Dangerous Curve Without Warning Board in Kesamudram
ప్రమాదకరమైన మూల మలుపు… హెచ్చరిక బోర్డు ఏది…?
ఆదమరిస్తే ఇక అంతే…!సరాసరి వాగులోకే…!
ఇది కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా…! లేక అధికారుల నిర్లక్ష్యమా…?
ప్రమాదాలు జరిగాకే హెచ్చరిక బోర్డులు పెడతారా…!
కేసముద్రం/ నేటి ధాత్రి
కేసముద్రం మండలంలోని వెంకటగిరి గ్రామం నుండి కాట్రపల్లి గ్రామానికి పంచాయతీరాజ్ శాఖ నూతనంగా నిర్మించిన సరికొత్త తార్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయడం జరిగింది. ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులలో మారుమూల ప్రాంతాల ప్రజల యొక్క రవాణాకు సౌకర్యార్థం కొరకు పంచాయతీరాజ్ శాఖ ద్వారా రోడ్డు నిర్మాణ పనులు జరగగా రోడ్డు నిర్మాణ పనులలో భాగంగా మూల మలుపుల వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదని అటుగా వెళ్లే వాహనదారులు ఆరోపిస్తున్నారు. కొత్తగా నిర్మించిన రోడ్డు కావడంతో వాహనాలను స్పీడుగా దూసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొత్తగా ప్రయాణించే వాహనదారులకు అత్యంత ప్రమాదకరమైన మూలమలుపు లను గమనించలేరని అలాంటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన మూలమలుపు వట్టి వాగు సమీపాన ఉన్నందున అలాంటి ప్రమాదకరమైన మూలమలుపు చోట అధికారులు ఎందుకు హెచ్చరిక మరియు మూలమలుపు సూచిక బోర్డు ఏర్పాటు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు చిన్న బోర్డు ఏర్పాటు చేసినా కానీ ఆ బోర్డు మీద సింబల్ కుడి వైపు వెళ్లాలని సూచించే విధంగా లేదని అది కూడా ప్రమాదం పొంచి ఉండే ఎడమవైపు చూపియ్యడం ఆశ్చర్యానికి గురి చేస్తుందని వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని మండిపడుతున్నారు. అత్యంత ప్రమాదకరంగా ఉండే మూలమలుపు వద్ద రోడ్డు పక్కనే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి ఉన్నందున వాహనదారులు అదుపుతప్పితే సరాసరి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ లోకి వాహనం దూసుకెళ్లే ప్రమాదం పొంచి ఉందని ట్రాన్స్ఫార్మర్ ప్రదేశంలో ఎలాంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం, అత్యంత ప్రమాదకరమైన మూలమలుపు ఉందని సూచించే బోర్డులు ఏర్పాటు చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి మనుషుల ప్రాణాలు బలి కావాల్సిందేనా అని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఎవరికి ఎలాంటి ప్రమాదాలు జరగకముందే ప్రమాదాలను అరికట్టే విధంగా ప్రమాద సూచికల బోర్డును ఏర్పాటు చేయాలని అటుగా వెళ్లే వాహనదారులు కోరుకుంటున్నారు.
