Collector Orders Transparent Paddy Procurement
ధాన్యం కొనుగోలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి నేటిధాత్రి
జిల్లా వ్యాప్తంగా ఎఫ్.ఏ.క్యూ నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు.
బుధవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలుపై రెవెన్యూ, పౌర సరఫరాలు, పౌర సరఫరాల సంస్థ, వ్యవసాయ, సహకార, రవాణా, గ్రామీణాభివృద్ధి శాఖాధికారులు, రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ప్రభుత్వ మార్గదర్శకాలు మరియు ఎఫ్.ఏ.క్యూ నిబంధనలకు అనుసరించి ధాన్యం కొనుగోలు నిర్వహించాలని సూచించారు. ఈ సీజన్లో మొత్తం 44,396 హెక్టార్లలో వరి పంట సాగు జరిగిందని, దాదాపు 1.52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరే అవకాశం ఉన్నందున, గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పకడ్బందీగా కొనుగోలు ప్రక్రియ నిర్వహించాలని అధికారులకు, మిల్లర్లకు సూచించారు.
జిల్లాలో సహకార సంఘాలు, డిఆర్డీఏ ద్వారా 204 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నవంబర్ మొదటి వారం నుండి కోతలు ప్రారంభం అవుతున్నందున నిర్దేశించిన ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఎత్తైన ప్రదేశంలో ఏర్పాటు చేసి కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రతి కేంద్రాన్ని పరిశీలించి ఏర్పాట్లుపై ధ్రువీకరణ నివేదికలు ఇవ్వాలని పేర్కొన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వేగంగా మిల్లులకు తరలించేలా తగిన సంఖ్యలో లారీలు అందుబాటులో ఉంచాలని సూచించారు. కొనుగోలు తదుపరి తక్షణమే ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో సరిపడ గన్నిసంచులు, టర్పాలిన్లు,ఎలక్ట్రానిక్ కాంటాలు, ఎఫ్.ఏ.క్యూ నిబంధనలు, కనీస మద్దతు ధర వివరాలతో రెండు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ధాన్యంలో రాళ్లు, మట్టి గుల్లలు లేకుండా ప్యాడి క్లీనింగ్ మిషన్లతో శుభ్రపరిచే చర్యలు తీసుకోవాలన్నారు.
కొనుగోలు జరిగిన వెంటనే ఏపీఎంలు, సహకార సంఘాల సీసీలు రైతుల వివరాలను ట్యాబ్లో నమోదు చేయాలని, గరిష్టంగా 48 గంటల్లో రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి నగదు జమయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకున్నా కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. అధికారులు సమన్వయం పాటిస్తూ ధాన్యం కొనుగోళ్లను పారదర్శకంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
అనంతరం ధాన్యం కొనుగోలు ప్రక్రియపై పవర్ పాయింట్ ద్వారా అవగహన కల్పించారు.
ఈ సమావేశంలో రెవెన్యూ ఆదనపు కలెక్టర్ అశోక్ కుమార్, పౌరసరఫరాల అధికారి కిరణ్ కుమార్, డిఎం రాములు, సహకార అధికారి వాలియానాయక్, వ్యవసాయ అధికారి బాబురావు, డి ఆర్ డి ఓ బాలకృష్ణ, మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.
