ఆసుపత్రి ఆవరణ పరిశుభ్రంగా ఉండాలి
– సుందరయ్య నగర్ అర్బన్ పీ హెచ్ సీ ఆకస్మిక తనిఖీలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
సిరిసిల్ల(నేటి ధాత్రి):
ఆసుపత్రి ఆవరణ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. సిరిసిల్ల పట్టణంలోని సుందరయ్య నగర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఓపీ రిజిస్టర్, ల్యాబ్, ఫార్మసీ, ఇతర రిజిస్టర్లు పరిశీలించారు. ఫార్మసీ నిర్వహణ పై పలు సూచనలు చేశారు. రోజు ఓపీ, ఈ నెలలో అర్బన్ పీ హెచ్ సీ పరిధిలో ఎన్ని డెలివరీలు కావాల్సి ఉందో ఆరా తీశారు. ప్రతి రోజూ దవాఖానలో 40 నుంచి 50 మంది వరకు వస్తారని, ఈ నెల లో అర్బన్ పీ హెచ్ సీ పరిధిలో 22 కాన్పులు కావాల్సి ఉందని కలెక్టర్ దృష్టికి వైద్యురాలు సాహితి తీసుకెళ్లారు.
అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, అన్ని కాన్పులు సర్కార్ ఆసుపత్రిల్లోనే అయ్యేలా చూడాలని సూచించారు. రోగులకు కావాల్సిన అన్ని మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఇందులో ఆసుపత్రి సిబ్బంది తదితరులు ఉన్నారు.