మంత్రులను, శాఖలను మార్చొద్దు!

`ఇప్పుడిప్పుడే శాఖల మీద మంత్రులు పట్డు సాధిస్తున్నారు

`అధికారులు చెప్పేవి నిజమో కాదో అర్థం చేసుకోగలుగుతున్నారు

`ప్రజల కోణంలో మంత్రులు నిర్ణయాలు తీసుకుంటున్నారు

`ఇంతలో మార్చితే మొదటికే మోసం వస్తుంది

`అధికారులలో అహం పెరుగుతుంది

`అధికారులలో మోనోపలి వస్తుంది

`మీడియా సంస్థలు కోరుకుంటే శాఖలు మార్చరు

`జర్నలిస్టులకు నచ్చనంత మాత్రాన మంత్రులను మార్చరు

`నాయకుల మధ్య విభేదాల కోసం తొందరపడొద్దు

`మంత్రులు తమ శాఖల మీద పట్టుకు కొంత సమయం పడుతుంది

`15 నెలల సమయం చాలా చిన్నది

`గతంలో శాఖల మార్పులు జరగిన సందర్భాలున్నాయి

`తక్కువ సమయంలో మార్చిన దాఖలాలు లేవు

`ఇప్పుడిప్పుడే పాలన పరుగందుకుంటోంది

`శాఖలు మార్చితే మంత్రులు మళ్ళీ పూర్తిగా అధికారుల మీద ఆధారపడాల్సి వస్తుంది

`ఆ శాఖల మీద పట్టుకు కుస్తీలు పట్టాల్సి వస్తుంది

`ఇంతలో పుణ్య కాలం గడిచిపోతుంది

`పొరపాటున కూడా అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు

`ఎన్నికలకు ఏడాదిన్నర ముందే మళ్లీ రాజకీయాలపై దృష్టి పెట్టాల్సి వస్తుంది

`నిజం చెప్పాలంటే పరిపాలన సరిగ్గా చేసేది ఓ రెండు సంవత్సరాలు మాత్రమే

`ఇలాంటి సందర్భంలో మంత్రుల శాఖలు మార్చితే కథ మొదటికి వస్తుంది

`ప్రజలకు మంత్రులు దూరమయ్యే పరిస్థితి ఎదురౌతుంది

`మంత్రులు ఎప్పటికప్పుడు పని తీరు చూసుకోవాలి

`నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాలి

`జిల్లాల ప్రగతిపై సమీక్షలు జరపాలి

`పార్టీ కార్యక్రమాలలో పాలు పంచుకుంటుండాలి

`ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో వుండాలి

`ఇన్ని పనుల మధ్య శాఖలు మారితే అన్నింటికీ అంతరాయమే

`ప్రజా సమస్యలు గాలికి వదిలేయడమే!

