాలకు సైతం పెద్ద పెద్ద మాల్స్ వచ్చి చేరాయి. ఐదు నుంచి పది లక్షల జనాభా వున్న పట్టణాలతోపాటు, నగరాలను ఎంపిక చేసుకొని విపరీతంగా ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి వ్యాపారంలోనైనా నష్టాలుంటాయోమో కాని బట్టల వ్యాపారంలో కొనసాగిన మాల్స్ మూసేసిన చరిత్ర ఇప్పటి వరకు లేదు. తెలంగాణలో కొత్త జిల్లాలు వచ్చిన తర్వాత రియల్ వ్యాపారం, బట్టల వ్యాపారం విపరీతంగా పెరిగిపోయాయి. మన రాష్ట్ర వ్యాపారులే కాదు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్దఎత్తున వ్యాపారులు వస్తున్నారు. మాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలు కూడా వాటిని బాగా ఎంచుకుంటున్నారు. ఖరీదైన బట్టలను కొనుగోలు చేయడం స్టేటస్ సింబల్‌గా మార్చుకుంటున్నారు. దాంతో మాల్స్‌ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ వస్తుంది. కాని మనం కొనుగోలు చేస్తున్న బట్టల్లో నాణ్యత తెలుసుకుంటున్నామా? గుర్తిస్తున్నామా? ఒకటి రెండు ఉతుకులకే ఎంతో ఖరీదైన బట్టలు కూడా రూపు రేఖలు చెదిరిపోతున్నాయి. వాటి నాణ్యతాలోపం బైట పడుతున్నాయి. వాటిని మళ్లీ మాల్స్‌కు తీసుకెళ్లలేం. మాల్స్ యజమానులను నిలదీయలేం. ఎవరో ఒకరు…ఎక్కడో అక్కడ ప్రశ్నించినా మీ ఉతుకులో లోపాలంటారే గాని, మా బట్టల్లో తప్పుందని మాత్రం ఎప్పుడూ ఒప్పుకోరు. వినియోగదారులు అక్కడిదాక ఎప్పుడూ వెళ్లరు. ప్రజల ఆ బలహీనతే మాల్స్‌కు పెట్టుబడిగా మారుతున్నాయి. ఆదాయ మార్గాలుగా మారుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మాల్స్‌లో మనం చూసే బట్టలన్నీ ముతక బట్టలే. ముక్కిన బట్టలే. ఒక్కసారే లారీల కొద్ది బట్టలు క్వింటాళ్ల కొద్ది కొనుగోలు చేసి, మాల్స్‌కు నాలుగైదు రెట్లు పెద్దవైన గోడౌన్లలో ఏళ్ల తరబడి నిలువ చేసి వాటిని వినియోగదారులకు అంటగడుతుంటారు. కొత్త స్టాక్ అని నమ్మించి మోసం చేస్తుంటారు. ఎప్పుడో కొనుగోలు చేసిన బట్టలకు కొత్త కొత్త స్టిక్కర్లు వేసి ప్రజల నిండా ముంచేస్తుంటారు. నాసికరకం బట్టలనే ఎక్కువగా అంటగట్టేస్తుంటారు. వాటిపై వుండే రంగులను చూసి మోసపోతుంటాం. అయినా అలాంటి మాల్స్‌లనే ఎంచుకొని పదే పదే కొనుగోలు చేస్తుంటాం. ఎందుకంటే అవి అద్దాల మేడలు. రంగుల రంగుల ప్రపంచం. రకరాల రంగుల లైట్లన్నీ వేస్తారు. సెంట్రల్ ఏసిలతో చల్లబరుస్తారు. ఎంతసేపైనా సరే బట్టలను ఎంచుకునే సమయం ఇస్తారు. మాయ మాటలతో ఒకటి కొనుగోలు చేయాలని వెళ్లిన వారి చేత పది కొనిపిస్తారు. ఇదే అసలు రహస్యం. నిజానికి అ రంగురంగుల ప్రదర్శన అంతా అబద్దమే…మన కళ్లను మనతోనే మోసం చేసే ఎత్తుగడలు. ఇక క్లియరెన్స్ సేల్ అంటారు. అంటే అర్ధమేమిటో ఎవరికీ తెలుసు. అయినా ఎగబడి కొంటాం. అంటే పాత స్టాక్‌ను తీసేస్తున్నాం. అవి అడ్డికిపావుసేరు అమ్మేస్తున్నాం. డెబ్బై ఎనభై శాతం రిబేటు ఇస్తున్నామంటారు. అదెలా సాధ్యమని ఎవరూ ఆలోచించరు. ఐదు వందల చీరపై రెండు వేల స్టిక్కర్ అతికించి, డిస్కౌంట్ పేరుతో అదే ఐదు వందలకు అమ్మేస్తుంటారు. మనల్ని నిండా ముంచేస్తుంటారు. ఐదు వందల చీరను వందకు అమ్మితే అది డిస్కౌంట్ అవుతుందే తప్ప, ధరలు ఇష్టాను సారం పెంచి, తగ్గించినట్లు ప్రచారం చేసి అమ్మితే ఎలా డిస్కౌంట్ అవుతుందో అని ఒక్క క్షణం ఆలోచించం. డిస్కౌంట్ సేల్ డిస్కౌంట్ సేల్ అంటూ బురిడీ కొట్టిస్తూనే వుంటారు. మనం వెళ్లి కొంటూనే వుంటాం. షాపింగ్ అని అందమైన పేరుపెట్టుకొని అవసరం లేకున్నా వేలు తగలేసి చీరలు, డ్రెస్సులు కొనుగోలు చేస్తుంటాం. మన బీరువాలు నింపేసుకుంటాం. వాటిని కట్టేది లేదు. చూసుకొని మురుస్తుంటాం. కొత్త స్టాక్ వచ్చిందని, ప్రతి కొనుగోలు మీద బంపర్ ఆఫర్లు పెట్టామని ప్రచారం చేస్తుంటారు. లక్కీ డ్రాలు పెడుతుంటారు. బంగారం, ఇతర ఖరీదైన వస్తువులను ఎరగా చూపుతారు. మళ్లీ మన చేత బట్టలు కొనిపిస్తూనే వుంటారు. ఎండాకాలంలో పెళ్లిళ్ల సీజన్ అయిపోగానే సహజంగా ఆషాడం వస్తుంది. ఆషాడంలో ఎలాంటి కొత్త వస్తువులు ఎవరూ కొనుగోలు చేయరు. కాని బట్టల మాల్స్‌మాత్రం ఆషాడం స్పెషల్ అని కొనిపిస్తారు. పెళ్లి చేసుకొని అత్తవారింటి నుంచి అమ్మగారింటికి వచ్చిన ఆడపిల్లల చేత ఆషాడ మాసంలో కూడా బట్టలు కొనుగోలు చేసేలా ఆఫర్లు ప్రకటిస్తారు. ఆషాడం పూర్తయి, శ్రావణ మాసంలో అత్తవారింటికి వెళ్లే కొత్త దంపతుల చేత పవిత్రమైన మాసమంటూ కొత్త బట్టలు కొనుగోలు చేసేలా ప్రచారం సాగిస్తారు. ప్రతి నెల ఏదో ఒక రకమైన ప్రలోభాలకు గురి చేస్తూనే వుంటారు. ఆ తర్వాత వచ్చే దసరా,దీపావళి పూర్తయ్యే సరికి ప్రజల ఇంట్లో వున్న సొమ్మంతా మాల్స్‌లో బట్టల ఖరీదుకు ఖర్చయ్యేలా చేస్తారు. ఏ పండుగ వచ్చినా ఆ పండుగ ఆఫర్లు ప్రకటిస్తుంటారు. అయినా అమ్ముడు పోకుండా వున్న స్టాక్ నంతా అడ్డికి పావుసేరు అమ్మలేరు. అమ్మాలనుకున్నా ఎవరూ కొనుగోలు చేయరు. దాంతో అదును చూసి మాల్స్‌ను అంటిస్తుంటారు. కాలిపోయిందని సాక్ష్యం సృష్టిస్తారు. షార్టు సర్కూట్ అంటారు. మొత్తం బట్టలన్నీ కాలిపోయాయని కట్టు కధలు చెబుతారు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తారు. కోట్లు రూపాయలు అలా కూడా సంపాదిస్తారు. బట్టల వ్యాపారమంతా మాయా జాలమే..మన కళ్లకు గంతలు కట్టడమే. పట్టపగలే చుక్కలు చూపించడమే. పగటి వేళలో రంగు రంగుల లైట్లు వేసి బరిడీ కొట్టించడమే. ముతక బట్టలు కూడా అందంగా కనిపించేలా కనికట్టు చేయడమే. అందుకే మాల్స్ చూసి మోసపోకండి. పైన పటారం.లోన లొటారమే వుంటుంది. మాల్స్ చేసేదంతా మోసమే..మన సొమ్ముకు కన్నం వేయడమే..ఇది తెలుసుకుంటే ఎవరూ మాల్ వరకు వెళ్లరు. చేతి చమరు వదిలించుకోరు. ఇదిలా వుంటే హోటళ్లను తనిఖీ చేసే పుడ్ సేఫ్టీ అధికారులున్నట్లే..బట్టల వ్యాపారంలో మోసాలను అరికట్టేందుకు కూడా కాటన్ కార్పోరేషన్ వుంటుంది. జాతీయ స్దాయిలో దేశమంతా పనిచేస్తుంది. కాని ఎక్కడా కాటన్ కార్పోరేషన్ దాడులు చేసినట్లుగాని, మాల్స్ మీద దాడి చేసినట్లుగాని వార్తలు వుండవు. వాళ్లు వచ్చి వెళ్లిన సంగతి కూడా ఎవరికీ తెలియదు. అంతా గుట్టు చప్పుడు కాకుండా జరుగుతుంది. కాని ఇంత వరకు మాల్స్‌లో నాసి రకం బట్టలు అమ్ముతున్నట్లు తెలిసినా వాళ్లు తీసుకున్న చర్యలు ఏమీ వుండదు. చేనేత కార్మికులు మగ్గం మీద ఎంతో కష్టపడి నేసే పట్టు చీరను పోలిన యంత్రాల తయారీ మీద రెడీ అయిన నాసికరకం చీరను అసలు చీరకన్నా ఎక్కువ ఖరీదుకు అమ్ముతున్నా పట్టించుకునే నాధుడు వుండడు. వాటిపై చర్యలు తీసుకోరు. ప్రభుత్వాలు ఇప్పటికైనా మేలు కోవాలి. ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై దృష్పిపెట్టాలి.