పెట్టుబడిదారుల,కార్పొరేట్ శక్తుల ఆగడాలకు కళ్ళెం వేసేది కమ్యూనిస్టులే
కరీంనగర్ లో ఘనంగా సిపిఐ వందేళ్ళ సంబరాలు
అంతరాలు లేని సమ,సమాజ నిర్మాణం కోసం,అణగారిన వర్గాల హక్కుల కోసం వందేళ్లుగా సిపిఐ పోరాడుతుంది- పంజాల శ్రీనివాస్
కరీంనగర్, నేటిధాత్రి:
భారతదేశ సంపదను దోచుకునే పెట్టుబడిదారుల, కార్పోరేట్ శక్తుల ఆగడాలకు ఎప్పటికప్పుడు కళ్ళెం వేసింది కమ్యూనిస్టులేనని, సమాజంలో జీవిస్తున్న వారందరి కోసం అంతరాలు లేని సమ సమాజ నిర్మాణం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం వందేళ్లుగా నిరంతరం పోరాటాలు నిర్వహిస్తోంది భారత కమ్యూనిస్టు పార్టీయే నని సిపిఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ అన్నారు. భారతదేశంలో సిపిఐ ఆవిర్భవించి వంద సంవత్సరాలు అవుతున్న సందర్భంగా శుక్రవారం కరీంనగర్ లోని సిపిఐ జిల్లా కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్ వద్ద ఏర్పాటుచేసిన సిపిఐ జెండాను పంజాల శ్రీనివాస్ ఎగురవేశారు, సిపిఐ శ్రేణులంతా కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈసందర్భంగా పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ సోవియట్ రష్యా విప్లవ విజయం స్ఫూర్తితో భారత దేశ స్వాతంత్ర్యానికి పూర్వమే 1925 డిసెంబర్ 26న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ లో సిపిఐ ఆవిర్భవించిందని, అంతరాలు లేని సమాజ నిర్మాణం వర్గ దోపిడీకి వ్యతిరేకంగా సిపిఐ పనిచేస్తుందన్నారు. బ్రిటిష్ పాలనలో మగ్గుతున్న భారతదేశానికి స్వాతంత్ర్యం కావాలని స్వాతంత్ర్య మహోద్యమంలో సిపిఐ పార్టీ పాల్గొన్నదని, వేలాది మంది కమ్యూనిస్టుల ప్రాణ త్యాగాలు కూడా జరిగాయని, స్వాతంత్ర్యం తీసుకురావడంలో సిపిఐ పాత్ర కీలకమైందన్నారు. స్వాతంత్ర్య అనంతరం దేశంలో కార్మిక కర్షక పేద బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం సంక్షేమం కోసం వారి హక్కులను పరిరక్షించేందుకు ఎన్నో పోరాటాలు నిర్వహించిందని, దేశంలో ఆనాడు ఉన్న పరిస్థితుల్లో రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయికరణ, పద్దెనిమిది ఏండ్లు నిండిన యువతీ యువకులకు ఓటు హక్కు చట్టం,భూ హక్కు చట్టం,అటవీ హక్కుల చట్టం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం లాంటి అనేక ప్రజా ఉపయోగకరమైన చట్టాలు తీసుకువచ్చిన ఘనత సిపిఐ దేనన్నారు. హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలిస్తున్న నిజాం నవాబ్ పరిపాలనకు, రజాకార్లకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీ అగ్ర నాయకులు రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి మగ్దూo మొహిద్దిన్ లు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారని, ఆమహత్తర పోరాటములంగా నిజాం నవాబు భారత దేశంలో హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేశాడని, ఆపోరాటంలో నాలుగు వేల ఐదు వందల మంది వీరమరణం పొందారని, పదిలక్షల ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలకు పంచిన ఘనత సిపిఐకే దక్కిందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్మిక హక్కులను, రైతుల చట్టాలను మారుస్తూ చివరకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్మికుల పొట్టను కొట్టే విధంగా పరిపాలన కొనసాగిస్తుందని, రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను కాలవస్తుందని, ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ, దేశ సంపదను పెట్టుబడిదారులకు అప్పనంగా అప్పజెప్తూ వనరులన్నింటినీ కొల్లగొడుతుందని, బిజెపి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై రానున్న రోజుల్లో ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, వామపక్ష అభ్యుదయవాదులు మరిన్ని పోరాటాలను ఉదృతం చేయాలని అందుకు సిపిఐ శ్రేణులు సిద్ధం కావాలని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ కౌన్సిల్ సభ్యులు న్యాలపట్ల రాజు, పైడిపల్లి రాజు, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, బామండ్లపెల్లి యుగేందర్, బూడిద సదాశివ, బోనగిరి మహేందర్,కొట్టే అంజలి, శాఖ కార్యదర్శులు ఎలిశెట్టి భారతి, గామినేని సత్యం,టి.రామారావు,చెంచల మురళి, కసిబోజుల సంతోష్ చారి, మాడిశెట్టి అరవింద్, బాకం అంజయ్య, తోడేటి శ్రీనివాస్, నగునూరి రమేష్, మామిడిపల్లి హేమంత్ కుమార్,సందీప్ రెడ్డి, సాంబయ్య, వెంకట్రాములు, సంపత్, తదితరులు పాల్గొన్నారు.
