2కే రన్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో, సర్ధార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ గ్రౌండ్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీ రాహుల్ శర్మ, ముఖ్య అతిథిగా, జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే, ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. కలెక్టర్ ఎస్పీ జెండా ఊపి 2కె రన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ
దేశ ఐక్యత, సమగ్రత కోసం సర్ధార్ వల్లభభాయ్ పటేల్ చేసిన కృషి చరిత్రలో చిరస్మరణీయమైంది. ఆయన ఆలోచనలు, స్ఫూర్తి నేటి యువతకు మార్గదర్శకాలు. ‘రన్ ఫర్ యూనిటీ’ వంటి కార్యక్రమాల ద్వారా జాతీయ ఐక్యత పట్ల ప్రజల్లో చైతన్యం పెరుగుతుంది. భారత ప్రజలందరూ ఒకే కుటుంబ సభ్యులుగా భావించి, జాతి ఐక్యతకు పునరంకితమవడం ద్వారానే స్వాతంత్ర్య సమరయోధులకు నిజమైన నివాళి అర్పించినట్టవుతుంది” అని పేర్కొన్నారు.
జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే, మాట్లాడుతూ
భారతదేశపు ఉక్కు మనిషి సర్ధార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకోవడం మనందరికీ గౌరవకరం. ఆయన దార్శనికతతో, సంకల్పంతో సుమారు 565 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి దేశ ఐక్యతకు పునాదిగా నిలిచారు. యువతరం ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్ధిలో పాలుపంచుకోవాలి, సమైక్యతా భావాన్ని పెంపొందించాలి” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ నరేష్ కుమార్ డీఎస్పీ సంపత్ రావు సీఐలు, ఆర్ఐలు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు, యువతి–యువకులు తదితరులు పాల్గొన్నారు.
