https://epaper.netidhatri.com/
` మరో సారి బైట పడుతున్న కాంగ్రెస్ మోసాలు.
` తెలంగాణలో కాంగ్రెస్ చెబుతున్న కట్టు కథలు.
` కర్నాటక లో గుట్టు రట్టవౌతున్న అబద్దాల హామీలు.
`వ్యవసాయానికి ఇస్తున్న కరంటు రెండు గంటలు.
`కాంగ్రెస్ అంటేనే మోసాలకు, దారుణాలకు, అబద్దాలకు కేరాఫ్ అడ్రస్. అలాంటి కాంగ్రెస్ ను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ
నమ్మరంటున్న రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, నేటిధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు కు చెప్పిన వివరాలు… ఆయన మాటల్లోనే..
`రోడ్డెక్కి రైతుల ధర్నాలు.. వంటా వార్పులు
`పరిశ్రమలకు కూడా కోతలే.
`ఇండ్లకు కూడా గంటల గంటలు పవర్ కట్లే.
`కాంగ్రెస్ వస్తే తెలంగాణ లో జరిగేది కూడా అదే!
`కాంగ్రెస్ ను కోరుకుంటే పాత రోజులే.
`నిత్యం కరంటు కష్టాలు కోరి తెచ్చుకున్నట్లే!
హైదరాబాద్,నేటిధాత్రి:
కాంగ్రెస్ పార్టీ చెప్పే మాటలు తేనె పూసిన కత్తికన్నా ప్రమాదకరం. ఆ మాటల వెనుక మర్మం, మాయా లోకం కన్నా దుర్మార్గం. తెలంగాణ ప్రజలను అరవై ఏళ్లు గోస పుచ్చుకొని, ఎన్నికలు రాగానే అరచేతిలో వైకుంఠం చూపించి, ఓట్లేయించుకొని తెలంగాణ కు తీరని అన్యాయం చేసిన చరిత్ర నే కాంగ్రెస్ పార్టీ ది. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మొసలి కన్నీరు కార్చుతుంటే ఆ నాటకం తెలంగాణ ప్రజలకు తెలియంది కాదు. సరిగ్గా పదేళ్ల క్రితం దాకా తెలంగాణను చూస్తే దుఖం ఆగకపోయేది. ఏ పల్లెను చూసినా ఆగమే…ఏ ఇంటిని చూసినా కష్టమే…కనిపించేదంతా బీడు భూములే…ఇల్లూ వాకిలి వదిలి, చిన్న పిల్లలను సైతం ముసలి వాళ్లకు అప్పగించి బతుకపోయిన కష్ట కాలం తెలంగాణది. ఇప్పటికీ ఆ నాటి పరిస్థితులు గుర్తుకొస్తే కళ్లలో నీటి సుడులు తిరుగుతాయి. గొంత జీరబోతుంది. అంతటి దుఖం ఎల్లబోసింది నా తెలంగాణ. తెలంగాణ ప్రజల కళ్ల నుంచి రాలుతున్న కన్నీళ్లను చూడలేక, తన కంటి చెమ్మను తట్టుకోలేక తెలంగాణ సాధనకు కదిలిన కేసిఆర్, తెలంగాణ సాధించి, బంగారు తెలంగాణ ఆవిష్కరించారు. ఈ కష్టం వెనుక ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడి సహాకారమైనా దాగి వుందా? కనీసం కనిపించిందా? తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే పారిపోతిరి. మంత్రి పదవులు వదులుకొమ్మంటే వదులుకోకపోతిరి. కనీసం తెలంగాణ ప్రజల కష్టం గ్రహించకపోతిరి. తెలంగాణ కోసం రాజీనామా చేసిన ఎమ్మెల్యేల మీదనే పోటీ చేస్తిరి. తెలంగాణ వాదం లేదని చెప్పే వాళ్ల చంకలో చేరితిరి. తెలంగాణకు తీరని అన్యాయం చేస్తిరి. ఏనాడైనా తెలంగాణ రాదని గొంతు చించుకున్న ఆంద్రా నేతలను కనీసం నిలదీశారా? తెలంగాణ అంతా దుఖం ఎల్లబోస్తుంటే, అప్పటి ఆంద్రా నేతలతో చెట్టా పట్టాలేసుకొని తిరిగితిరి. ఇంకా ఏ ముఖం పెట్టుకొని ఓట్లడుగుతారు? అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఓట్లడిగే నైతికత వుందా? అంటున్న రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, నేటిధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు తో చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే…
కాంగ్రెస్ చేసే మోసాలు, దారుణాలు చూసి భరించలేక, ప్రజల కష్టాలు చూసి చలించి, అలుపెరగని పద్నాలుగేళ్లు ఉద్యమం సాగింది, కాంగ్రెస్ మెడలు వంచి, తెలంగాణ తెచ్చి, ఎండిన పొలాలు తడిపి, ఇంటింటికీ మంచి నీళ్లిచ్చి ప్రజల కన్నీళ్లు తుడిచిన మనసున్న మానవత్వానికి ప్రతి రూపమైన నాయకుడు ముఖ్యమంత్రి కేసిఆర్.
