ప్రమాదకరంగా కరెంటు స్తంభాలు
గట్టిగా గాలి వీస్తే…! నేల కూలెన్…?
ఎవరిని బలికొంటాయో…? ఈ విద్యుత్ స్తంభాలు
విద్యుత్ అధికారులు దృష్టి సారించాలంటున్న ప్రజలు
కేసముద్రం/ నేటి ధాత్రి
కేసముద్రం మున్సిపల్ పరిధిలోని కేసముద్రం విలేజ్ లో అనేక వీధులలో విద్యుత్ స్తంభాలు శిథిలావస్థలో నెలకొని ఉన్నాయి, ఎన్నో సంవత్సరాల క్రితం విద్యుత్ స్తంభాలు నిర్మాణం జరిగిందని అప్పటినుంచి నేటి వరకు విద్యుత్ స్తంభాల నిర్మాణం చేపట్టకపోవడంతో, ఏళ్ల తరబడి తీగల బరువు భరిస్తున్న విద్యుత్ స్తంభాలు ఇక మేము భరించలేమంటున్నట్టు దృశ్యం కనబడుతుందని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.స్తంభం మొదలులో సిమెంట్ కాంక్రీట్ పూర్తిగా దెబ్బతిని ఇనుప చూవలు బయటకు తేలి తుప్పు పట్టి ప్రమాదకరస్థాయిలో ప్రజలకు హెచ్చరిస్తున్నట్టు ప్రతిబింబిస్తున్నాయి, అసలే వర్షాకాలం గట్టిగా గాలివాన వేస్తే ఎవరి ఇంటి మీద పడతాయో ఎవరి ప్రాణాలు బలి కొంటాయో అని సమీపంలోని నివాస ప్రజలు ఆందోళన చెందుతున్నారు.ఒకటి రెండు కాదు రజక బజార్ మున్నూరు కాపు బజార్ లలో కరెంటు స్తంభాల పరిస్థితి ప్రమాదకర స్థాయిలో ఉన్నాయని ప్రజలు వాపోతున్నారు.
దీనికి తోడు సిటీ కేబుల్ యజమానులు ఇష్టా రీతిగా కేబుల్ వైర్లను స్తంభాలకు బిగించి లాగడంతో ఎటు విద్యుత్ సరఫరా వైర్లు అటు కేబుల్ టీవీ ఇంటర్నెట్ వైర్లు భారం పడడంతో విద్యుత్ స్తంభాలు పూర్తిగా వంగి ప్రమాదకరంగా కనబడుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు దృష్టి సారించి ప్రమాదకరంగా ఉన్నటువంటి విద్యుత్ స్తంభాలను తొలగించి అదే స్థానంలో కొత్త కరెంటు పోల్స్ ను నెలకొల్పాలని కేసముద్రం రజక బజార్, మున్నూరు కాపు బజార్ ప్రజలు కోరుకుంటున్నారు.