
District Collector Rahul Sharma
భూ భారతి సహాయక కేంద్రం పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి నేటిధాత్రి
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భూ భారతి సహాయక కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మంగళవారం పరిశీలించారు. భూ సంబంధిత సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో సిబ్బంది పని తీరును, ప్రజలకు అందుతున్న సేవలను ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 3వ తేది నుండి 20వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలకు భూ సంబంధిత సమస్యలు వేగంగా పరిష్కారానికి భూ భారతి రెవెన్యూ సదస్సులు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ప్రజల నుండి వచ్చిన అభ్యర్థనలను సమయానికి పరిశీలించి, సంబంధిత తహసీల్దార్ కు సిఫారసు చేసి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తు లు నిష్పక్షపాతంగా పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారులు కృషి చేయాలని పేర్కొన్నారు. కేంద్రంలో నమోదు అయిన ఫిర్యాదులు, వాటి పరిష్కార స్థితిని కలెక్టర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సిబ్బందికి సూచనలు చేసి వచ్చిన దరఖాస్తును రిజిస్టర్ లో నమోదులు చేయాలని స్పష్టం చేశారు. కార్యాలయ పని వేళల్లో ప్రజలు సహాయక కేంద్రాన్ని సందర్శించి సలహాలు, సూచనలు పొందాలని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్లు హరిహర, శ్రీనివాస్, ఈడీఎం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.