తెలంగాణ ఆత్మ గౌరవం నిలబెట్టిన యోధుడు కేసిఆర్. అలాంటి గొప్ప నాయకుడి పాలనలో తెలంగాణ ఎంతో సుభిక్షంగా వుంది. వేరు పడిన సంసారమే కోలుకోవాలంటే కొన్నేళ్లు పడుతుంది. అలాంటిది తెచ్చుకున్న తెలంగాణ సుసంపన్నం కావాలంటే ఎంత కష్ట పడాలి. నిర్మాణం కన్నా పునర్నిర్మాణం ఎంతో క్లిష్టమైనది. అయినా తెలంగాణ వచ్చిన మూడు నెలల్లోనే కరంటు కష్టాలు తీర్చిన పాలకుడు కేసిఆర్. అసలు ప్రపంచంలోనే ఇలా వెలుగులు తెచ్చిన నాయకుడు మరొకరు లేరు. ఏడాదిలో చెదిరిపోయిన చెరువులకు పూర్వవైభవాన్ని తెచ్చిన నాయకుడు బహుశా మన దేశంలో ఒక్క కేసిఆర్ తప్ప మరొకరు లేరు. ఎండా కాలంలో చెరువులు మత్తళ్లు పోయడం అనేది తెలంగాణ చరిత్రలోనే కేసిఆర్ హయాంలో తప్ప ఎప్పుడూ చూసి వుండకపోవచ్చు. మూడేళ్ళలో కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టు నిర్మించేంత పట్టుదల, అంకిత భావం వున్న నాయకుడు చరిత్ర మొత్తం తిరగేసినా ఒక్క కేసిఆర్ తప్ప మరొకరు కనిపించరు. అంత గొప్ప నాయకుడి నీడన తెలంగాణ సమాజం సుసంపన్నమైంది. సుభిక్షమైన కాలం చూస్తోంది. కాలు మీద కాలేసుకొని రైతు సాగు చేసుకునే రోజులు వచ్చాయి. కన్నీటికి, కష్టానికి బలై,బతకులీడ్చిన తెలంగాణ రైతన్న ఇప్పుడు పుట్లకొద్ది పంటలు చూస్తున్నాడు. ఒకనాడు మెతుకు కోసం ఏడ్చిన తెలంగాణ రైతు పంట రాశులు చూసి మురుసుకుంటూ ఉబికి వస్తున్న ఆనంద బాష్పాలతో సంబురపడుతున్నారు. కరంటు కోతలు, బిల్లుల మోతలు వాతలు చూసిన తెలంగాణ రైతు నిరంతర ఉచిత కరంటు చూస్తున్నాడు. ఎండిన పొలం తప్ప ఎప్పుడూ చుక్క నీరు లేని చోట, ఎప్పుడూ నిండి వుంటున్న పొలం చూస్తున్నాడు. పచ్చని చెలుకలో చెట్టు నీడన హాయిగా నిద్రిస్తున్నాడు. పాడి పంటను కన్నుల నిండా చూసుకుంటున్నాడు. ఇదీ రైతు ఆనందంతో నవ్వులు పండుతున్న తెలంగాణ. సంతోషాలు నిండిన తెలంగాణ.
కర్నాటక లో కరంటు కష్టాలను ఓసారి చూస్తే కాంగ్రెస్ పార్టీ పాలన ఎలా వుంటుందో తెలుస్తుంది.