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

కొత్త మంత్రులు త్వరలో కొలువు తీరనున్నారన్న వార్తలు ఊపందుకున్నాయి. రేపో, మాపో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లుకూడా వార్తలు వస్తున్నాయి. గత కొంత కాలంగా త్వరలో, త్వరలో అనే వార్తలు నిజమయ్యే సమయం ఆసన్నమైంది. ఇంత వరకు బాగానే వుంది. కాని ఇటీవల కొంత మంది మంత్రులకు ఉద్వాసన తప్పదనంటూ కొత్త వార్తలు షికార్లుకొడుతున్నాయి. వాటికితోడు మంత్రుల శాఖల్లో కూడా మార్పులు వుండే అవకాశమందుంటూ కూడా రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. వీటిలో ఎంత వరకు నిజమందో లేదో? తెలియిదు? కాని మీడియా అత్యుత్సాహం మాత్రం ఎక్కువగా వుంది. ఇప్పుడున్న పరిస్దితుల్లో మంత్రులను తొలగించడం సాధ్యమౌతుందా? రెండోసారి మంత్రి వర్గ విస్తరణే ఇంత కాలం పట్టింది. ఒక వేళ ఇద్దరో, ముగ్గురినో మంత్రి వర్గం నుంచి తొలగిస్తే ఏర్పడే రాజకీయ అనిశ్చితి ఎలా వుంటుందనేది ఏ మాత్రం అవగాహన లేని మీడియా సంస్ధలు తమ ఇష్టాను రీతిన వార్తలు రాసేస్తున్నాయి. వాటిని ప్రజలు కూడా నిజమే అనుకునేలా మసాలలు దట్టించి వార్తలు వండి వారుస్తున్నారు. నిజానికి అందులో ఏ మాత్రం నిజం లేదు. మంత్రులను మార్చే అవకాశాలు కనిపించడం లేదు. పైగా ఎవరైనా మంత్రులకు వున్న అదనపు శాఖలను కొత్త మంత్రులకు ఇచ్చే అవకాశం వుంటుంది. కాని ఏకంగా ఇప్పటి వరకు చూస్తున్న శాఖలను మార్చి, కొత్త శాఖలను పాత మంత్రులకు అప్పగించే పరిస్ధితులు లేవు. వుండవు. ఒక వేళ పొరపాటున మంత్రుల శాఖలు మారితే అసంతృప్తి చెలరేగే అవకాశం వుంటుంది. నాయకులను బట్టి ప్రాధాన్యత శాఖలను అప్పగించడం పరిపాటి. అవే శాఖలను అటూ, ఇటూ మంత్రులకు మార్చితే పాలనా పరంగా నష్టం ఏర్పడే పరిస్దితులు ఎదురౌతాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన కేవలం 15 నెలలు మాత్రమే అవుతుంది. మధ్యలో పార్లమెంటు ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలతో కొంత సమయం వృదా అయ్యింది. ఈ కొద్ది సమయంలోనే ఆయా మంత్రులు తమ శాఖలపై పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయంలో మంత్రులను మార్చడం వల్ల ఉద్యోగ వర్గాలకు మరింత బలం చేకూర్చినట్లౌతుంది. ఉద్యోగ వర్గాల తిరుగుబాటుకు కూడా కారణమౌతుంది. ఇప్పుడిప్పుడే ప్రభుత్వానికి, మంత్రులకు అధికారులు ఇచ్చే సూచనలు, అందించే నివేదికలు సరైనవేనా..కాదా? అన్నది మంత్రులు పూర్తి స్దాయిలో తేల్చుకోలేని సందర్భాలే వున్నాయి. అలాంటి సమయంలో ఏకంగా మంత్రుల శాఖలు మార్చితే, మంత్రులు మొదటి నుంచి నేర్చుకోవాల్సి వుంటుంది. అప్పుడు పాలన గాడి తప్పుతుంది. రాష్ట్రంలో కొత్తగా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలనుకుంటున్నారు. సన్నబియ్యం రేషన్‌ ఇచ్చే కార్యక్రమం మొదలు పెట్టారు. బిసి రుణాలు ఇచ్చేందుకు నోటిఫికెషన్‌ విడుదల చేశారు. రికార్డు పద్దు ప్రవేశ పెట్టారు. వీటన్నింటికీ దృష్టిలో పెట్టుకొని మంత్రులు ఒక ప్రణాళికతో ముందకు వెళ్లేందుకు ఇప్పుడిప్పుడే సన్నాహలు చేసుకుంటున్నారు. తమ శాఖలపై పూర్తి స్దాయి పట్టు సాదిస్తున్నారు. ఈ తరుణంలో ఒక వేళ మంత్రుల శాఖలు మారితే మళ్లీ పాలన మొదటికొస్తుంది. పాలన గాడితప్పుతుంది. మంత్రులనే మార్చితే సామాజిక వర్గాలలో అలజడి రేగుతుంది. రాజకీయం మరో వైపు దారి తీసుకుంటుంది. ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కొత్త తలనొప్పి నెత్తిన పెట్టుకున్నట్లౌవుంది. సలహాలు ఇచ్చే వారు ఇస్తారు. కాని వాటిని ఎలా స్వీకరించాలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి తెలియందికాదు. కాని కొన్ని సార్లు పదే పదే కొంత మంది చెప్పే సూచనలు తీసుకోవాల్సి వస్తుంది. కాని మొదటికే మోసం వస్తుంది. గతంలో ఎన్టీఆర్‌ ఇలాగే చేశారు. దాంతో ఆయన పదవీ గండం తెచ్చుకున్నారు. ప్రాంతీయ పార్టీలో నిజానికి అలాంటి తిరుగుబాటు జరిగే అవకాశాలు వుండవు. కాని అదికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఎన్టీఆర్‌ అలాంటి ప్రయోగం చేశారు. ఫలితం అనుభవించారు. ఆనాడు లక్ష్మిపార్వతితోపాటు, కొంత మంది మంత్రులు చెప్పిన చెప్పుడు మాటలు ఎన్టీఆర్‌ వినడం వల్లనే ఆయనకు ఆ పరిస్ధితి వచ్చిందన్న సంగతి తెలియంది కాదు. గతంలో చంద్రబాబు నాయుడు, వైఎస్‌.