ఎస్సీ ఎస్టీ కేసులలో స్టేషన్ బెయిలు ఇవ్వొద్దు

హసన్ పర్తి / నేటి ధాత్రి

నిబంధనలకు తూట్లు పోడుస్తున్న పోలీసులు, అధికారులు

ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు,డిబిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చుంచు రాజేందర్!

బాధితులకు అందే పరిహారంలో అలసత్వంతో పాటు చేతివాటం!

ఉమ్మడి జిల్లాలో ఎస్సీ ఎస్టీలపై రోజురోజుకు పెరుగుతున్న దాడులు!

చోద్యం చూస్తున్న అధికారులు!

డిబిఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కు వినతిపత్రం అందజేత!

సానుకూలంగా స్పందించిన కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య!

ఎస్సీ ఎస్టీ కేసులలో స్టేషన్ బెయిలు ఇవ్వకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ పోలీసులు నేరస్తులకు స్టేషన్ బెయిలు ఇవ్వడం వలన కేసులు నీరుగారిపోతున్నాయని బెయిలు ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, దళిత బహుజన ఫ్రంట్ (డీబీఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుంచు రాజేందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం హనుమకొండ ఆర్ అండ్ బి అతిథి గృహంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను డిబిఎఫ్ ఆధ్వర్యంలో కలసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజురోజుకు దళిత గిరిజనుల మీద దాడులు దౌర్జన్యాలు హత్యలు హత్యాచారాలు పెరిగిపోతున్నాయని వీటిని అరికట్టవలసిన పోలీసులు ఉన్నతాధికారులు నిమ్మకు నీరతనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బాధితులకు అందవలసిన పరిహారాన్ని సకాలంలో అందించడానికి నిర్లక్ష్యం వహిస్తున్నారని వీటన్నింటి మీద దృష్టి సారించి సమస్యలను పరిష్కరించాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. ప్రతి నెల చివరి వారంలో నిర్వహించే పౌరహక్కుల దినోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహించాలన్నారు. జస్టిస్ పున్నయ్య కమీషన్ సిఫారసులను అమలు చేయాలని కోరారు.
దీనికి సానుకూలంగా స్పందించిన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ప్రభుత్వంతో ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో డిబిఎఫ్ జిల్లా అధ్యక్షులు మాదాసి సురేష్, ప్రముఖ ప్రముఖ న్యాయవాది అసైన్డ్ భూమి సమితి (ఏబీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు కలకోటి మహేందర్, కేయూ జేఏసీ చైర్మన్ డాక్టర్ మంద వీరస్వామి, ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మీరా వెంకట్, మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్, ప్రజాసంఘాల నాయకులు కాడపాక రాజేందర్, మేడ రంజిత్, బైరపాక ప్రశాంత్, మొలుగురి ఆనందం, బాధితులు జింజపెళ్లి సుశీల పరంకుశం, శ్రావ్య, దళిత భూ బాధిత రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!