కర్నాటకలో ఎన్నో ఎన్నెన్నో చెప్పారు. ఏమైంది. కనీసం కరంటు కూడా ఇవ్వలేకపోతున్నారు. తెలంగాణ లో కాంగ్రెస్ నాయకులు మాత్రం కోతల మీద కోతలు కోస్తున్నారు. కర్నాటక లో కరంటు కోతలున్నాయని తెలిస్తే కాంగ్రెస్ వాళ్లకు ప్రజలే వాతలు పెడతారు. ఇప్పటికీ వాళ్ళలో మార్పు రాదు. ఎప్పుడూ మార్పు రాదు. ఎందుకంటే అది కాంగ్రెస్ పార్టీ.అవకాశవాద పార్టీ. అదికారం కోసం ఏదైనా చెబుతుంది. ఎంతైనా మోసం చేస్తుంది. 1994 అధికారం కోల్పోయి, పదేళ్లు ప్రతిపక్షం చూసింది. ఎలాగైనా అధికారంలోకి రావాలని తెలంగాణ ఇస్తామని బిఆర్‌ఎస్ తో పొత్తు పెట్టుకొని గెలిచి పదేళ్లు గోస పెట్టింది. తెలంగాణ యువత పిట్టల్లా రాలిపోతున్న కాంగ్రెస్ కనికరించలేదు. కాంగ్రెస్ నేతల మనసు కరగలేదు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో ఉమ్మడి పాలకులు కావాలని తెలంగాణకు కరంటు కష్టాలు సృష్టించినా మాట్లాడలేదు. ఒక్క చిత్తూరు జిల్లా మంచి నీటి కోసం రూ. 8 వేల కోట్లు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేటాయించుకుంటే చప్పట్లు కొట్టింది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కాదా? అదేక్కడి అన్యాయం తెలంగాణ మంచి నీటి అవసరాలు తీర్చాలని స్వయంగా నేనే డిమాండ్ చేస్తే రూపాయి కూడా ఇవ్వం..ఏం చేసుకుంటారో చేసుకోండని కిరణ్ కుమార్ రెడ్డి అంటే కనీసం స్పందించారా? ఆంధ్రా ఎమ్మెల్యేలతో పాటు, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే లు బల్లలు చర్చి తెలంగాణ ఆత్మ గౌరవం దెబ్బ తీసింది నిజం కాదా? సొంత ప్రాంతానికి అన్యాయం చేసే ఇలాంటి నాయకులు ఇప్పుడు నంగనాచి మాటలు మాట్లాడుతుంటే జనం నవ్వుకుంటారని కూడా లేదు. అయినా తెలంగాణను చీకట్లోకి నెట్టేసి, సకల కష్టాలకు కారణమే కాంగ్రెస్ పార్టీ. ముందు కర్నాటక లో కరంటు కటకట బాగు చేసుకోండి. తెలంగాణ లో రెప్ప పాటు కరంటు పోదు. పైగా నాణ్యమైన కరంటు ఇరవై నాలుగు గంటలు సరఫరా జరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ హయాంలో జనరేటర్లు, ఇన్వర్టర్లు లేకుండా జిరాక్స్ సెంటర్లు కూడా నడిచేవి కాదు. పగలంతా కరంటు కోతలే…రాత్రి పూట కూడ పగబట్టినట్లే ఉక్కపోతల్లో బతకాల్సి వచ్చేది. ఆ నరకం గురించి తెలిసిన తెలంగాణ సమాజం కాంగ్రెస్ ను చీదరించుకుంటుందే గాని, ఆదరించే సమస్యే లేదు. ఒక్కొక్కటిగా మరో సారి బైట పడుతున్న కాంగ్రెస్ మోసాలు. అయినా తెలంగాణలో కర్నాటక కట్టు కథలు చెప్పి మోసం చేయాలని చూస్తున్నారు. కర్నాటక లో గుట్టు రట్టవౌతున్న అబద్దాల హామీలు కాంగ్రెస్ పాలిట శాపాలౌతున్నాయి.
కర్నాటక లో వ్యవసాయానికి కరంటు రెండు గంటలు మాత్రమే సరఫరా చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారు. కర్నాటక మొత్తం రోడ్డెక్కి రైతుల ధర్నాలు చేస్తున్నారు.. వంటా వార్పులు చేస్తున్నారు. అక్కడ పరిశ్రమలకు కూడా కోతలే విధిస్తున్నారు. ఇండ్లకు కూడా గంటల గంటలు పవర్ కట్ల కటకటే. కాంగ్రెస్ ను పొరపాటున నమ్మితే తెలంగాణ లో కూడా జరిగేది కూడా అదే! అన్నది ప్రజలు గమనించాలి.
కాంగ్రెస్ ను కోరుకుంటే పాత రోజులే వస్తాయన్నది నేటి తరానికి గుర్తు చేయాలి. కాంగ్రెస్ చూపించిన చీకటి రోజుల గురించి నేటి యువతకు పెద్దలు చెప్పాలి.