*స్మశాన వాటికను అభివృద్ధి చేయండి..
*కమిషనర్ ను కోరిన డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు..
తిరుపతి(నేటి ధాత్రి) మార్చి 20:
నగర పరిధిలోని న్యూ బాలాజి కాలనిలో అస్తవ్యస్తంగా ఉన్న స్మశాన వాటికను అభివృద్ధి చేసి, డబుల్ డెక్కర్ బస్ ను రోడ్డెక్కించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య ను డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు కోరారు. గురువారం డిప్యూటీ మేయర్ ఆర్.సి.ముని కృష్ణ, కార్పొరేటర్లు ఎస్.కె.బాబు, నరసింహ ఆచారి, నరేంద్రలు కమిషనర్ ను కలసి పలు అభివృద్ధి పనుల కొరకు వినతి పత్రం సమర్పించారు. న్యూ బాలాజి కాలనీలోని సీకాం కళాశాల వద్ద ఉన్న స్మశానంలో భవన నిర్మాణ వ్యర్థాలు వేయడం,గోడ పడగొట్టి పార్కింగ్ గా వాడుకుంటున్నారని తెలిపారు. కాంపౌండ్ వాల్ నిర్మించి, శుభ్రంగా ఉంచాలని కోరారు. కార్పొరేషన్ నిధులు వెచ్చించి కొనుగోలు చేసిన డబుల్ డెక్కర్ బస్ ను మూలన పదేశారని, దీంతో ప్రజల సొమ్ము వృదా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ బస్ ను ప్రజల సౌకర్యార్థం నడపాలని, లేకుంటే టిటిడి కి విరాళంగా ఇచ్చేయాలని కోరారు.రంజాన్ వేడుకలకు ఈద్గా మైదానంలో ఏర్పాట్లు చేయాలని ముస్లిం సోదరులతో కలసి కోరారు. ఇందుకు స్పందించిన కమిషనర్ మాట్లాడుతూ స్మశాన వాటిక అభివృద్ధికి చర్యలు చేపడతామని, రంజాన్ పర్వదినం సందర్భంగా ప్రార్థనలు చేసుకొనేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేస్తామని అన్నారు. డబుల్ డెక్కర్ బస్ విషయం ఒక సారి చర్చించి ప్రజల సొమ్ము వృధా కాకుండా తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కమిషనర్ ను కలసిన వారిలో తిరుత్తణి వేణుగోపాల్, ఈద్గా కమిటి సభ్యలు పాల్గొన్నారు.