ఢిల్లీ గర్జనతో కేంద్ర ప్రభుత్వంలో వణుకు
-వేముల మహేందర్ గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
బీసీ రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ లో చేసిన బీసీల పోరు గర్జనతో కేంద్ర ప్రభుత్వంలో వణుకు పుట్టిందని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ అన్నారు. ఢిల్లీలో చేసిన బీసీ గర్జనను చూసైనా కేంద్రం తన వైఖరి మార్చుకోవాలన్నారు. సోమవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. గర్జన చూసి కేంద్ర ప్రభుత్వం బీసీలకు న్యాయం చేస్తుందని భావిస్తే..బీసీ డిమాండ్లను పరిష్కరించకపోగా..ఎదురు దాడికి దిగడం బాధాకరమన్నారు. ఢిల్లీ ఉద్యమ స్ఫూర్తితో బీసీ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ఉధృతం చేసి బిజెపి ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్పుతామని హెచ్చరించారు. ఢిల్లీలో నిర్వహించిన బీసీల ఆందోళనతో దేశం మొత్తం బీసీల గొంతుకను వినిపించి, అన్ని రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకువచ్చామన్నారు. ఇక బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో ఏప్రిల్ చివరి వారంలో హైద్రాబాదులో 29 రాష్ట్రాల బీసీ ప్రతినిధులతో బీసీల రాజకీయ ప్లీనరీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మే నెల రెండవ వారంలో పరేడ్ గ్రౌండ్ లో 10 లక్షల మందితో బీసీల యుద్ధభేరి బహిరంగ సభను నిర్వహించి సత్తా చాటుతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఢిల్లీలో జరిగిన బీసీల పోరు గర్జనకు 16 రాజకీయ పార్టీలు, 18 రాష్ట్రాల నుంచి 32 మంది పార్లమెంట్ సభ్యులు, 29 రాష్ట్రాల నుండి ఓబీసీ నాయకులు పాల్గొన్నారన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో బీసీల పోరుగర్జనలో పాల్గొనడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. బీసీల పోరుగర్జన సభకు వచ్చి మద్దతు తెలిపిన సీఎంతో పాటు మంత్రులు, వివిధ పార్టీల నేతలకు బీసీ సమాజం తరఫున మహేందర్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు.