జమ్మికుంట: నేటిధాత్రి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కుటుంబ డిజిటల్ కార్డుల జారీలో భాగంగా హుజరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలంలో గల పాపయ్యపల్లి గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఈ నెల 3 నుండి ఏడో వరకు నాలుగు బృందాలుగా అధికారులు ఏర్పాటు ఇంటింటికి తిరుగుతూ సర్వే నిర్వహిస్తున్నారు. సర్వేలో భాగంగా ఇంటి యజమానురాలితోపాటు సభ్యులకు సంబంధించిన వివరాలను తప్పులు లేకుండా నమోదు చేస్తున్నారు. వారికి ఉన్న ఆరోగ్య కార్డులు ఇతర వివరాలు నమూనా పత్రాలలో పొందుపరుస్తున్నారు. రేషన్ కార్డు సంఖ్య సహా ఆరోగ్య సమాచారాన్ని సమగ్రంగా తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. దీనికి తోడు పింఛన్ లబ్ధిదారుడు ,స్వయం సహాయక సంఘం సభ్యులు, రైతు భరోసా, రుణమాఫీ, ఆరోగ్యశ్రీ తో పాటు అన్ని వివరాలను సేకరించడం జరుగుతుంది. కుటుంబానికి సంబంధించిన అన్ని వివరాలు సేకరించిన అనంతరం కార్డు పై ప్రత్యేకమైన నెంబర్ను కేటాయించడం జరుగుతుందని ఈ పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్కు అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు.