విద్యకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది’
ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి.
దేవరకద్ర /నేటి దాత్రి.
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండల కేంద్రంలో 10వ తరగతి విద్యార్థులకు జిఎంఆర్ సేవా సమితి ద్వారా ప్రత్యేకంగా తయారు చేయించిన పదవ తరగతి స్టడీ మెటీరియల్, కొజెంట్ కంపెనీ వారి సహకారంతో కాలినడకన పాఠశాలకు వచ్చే పుట్టపల్లి, ఇస్రంపల్లి, రాజోలి గ్రామాల విద్యార్థులకు సైకిల్ లను ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిందని, పాఠశాలలో మౌలిక వసతులను పట్టించుకోలేదని, పదేళ్ల పాలనలో టీచర్ల నియామకాలను చేపట్టలేదని, విద్యాశాఖకు నిధులు కేటాయించలేదని బీఆర్ఎస్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విద్యాశాఖకు అధిక నిధులు కేటాయించడంతో పాటు 11,062 టీచర్ పోస్టులు భర్తీ చేశామని, 15 ఏళ్ల తర్వాత సుమారు 19,000 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించామని, అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించామని, స్కూలు ప్రారంభమైన మొదటి వారంలోనే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం లు పంపిణీ చేశామని, పదేళ్లలో ఎన్నడు లేని విధంగా విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచామని గుర్తు చేశారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఏకాగ్రతతో చదువుకోవాలని, పదవతరగతి లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని కోరారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు, విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా, పాఠ్యపుస్తకాల నుండి క్యూఆర్ కోడ్ ద్వారా డిజిటల్ క్లాసులకు అనుసంధానమయ్యేలా నిపుణులైన అధ్యాపకులతో తన సొంత నిధులతో స్టడీ మెటీరియల్ తయారు చేయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.