
చెన్నైలో అవార్డు ప్రధాన.
జర్నలిజంలో, సేవా కార్యక్రమంలో ముందు వరసలో “వెంకటస్వామి”.
వైస్ ఛాన్స్లర్ కే.వెంకటేష్ చేతుల మీదుగా డాక్టరేట్ ప్రధానం.
“వెంకటస్వామి” కి అభినందనలు తెలిపిన “వక్కల” శ్రేయోభిలాషులు.
“నేటిధాత్రి”,హనుమకొండ:
హనుమకొండ జిల్లాలోని నారాయణగిరి గ్రామానికి చెందిన వక్కల వెంకటస్వామికి విశిష్ట గౌరవంగా డాక్టరేట్ అవార్డు లభించింది. గత రెండు దశాబ్దాలకు పైగా ప్రజల సమస్యలను సమర్థవంతంగా వెలికి తీసే నిబద్ధతతో జర్నలిస్టుగా, సంపాదకునిగా పనిచేస్తూ సామాజిక హితాన్ని లక్ష్యంగా చేసుకొని సేవలందిస్తున్నారు.
వెంకటస్వామి అనేక సంవత్సరాలుగా తనకు అందిన సమాచారాన్ని, నిజాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను నిబద్ధతతో నిర్వహిస్తూ, అవినీతి, అక్రమాలపై స్పష్టమైన వైఖరితో శబ్దం లేని వేదనకు స్వరం లాంటి పాత్ర పోషిస్తున్నారు. ఆయన నిర్వహిస్తున్న పత్రిక, వార్తా వ్యవస్థలు నిస్వార్థంగా ప్రజల తరపున నిలబడి ధైర్యంగా సమస్యలను వెలికి తీయడంలో ముందుండుతున్నాయి.
కేవలం జర్నలిజంతోనే కాక, “నా వివేకం” అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి అనాధలు, వృద్ధులు, వికలాంగులు, నిరుపేదలకు తనవంతుగా సేవలందిస్తూ, తన సామర్థ్యాన్ని మానవత్వ సేవకే అంకితం చేశారు. విద్యా సామగ్రి, దుస్తులు, ఆహార సరఫరా సహా ఇతర అవసరాల విషయాల్లో సహకారం అందిస్తూ నిస్వార్థ సేవా మార్గంలో పయనిస్తున్నారు. యువతలో సామాజిక చైతన్యం కలిగించేందుకు ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు. వారి మాటలు, ఆచరణలు ఎంతో మందికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.
ఈ సేవలను గుర్తించి, అమెరికాలోని డెలివేర్ రాష్ట్రానికి చెందిన గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ వారు వక్కల వెంకటస్వామికి గౌరవ డాక్టరేట్ ప్రకటించారు. చెన్నైలోని భారతీయ విద్యా భవన్ వేదికగా జరిగిన కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలు, దేశాల నుండి వచ్చిన అతిథుల సమక్షంలో వైస్ ఛాన్సలర్ కే.వెంకటేష్ చేతుల మీదుగా డాక్టరేట్ అవార్డును అందించారు.
వెంకటస్వామి చేసిన సేవలు గ్రామీణ ప్రాంతాలలో ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఒక పక్షపాత రహిత ప్రజాప్రతినిధిగా, సామాజిక సేవా పథంలో అగ్రగామిగా ఆయన చేసిన కృషికి గౌరవంగా లభించిన ఈ పురస్కారం ఆయన నిబద్ధతకు నిదర్శనంగా నిలిచిందని పలువురు అభినందించారు.