పేదలకు సన్న బియ్యం పంపిణి
నాగర్ కర్నూల్/నేటి దాత్రి:

బిజనేపల్లి మండలం కేంద్రం, మంగనూర్ గ్రామంలో ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నాగర్ కర్నూల్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి గురువారం ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత సన్న బియ్యం పథకాన్ని లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తీసుకొస్తున్నామన్నారు. అందులో భాగంగా, ఉచిత సన్న బియ్యం పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు నాణ్యమైన బియ్యాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వచ్చింది” అని తెలిపారు. రైతుల కష్టానికి గౌరవాన్ని కల్పించడంతో పాటు, పేద ప్రజలు ఆకలికి గురికాకుండా పోషకాహారాన్ని అందించడమే ఈ పథక ప్రధాన ఉద్దేశమని ఎమ్మెల్యే అన్నారు. ఈ పథక ఫలాలు ప్రతి అర్హ కుటుంబానికి చేరేలా తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు..
లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ పథకం సజావుగా అమలవ్వాలని, బియ్యం పంపిణీ వ్యవస్థలో ఎలాంటి అక్రమాలను సహించేది లేదని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ పథకం విజయవంతంగా అమలుకావడానికి ప్రజలు భాగస్వామ్యం కావాలని కోరారు. ఎమ్మెల్యే గ్రామ ప్రజలతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిష్కారం కోసం సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.