Devotees Flock to Shiva Temples on Kartika Monday
కార్తీక మాసం మూడో సోమవారం.. శివాలయాలకు పోటెత్తిన భక్తులు
కార్తీక మాసం మూడో సోమవారం సందర్భంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామునే భక్తులు శివాలయాలకు చేరుకుని మహాదేవుడిని దర్శించుకుంటున్నారు.
భోళా శంకరుడుకి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం (Kartika Masam). ఈ మాసంలో ఆ మహాదేవుడుని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు. కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది, విశిష్టమైనది అని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక మాసంలో భక్తులు నదుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు. అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి నదుల్లో వదులుతుంటారు. శైవక్షేత్రాల్లో శివునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, రుద్రాభిషేకాలు నిర్వహిస్తుంటారు. హర హర మహాదేవ శంభోశంకర అంటూ శివనామస్మరణతో ఆలయాలు మార్మోగుతుంటాయి. ఇక కార్తీక మాసం మూడో సోమవారం సందర్భంగా ఏపీలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పంచారామ క్షేత్రం, ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం, పాదగయా క్షేత్రం, శ్రీశైలం ఆలయాలకు భక్తులు పోటెత్తారు. వేకువజామునే పుణ్యస్నానాలు ఆచరించి ఈశ్వరుడిని దర్శించుకుంటున్నారు.
