
BANDAN HOSPITAL CRIMES HANAMKONDA
ఆస్పత్రి రిజిస్ట్రేషన్‌ను ఎందుకు రద్దు చేయకూడదు?
మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు.

“నేటిధాత్రి”,హనుమకొండ.
బంధన్ ఆస్పత్రి కి హనుమకొండ డీఎంహెచ్‌వో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సదరు ప్రైవేటు ఆస్పత్రి రిజిస్ట్రేషన్‌ను ఎందుకు రద్దు చేయకూడదో మూడు రోజులలో వివరణ ఇవ్వాలని హాస్పిటల్ మేనేజ్మెంట్ను కోరారు.

షోకాజ్ నోటీసు వివరాల ప్రకారం.. వరంగల్‌వాసి ఎల్.కృష్ణకు బంధన్ ఆస్పత్రిలో వైద్యులు డాక్టర్ నలిన్ కృష్ణ గతేడాది ఫిబ్రవరి 12న అపెండిక్స్ ఆపరేషన్ చేశారు. దీనిపై బాధితుడు, పేషెంట్ ఎల్.కృష్ణ వైద్యశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. సదరు ప్రైవేటు ఆస్పత్రిలో తనకు సర్జరీ చేయడంలో వైద్యుడు విఫలమయ్యారని, ఆస్పత్రిలో తనకు ట్రీట్మెంట్ సరిగా జరగలేదని, పోస్ట్ ఆఫ్ కేర్‌లో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని పేర్కొన్నాడు. ఈ క్రమంలో తాను ప్రాణాపాయ స్థితికి వెళ్లే పరిస్థితి రాగా, వెంటనే సదరు ఆస్పత్రి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ మెడికవర్ ఆస్పత్రికి వెళ్లినట్టు చెప్పారు. అక్కడ తనకు మరో సర్జరీ జరిగిందని, సుమారు 20 రోజుల పాటు వైద్యులు ట్రీట్మెంట్ చేశారని, రూ.14 లక్షలు అక్కడ తనకు ఖర్చయ్యాయని వెల్లడించారు.

ఈ నేపథ్యంలో సదరు బాధితుడి ఫిర్యాదు ఆధారంగా డీఎంహెచ్‌వో ఆఫీసు..‘బంధన్’తో పాటు ‘మెడికవర్’ ఆస్పత్రుల నుంచి కేస్షీట్లను సేకరించింది. ఇరు ఆస్పత్రులకు సంబంధించిన కేస్ షీట్లను ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఎక్స్పర్ట్స్ పంపించింది. ‘ఎంజీఎం’ నిపుణులు వాటి ఆధారంగా నివేదికను సమర్పించారు. దాని ప్రకారం..సదరు బంధన్ ఆస్పత్రిలో మెడికల్ పద్ధతిలో కాకుండా పేషెంట్‌కు ఓపెన్ సర్జరీ నిర్వహించినట్టు వెల్లడించారు. నిపుణుల కమిటీ ఆ ప్రైవేటు ఆస్పత్రిలో నిర్లక్ష్యం జరిగినట్టు పేర్కొంది. డాక్టర్ ఎన్.నలిన్ కృష్ణ, డాక్టర్ ప్రణీత్ రాజ్‌లు సదరు ఆస్పత్రికి కన్సల్టెంట్ డాక్టర్లు కానప్పటికీ వారి చేత శస్త్రచికిత్స చేయించడం ఆస్పత్రి అసమర్థతతను స్పష్టం చేస్తోందని పేర్కొన్నారు. వైద్యుల అసమర్థత, నిర్లక్ష్యం వల్ల పేషెంట్ పరిస్థితి ‘బంధన్’ ఆస్పత్రిలో తీవ్ర విషమంగా మారిందని నిర్ధారించారు. ఈ సందర్భంలో సదరు ఆస్పత్రి రిజిస్ట్రేషన్‌ను తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్(రిజిస్ట్రేషన్, రెగ్యులషన్) చట్టం 2010, నియమనిబంధనలు 2011 ప్రకారం ఎందుకు సస్పెండ్ లేదా క్యాన్సిల్ చేయకూడదో.. మూడు రోజులలో వివరణ ఇవ్వాలని ఆస్పత్రి యాజమన్యానికి డీఎంహెచ్‌వో స్పష్టం చేశారు.

