డిగ్రీ కళాశాలలో జిల్లా స్థాయి దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ ప్రారంభం.
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో తెలంగాణ ఉన్నత విద్య మండలి ద్వారా డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కల్పించే దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) జిల్లా స్థాయి హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ తెలిపారు.దోస్త్ నమోదు ప్రక్రియలో విద్యార్థులకు ఏమైనా సాంకేతిక ఇబ్బందులు కలిగితే కళాశాలకు వచ్చి సహాయక కేంద్రంలో పరిష్కారం పొందగలరని తెలిపారు. కళాశాల సహాయక కేంద్రంలో విద్యార్థులకు దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉచితంగా చేయబడుతుందని,డిగ్రీ కళాశాలలో సీట్ల భర్తీ కొరకు మే 3 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం అయ్యాయని అన్నారు.ప్రవేశాల ప్రక్రియ మూడు విడతలో జరుగుతుందని అందులో జూన్ 30 నుండి మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం అవుతాయని తెలిపారు.విద్యార్థుల ఆధార్ కార్డు నెంబర్ వారి మొబైల్ నెంబర్ కు అనుసంధానమై ఉండాలని పేర్కొన్నారు.దోస్త్ రిజిస్ట్రేషన్ కొరకు పదవతరగతి మెమో,ఇంటర్ రెండవ సంవత్సరం హాల్ టికెట్ నెంబర్,కుల ధ్రువీకరణపత్రం,ఆదాయధ్రువీకరణపత్రం(01-04-2025 తేదీ తరవాత తీయబడింది) 3వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్లు,ఆధార్ కార్డు ,పాస్స్పోర్ట్ సైజు ఫోటో తీసుకురాగలరని తెలిపారు.ఈ కార్యక్రమంలో దోస్త్ సమన్వయ కర్త డా.పూర్ణచందర్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ బైరి సత్యనారాయణ, అకాడమీ కోఆర్డినేటర్ డాక్టర్ కందాల సత్యనారాయణ,అడ్మిషన్ ఇంచార్జ్ డాక్టర్ యం.సోమయ్య,కంట్రోలర్ అఫ్ ఎగ్జామ్స్ ఎస్.కమలాకర్, రహీముద్దీన్ ,డాక్టర్ రాంబాబు, డా.భద్రు, డా.రాజీరు పాల్గొన్నారు.