Dial 100 Misuse in Warangal? Public Concern Grows
నగరంలో డయల్ 100కు కొత్త అర్థం: సేవకా? లాభమా?
ఆదాయవనరులుగా మార్చుకుంటున్న ప్రైవేట్ డ్రైవర్లు, కొందరు హోమ్ గార్డులు, కానిస్టేబుళ్లు, ర్యాంకర్ అధికారులు?
నేటిధాత్రి, వరంగల్ పోలీస్ కమిషనరేట్.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజలకు భద్రత కవచం కావాల్సిన డయల్ 100 సేవ, కొందరు రాత్రి పూట డ్యూటీలో ఉన్న పోలీసు సిబ్బందికి లాభదాయక వనరుగా మారిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో నగరంలో రాత్రివేళ బరాత్‌లు, డీజే లు పెర్మిషన్ లేకుండా కొందరు, తీసుకొని కొందరు సాధారణంగా జరుగుతుంటాయి. రాత్రి పూట సౌండ్ కారణంగా నిద్రలో అంతరాయం కలుగుతోందని విసుగెత్తిన పౌరులు డయల్ 100 ద్వారా ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే ఆ ఫిర్యాదులు ప్రజలకు న్యాయం చేయడానికి కాకుండా, కొందరు ఖాకీలు చెల్లింపులు సేకరించడానికి వేదికలుగా మారుతున్నాయనే వాదనలు బలపడుతున్నాయి. ఫిర్యాదు సమాచారం వచ్చిన వెంటనే సంబంధిత బీట్ కానిస్టేబుళ్లకు తోడుగా ఒక హోమ్ గార్డ్ లేదా అధికారులకు తోడుగా ఒక ప్రైవేట్ డ్రైవర్ ఘటనాస్థలానికి చేరుతారు. అక్కడ ఫంక్షన్ చేసే వారితో అలాగే డీజే నిర్వాహకులతో హోమ్ గార్డు లేదా ప్రైవేట్ డ్రైవర్ వారి నిజస్వరూపం మొదలు పెడుతారు.. సారుకు నేను చెప్తా కానీ, అంటూ“మేము ఇద్దరం ఉన్నాం… మొత్తం ఆరు కాల్స్ వచ్చాయి…”అంటూ బేరసారాలు. చివరికి కొంత “సర్దుబాటు” జరగడం వల్ల డీజే మళ్లీ యధావిధిగా కొనసాగుతున్నాయని స్థానిక వర్గాలు చెబుతున్నాయి.
ప్రజల సహాయం కోసం నడుస్తున్న సేవ పేరు చెప్పి డబ్బులు తీసుకోవడం ఆందోళనకర విషయం. నెలకు 50 వేలకుపైగా వేతనం పొందుతూ ప్రజల భద్రత కోసం పనిచేయాల్సిన వారు, ఒక హోమ్ గార్డు, ప్రైవేట్ డ్రైవర్ ల పెత్తనానికి డయల్ 100ను అదనపు ఆదాయంగా మార్చుకుంటే ప్రజా విశ్వాసం ఎక్కడ ఉంటుంది? ఖాకీ వ్యవస్థపై నమ్మకం ఉంచి ఫిర్యాదు చేసే పౌరుల స్వరం అక్కడే మూగబోతుంది. న్యాయం కోరడమే తప్పు అని భావించే పరిస్థితి ఏర్పడుతోంది.
ఈ తరహా చర్యలను కఠినంగా నిరోధించకపోతే, ప్రజాసేవ పట్ల ప్రజల విశ్వాసం కోల్పోవడం తప్పదు.
