
Tirupati MP Gurumurthy.
*ఏపీఎండీసీ ద్వారా అప్పులు ప్రమాద ఘంటికలు..
తిరుపతి ఎంపీ గురుమూర్తి..
*పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి రాజ్యాంగ, ఆర్థిక ఉల్లంఘనలు..
తిరుపతి(నేటి ధాత్రి) జూలై 21:
రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపిఎండిసి), రూ.9 వేల కోట్ల విలువైన నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లు జారీ చేసింది. ఈ డిబెంచర్లకు సంబంధించి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యక్ష డెబిట్ ఆదేశం ద్వారా ఒక ప్రైవేట్ డిబెంచర్ ట్రస్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా నుండి నేరుగా నిధులను తీసుకునే అధికారం కల్పించబడిందని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ప్రత్యేక అధికరణ 377 ద్వారా కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశం పలు ప్రశ్నలను లేవనెత్తుతోందని, రాష్ట్ర ఖజానా నుండి నిధులను ఉపసంహరించుకోవడానికి శాసనసభ ఆమోదం తప్పనిసరి అని నిర్దేశించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 203, 204 లను ఈ ఆదేశం బైపాస్ చేస్తుందని కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తుందా అని ప్రశ్నించారు. అలాగే, ఈ డిబెంచర్ల ద్వారా వచ్చిన నిధులు మైనింగ్ లీజులకు ప్రతిఫలంగా రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి మళ్లించబడుతున్నాయి, ఇది వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేయడంతో సమానమన్నారు. కేంద్ర ప్రభుత్వం ముందస్తు అనుమతి లేకుండా రాష్ట్రాలు అప్పు చేయకూడదని నిర్దేశించే ఆర్టికల్ 293(3) నియమావళిని ఉల్లంఘించడం కాదా అని కూడా ప్రశ్నించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 203, 204, 293(3)ల నియమావళిని పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని తిరుపతి ఎంపీ గురుమూర్తి డిమాండ్ చేసారు.