కరీంనగర్ లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నించిన సీపీఐ నేతలు
అడ్డుకున్న పోలీసులు
అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు తగ్గినా వంటగ్యాస్ ధరలు పెంచడం దుర్మార్గం- సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి
కరీంనగర్, నేటిధాత్రి:
అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ దేశంలో బిజెపి ప్రభుత్వం పేద మధ్యతరగతి సామాన్య ప్రజలపై భారం మోపడానికి వంటగ్యాస్ ధరలు పెంచడం దుర్మార్గమని పేదలపై భారం మోపే దేశ ప్రధాని మోడీకి మూడినట్లేనని సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి అన్నారు. మంగళవారం కరీంనగర్ లోని కమాన్ చౌరస్తా వద్ద సిపిఐ ఆధ్వర్యంలో పెంచిన వంట గ్యాస్ ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి ప్రయత్నించిన సిపిఐ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. కొద్దిసేపు పోలీసులకు, సీపీఐ నేతలకు తోపులాట జరగగా సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు తలకు గాయమై రక్తస్రావం అయ్యింది.కొంతమంది కిందపడగా వారికి దెబ్బలు తగిలాయి. ఆందోళన చేస్తున్నంత సేపు వాహనాలు నిలిచిపోయాయి. ఈసందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం చమరు ధరలను తగ్గించకుండా ఆయిల్ కంపెనీలకు వత్తాసు పలుకుతుందని, అర్ధరాత్రి వంటగ్యాస్ యాభై రూపాయలు పెంచి పెదాలపై భారం మోపి పెట్రోల్, డీజిల్ పై రెండు రూపాయలు పెంచి వీటిని ఆయా కంపెనీలే భరించాలని కేంద్ర మంత్రి ప్రకటించడం దుర్మార్గమని, ఏదో ఒక రోజు మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచదనే గ్యారంటీ లేదని అనుమానం వ్యక్తం చేశారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రధానిగా పదకొండు సంవత్సరాలు గడిచిపోయిందని పదకొండు సంవత్సరాలలో పేద, మధ్యతరగతి, సామాన్య ప్రజలపై పెను భారం మోపడానికి అనేకసార్లు పెట్రోలు, డీజీలు, వంటగ్యాస్, నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచి పేదల జీవన ప్రమాణాలను దెబ్బతీసే విధంగా మోడీ పాలన కొనసాగుతుందని, పెట్టుబడిదారులకు, బహుళజాతి సంస్థలకు లాభం చేకూర్చే విధంగా మోడీ ప్రభుత్వ విధానాలు ఉంటున్నాయని అలాంటి విధానాలకు మోడీ స్వస్తి పలకాలని,తక్షణమే వంటగ్యాస్ ధరలను తగ్గించాలని లేనిపక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించక తప్పదని వెంకటస్వామి హెచ్చరించారు. వంటగ్యాస్ ధరలు తగ్గించాలని సీపీఐ నాయకులు శాంతియుతంగా కమాన్ చౌరస్తా వద్ద ఆందోళన నిర్వహించడానికి అక్కడకు చేరుకున్న సీపీఐ నాయకులపై, కార్యకర్తలపై కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు అతి ఉత్సాహం ప్రదర్శించి, దురుసుగా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదని, ముఖం కనబడకుండా మాస్కులు వేసుకొని ఆర్ఎస్ఎస్,బిజెపికి తొత్తులుగా కొంతమంది వ్యవహరిస్తూ నాయకులపై, కార్యకర్తలపై దురుసుగా ప్రవర్తించడాన్ని సీపీఐ ఖండిస్తుందని, పేద ప్రజలకు అండగా సీపీఐ నిరంతరం ఉద్యమాలు పోరాటాలు నిర్వహిస్తుందని, పోలీసులు ఈవిషయాన్ని గుర్తుంచుకొని వ్యవహరించాలని వెంకటస్వామి అన్నారు. ఈఆందోళన కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పైడిపల్లి రాజు, కిన్నెర మల్లవ్వ, సాయవేణి రాయమల్లు, బామండ్లపెల్లి యుగంధర్, న్యాలపట్ల రాజు, బోనగిరి మహేందర్, మచ్చ రమేష్, నాయకులు కొట్టే అంజలి, చెంచల మురళి, తంగెళ్ళ సంపత్, చారి, రాజు, కూన రవి,నల్లగొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.