‘ధరణి చట్టం..బీఅర్ఎస్ ప్రభుత్వానికి చుట్టం’
ధరణి పాలిట.. రైతులకు శాపం
భూభారతి చట్టంతో.. సమస్యలకు శాశ్వత పరిష్కారం.
భూత్పూర్ /నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం అవగాహన సదస్సులో ఎక్సైజ్ & టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, దేవరకద్ర మంగళవారం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ధరణి వంటి చట్టాలు వారికి చుట్టాలు అయ్యాయి కానీ..

జనానికి మాత్రం ధరణి దరిద్రంగా మారిందని, ధరణితో అధికారులకి.. అధికారాలు లేకుండా పోయాయన్నారు. ధరణి వల్ల ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలకు భూభారతి చట్టం ద్వారా మోక్షం లభిస్తుందని, కొత్త చట్టంలో సమస్యలపై అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి రైతుల పాలిట శాపంగా మారిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో కలిపి భూభారతిని తీసుకొచ్చారన్నారు. భూ భారతి చట్టం ప్రకారం.. భూ సంబంధిత సమస్యలను నిర్దిష్ట గడువులోపు పరిష్కరించడం జరుగుతుందని, సమస్య పరిష్కారం కాకుంటే కలెక్టర్‌కు అప్పీల్ చేసుకోవచ్చని, ఈ చట్టంలో కొత్తగా ల్యాండ్ ట్రిబ్యునల్ కూడా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ధరణిలో రెవెన్యూ కోర్టులను తొలగించడం వల్ల భూ వివాదాల విషయంలో రైతులు సివిల్ కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చేదని గుర్తు చేశారు. దీనివల్ల రైతులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ప్రస్తుత భూభారతి చట్టం ద్వారా గతంలో మాదిరిగా రెవెన్యూ కోర్టులు పునరుద్ధరించిందని వివరించారు. భూ సమస్యలను స్థానికంగానే పరిష్కరించుకునేందుకు తహసీల్దార్ రెవెన్యూ డివిజన్ అధికారికి, కలెక్టర్‌కు అధికారాలు కల్పించామని తెలిపారు. అయినా సమస్య పరిష్కారం కాలేదని రైతులు భావిస్తే అప్పీల్ చేసుకోవచ్చని సూచించారు. ఆర్థిక స్థోమత లేని పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం కూడా ప్రస్తుత చట్టంలో సమకూర్చడం జరుగుతుందని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా పరిష్కారం కోసం భూ భారతి చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పించిందని అన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ… 10 సంవత్సరాలు అధికారాన్ని అనుభవించి.. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం అధికారం కోసం తహతహలాడుతోందన్నారు. ధరణిని తెచ్చి వాళ్లు మాత్రం లబ్దిపొంది.. ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని కేసీఆర్ కుటుంబం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.