రాజశేఖరరెడ్డిలు మంత్రుల శాఖలు మార్చిన సందర్భం వుంది. కాని ఇలా అర్ధాంతరంగా మార్చలేదు. అదును చూసి, పరిస్దితులను అవగాహన కల్పించుకొని చేశారు. పైగా అప్పుడు ఉమ్మడి రాష్ట్రం. మంత్రులుగా పనిచేసిన వారు అప్పట్లో ఎంతో కొంత అనుభవం వున్నవారు. అప్పటికే మంత్రిత్వ శాఖల్లో పట్టు వున్న వారు కావడం వల్ల శాఖలు మార్చినా పెద్ద ఇబ్బందులు తలెత్తలేదు. కాని ఎన్టీఆర్‌ లాంటి నాయకుడు తీసుకున్న నిర్ణయం వల్ల మొత్తం క్యాబినేట్‌ మార్చేదాక వెళ్లింది. ఆయన పదవికే గండం వచ్చింది. ఒక్కసారి మంత్రిగా ప్రమాణం చేసిన ప్రతి నాయకుడు తనకిచ్చిన శాఖను సమర్ధవంతంగా పోషించిన నేతగా గుర్తింపు తెచ్చుకోవాలనకుంటారు. మంత్రిగా మంచి పేరు సంపాదించాలని చూస్తారు. కాని కొన్ని సార్లు అవరోదాలు ఎదురుకావొచ్చు. వాటిని అధిమించాలంటే కొంత సమయం పడుతుంది. పైగా మంత్రి అంటే రాజకీయాలకు అతీతులు కాదు. రాజకీయం చేస్తూనే మంత్రిగా కర్తవ్యం నిర్వర్తించాల్సివుంటుంది. ఆ సమయంలో అనేక సవాళ్లు ఎదుర్కొవాల్సివుంటుంది. మంత్రుల ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల కోణంలో తీసుకుంటారు. కాని ఉన్నతాధికారులు రాష్ట్ర ఆర్దిక పరిస్దితిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు చెబుతుంటారు. ఇక్కడే మంత్రుల పనితీరు ఆదారపడి వుంటుంది. సహజంగా మంత్రులు ఏ పనిచేయాలనుకున్నా అధికారులు ఆర్దిక పరిస్ధితులు సహకరించకపోవచ్చు. అనే సూచనలే చేస్తారు. అది వాళ్ల తప్పు కాదు. రాష్ట్రాన్ని అప్పుల వైపు నడవాలని ఏ ఉన్నతాధికారి అనుకోరు. కాని అదే ఉన్నతాదికారులు పనులు చేయడంలో కూడా కొంత మంది తీవ్ర జాప్యం చేస్తుంటారు. కొత్తగా మంత్రులైన వారిని తప్పుదోవ కూడా పట్టిస్తుంటారు. సరైన సమాచారం సకాలం ఇవ్వకుండా కాలయాపన చేస్తుంటారు. ఇలాంటి సమయంలో అధికారుల మీద మంత్రులు కేకలేయడం తప్ప మరేం చేయలేరు. వారిని మార్చుకునే అవకాశం కూడా రాకపోవచ్చు. ఎందుకంటే ఉన్నతాదికారుల సంఖ్య చాలా తక్కువగా వుంటంది. అటు నుంచి, ఇటు నుంచి అటు మార్చుకోవడం తప్ప వారిని పక్కన పెట్టే అవకాశం వుండదు. గత ప్రభుత్వ హాయాంలో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్న అదికారులే ఇప్పుడూ కూడా కీలకంగా పనిచేస్తున్నారు. అలాంటి అదికారుల మూలంగా కొంత మంది మంత్రుల పని తీరుపై ప్రభావం చూపుతుందని చెప్పక తప్పదు. ఇప్పుడిప్పుడే మంత్రులు తమ శాఖలపై పట్టు సాదిస్తూ, సంస్కరణలు చేసేందుకు సిద్దమౌతున్నారు. ఈ సమయంలో మంత్రుల శాఖలు మార్చితే ప్రభుత్వానికి చాలా ఇబ్బందులు ఎదురౌతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అదికారలు చేతుల్లో మంత్రులు కీలుబొమ్మలౌతారు. అదికారులు ఏది చెప్పిందే నిజమని నమ్మే పరిస్ధితి వస్తుంది. అదికారుల్లో మోనోపలి మొదలౌతుంది. మంత్రి పనితీరు సరిగ్గా లేదంటూ ఆ శాఖ అధికారులే లీకులిచ్చి వార్తలు రాయించే పరిస్దితి వస్తుంది. గతంలో ఇలాంటివి అనేకం జరిగిన సందర్భాలున్నాయి. ఎందుకంటే ఒకశాఖలో తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు మాత్రమే మంత్రులను పక్కన పెడతారు. కాని మీడియా వార్తలను ఆదారం చేసుకొని మంత్రుల మార్పు సరైంది కాదు. ఒక వేళ అదే జరిగితే మంత్రుల శాఖలు మారిన మరు క్షణం నుంచి మళ్లీ మంత్రుల మీద కొత్త వార్తలు మొదలౌతాయి. ప్రతిపక్షాలకు ఆయుదాలౌతాయి. కోరికోరి ప్రభుత్వమే ప్రతిపక్షాల ముందు చులకనయ్యే పరిసి ్దతి ఎదురౌతుంది. నిజం నిష్టూరంగానే వుంటుంది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికూడా ఒక సందర్భంలో నాకు మంత్రుల సహకారం సరిగ్గా లేదంటూ వ్యాఖ్యానించారు. వాళ్లను దారికి తెచ్చుకోవడం కోసమని శాఖలను మార్చితే మరింత వ్యతిరేకత మూటగట్టుకోవడం తప్ప మరొకటి వుండదు. ఏది ఏమైనా మంత్రుల శాఖల మార్పుల్లో తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. సమస్యలు సృష్టించుకోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!