
రూ.15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ తహసీల్దార్……!
జహీరాబాద్ నేటి ధాత్రి;
పని పూర్తి చేసి, పరిహారం చెక్కు చేతికిచ్చిన తర్వాత కూడా లంచం కోసం వేధించిన ప్రభుత్వ అధికారుల బండారాన్ని ఏసీబీ అధికారులు బయటపెట్టారు.ఓ బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా ఇద్దరు ముఖ్య అధికారులను, ఒక డ్రైవర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో కలకలం రేపింది.జహీరాబాద్‌లోని జాతీయ పెట్టుబడులు, తయారీ మండలం (నిమ్జ్) కోసం ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది. ఈ క్రమంలో ఓ వ్యక్తికి చెందిన భూమిని సేకరించి, దానికి సంబంధించిన ఫైల్‌ను అధికారులు ప్రాసెస్ చేశారు.
బాధితుడికి రూ. 52,87,500 పరిహారం చెక్కును కూడా అందజేశారు. అయితే.. ఈ పని చేసినందుకు గాను నిమ్జ్ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న రాజారెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ సతీష్, వారి డ్రైవర్ దుర్గయ్య కలిసి బాధితుడిని రూ. 50వేలు లంచం డిమాండ్ చేశారు.దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు… బేరసారాల అనంతరం రూ. 15వేలు ఇచ్చేందుకు అంగీకరించాడు.గురువారం బాధితుడి నుంచి రూ. 15వేలు లంచం తీసుకుంటుండగా ముందుగా వేసిన పథకం ప్రకారం ఏసీబీ అధికారులు లంచగొండి అధికారులను పట్టుకున్నారు. ఈ ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి._