జమ్మికుంట: నేటిధాత్రి
ప్రశాంతమైన వాతావరణంలో దేవీ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించాలని పట్టణ సీఐ రవి ఉత్సవ కమిటీ సభ్యులకు తెలియజేశారు. మంగళవారం జమ్మికుంట పట్టణంలోని పోలీస్ స్టేషన్లో దేవీ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించే ఉత్సవ కమిటీ సభ్యుల సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ రవి మాట్లాడుతూ దేవీ నవరాత్రి ఉత్సవాలకు మహిళా భక్తులు ఎక్కువ సంఖ్యలో హాజరు అవుతారు కాబట్టి అన్ని రకాలైన ఏర్పాట్లను చేయాలని, దీనికి తోడు ఎలాంటి ఫైర్ యాక్సిడెంట్లు కాకుండా ముందస్తుగానే మంటపం ప్రాంతంలో అవసరమైన నీటిని, ఇసుకను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఉత్సవాల ఊరేగింపు సమయంలో డిజె సౌండ్ లు వాడకుండా భక్తిపరమైన పాటలతో ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సహకరించాలని సిఐ కోరారు. మంటపాల వద్ద రాత్రి వేళలో ఒకరు ఇద్దరు ఉండడంతోపాటు అవసరమైన చర్యలు తీసుకోవాలని, తొమ్మిది రోజులపాటు నిర్వహించే దేవీ నవరాత్రులలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉత్సవ కమిటీ సభ్యులు అందుబాటులో ఉండి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.