కాలేయ ఆరోగ్యంపై డాక్టర్ నవత అవగాహన

మన శరీరంలో కాలేయం అత్యంత కీలకమైన అవయవం

-మొగుళ్లపల్లి మండల వైద్యాధికారిణి డాక్టర్ నవత
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి :

 

మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాలలో కాలేయం (లివర్ )ఒకటని, ఇది శరీరంలో అనేక ముఖ్యమైన జీవక్రీయలకు కేంద్ర బిందువుగా పనిచేస్తుందని, మనం తీసుకునే ఆహారం, నీరు, ఔషధాలు వంటి అన్ని పదార్థాలను శుద్ధి చేయడంలో కాలేయం ప్రధాన పాత్ర పోషిస్తుందని, ఇది 500లకు పైగా ముఖ్యమైన విధులను నిర్వహిస్తుందని మొగుళ్ళపల్లి మండల వైద్యాధికారిణి డాక్టర్ నవత అన్నారు. గురువారం మొగుళ్లపల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కాలేయానికి ప్రత్యేకంగా పునరుత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ నిర్లక్ష్యం వలన తీవ్రమైన నష్టం కలగవచ్చని, ముఖ్యంగా కాలేయం దెబ్బతిన్న ప్రారంభ దశలో లక్షణాలు కనిపించకపోవడం వల్ల దీనిని నిశ్శబ్దహంతకుడు అని పిలుస్తారని తెలిపారు. ప్రస్తుతం కాలేయ వ్యాధులు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్నాయని, మద్య సేవనం మాత్రమే కాకుండా అధిక కొవ్వు వున్న ఆహారం, జంక్ ఫుడ్, వ్యాయామం లేకపోవడం వంటి ఆధునిక జీవనశైలి కారణంగా “నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ “ కేసులు కూడా ఘననీయంగా పెరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఆమె సూచించారు.
ప్రతిరోజు కనీసం 30 నుండి 45 నిమిషాలు వ్యాయామం చేయాలని, సమతుల్యమైన ఆహారం తీసుకోవాలని, జంక్ ఫుడ్, అధిక కొవ్వు పదార్థాలు, చక్కెర పానీయాలు తగ్గించాలన్నారు. మద్యపానం పూర్తిగా నివారించాలని, తగినంత నీరు తాగాలని, ఏడాదికి ఒకసారి కాలేయ పనితీరు పరీక్షలు చేయించుకోవాలన్నారు. హెపటైటిస్ బి వంటి వ్యాధులపై అవగాహన పెంచుకోవాలని, “మంచి అలవాట్లు -పటిష్టమైన కాలేయం”అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలన్నారు. ఆరోగ్యవంతమైన దేశ నిర్మాణంలో పౌరుల ఆరోగ్యమే కీలకమని, కాలేయము మన శరీరంలోని నిశ్శబ్ద ఇంజన్ వంటిదని, అది ఎంత స్మూత్ గా రన్ అయితే, మన జీవితమంతా కాలం సాఫీగా సాగుతుందని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, మన కాలేయాన్ని కాపాడుకుందాం అని ప్రతిజ్ఞ చేద్దాం. కాలేయ రక్షణ జీవన రక్ష అని గుర్తిద్దామన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version