-ఇసుక అక్రమ దందాపై జిల్లా నాయకులు తక్కలపల్లి రాజు ఫైర్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
ఇసుక అక్రమ దందా చేసేవారు భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు పేరును వాడుకొని చెడ్డపేరు తేవోద్దని..అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తక్కలపల్లి రాజు అధికారులను కోరారు. శనివారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మండలంలో ఇసుక మాఫియా ముఠాగా ఏర్పడిన కొందరు వ్యక్తులు అధికారులను, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఎమ్మెల్యే పేరును వాడుకుంటూ..ఆయనకు చెడ్డ పేరు తేవడానికి కొందరు వ్యక్తులు కుట్రలు పన్నుతున్నారని రాజు మండిపడ్డారు. అలాంటి వారిపై తగిన చర్యలు తీసుకొని ప్రకృతి వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత అధికారులపై, ప్రజలపై ఉందన్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వాగుల సమీపంలోని గ్రామాల ప్రజలు ఇల్లు కట్టుకునేందుకు మాత్రమే పర్మిషన్ ఇవ్వాలని అధికారులను కోరారని, కానీ ఎమ్మెల్యేకు చెడ్డపేరు తేవాలనే సంకల్పంతో ప్రతిపక్ష నాయకులు కొందరు వ్యక్తులతో ఇసుక మాఫియా ముఠాను ఏర్పాటు చేయించి..రాత్రింబవళ్లు అనే తేడా లేకుండా ఇసుకను అక్రమంగా బయటకు తరలిస్తూ..సొమ్ము చేసుకుంటున్నారన్నారు. ఈ తతంగాన్నంతా ప్రజలు గమనించాలని, ఇసుక అక్రమ రవాణా దారులపై కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులకు ప్రజలు సహకరించాలన్నారు. ఇప్పటికైనా ఇసుక మాఫియా ముఠాపై కన్నేసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పేరు చెబుతున్న వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే కు చెడ్డ పేరు తెచ్చే విధంగా వ్యవహరించే ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.
ఎమ్మెల్యే పేరు వాడుకోవద్దు
