
Danger of Cotton Earbuds for Ear Health
చెవులను కాటన్ ఇయర్‌బడ్స్‌తో క్లీన్ చేస్తున్నారా? అయితే, ఈ విషయంలో జాగ్రత్త..!
మనం చెవులను శుభ్రం చేసుకోవడానికి కాటన్ ఇయర్‌బడ్‌లను ఉపయోగిస్తాము కానీ అలా చేయడం చాలా ప్రమాదకరం. దీనివల్ల చెవులకు అనేక రకాల నష్టం జరుగుతుంది మరియు ఆ వ్యక్తి చెవిటివాడు కూడా కావచ్చు.
మన చెవులు సరిగ్గా పనిచేయడానికి ఇయర్‌వాక్స్ లేదా సెరుమెన్ చాలా అవసరం. లోపలి చెవిని శుభ్రంగా ఉంచడం, రక్షించడం చాలా అవసరం. కానీ కొంతమంది మన చెవుల్లో ఉత్పత్తి అయ్యే ఇయర్‌వాక్స్ మురికిగా ఉంటుందని భావిస్తారు. అందుకని చెవుల్లోనే వ్యాక్స్ తొలగించేందుకు ఇయర్‌బడ్‌లు, అగ్గిపుల్లలు, పిన్నులు మొదలైన వస్తువులను ఉపయోగిస్తారు. ఇప్పుడు పెద్దల నుండి చిన్న పిల్లల వరకూ చెవుల క్లీనింగ్ కోసం కాటన్ ఇయర్ బడ్స్ వాడటం అలవాటు చేసుకున్నారు. ఇది మీకు చాలా సాధారణ విషయంగానే అనిపించవచ్చు. కానీ అది ఎంత ప్రమాదకరమో తెలుసా? ఈ అలవాటు మన వినికిడిని దెబ్బతీస్తుందంటే మీరు నమ్ముతున్నారా? అంతే కాదు.. ఇది చెవి ఇన్ఫెక్షన్లకు కూడా కారణమవుతుందని నిపుణులు అంటున్నారు.
చెవిలో శబ్దాలు వస్తున్నాయా?
ప్రతి వ్యక్తి చెవిలోని ఇయర్‌వాక్స్ ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనదని చాలా మందికి తెలియదు. ఇది చెవులను రక్షించే సహజ రక్షణ పొర. మనం అనుకున్నట్లుగా ఇయర్‌వాక్స్ మురికిగా ఉండదు. కానీ చాలా మంది చెవిలో పేరుకుపోయే ఇయర్‌వాక్స్ మురికిగా ఉంటుందని భావిస్తారు. దానిని పదే పదే శుభ్రం చేస్తారు. కానీ అది నిజం కాదు. ఇయర్‌వాక్స్ అనేది రెండు రకాల గ్రంథుల ద్వారా ఉత్పత్తి అయ్యే రక్షిత పదార్థం. ఇది చెవి లోపలి భాగాన్ని దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా నుండి రక్షిస్తుంది. అంతే కాదు, చెవి లోపలి భాగాన్ని తేమగా ఉంచడానికి కూడా ఇది సహాయపడుతుంది. అలాకాక దీన్ని తొలగిస్తే కొన్నిసార్లు చెవుల్లో శబ్దం మార్మోగుతున్న భావన కలుగుతుంది.
ఎంత ప్రమాదకరం?
చెవులను శుభ్రం చేయడానికి ఉపయోగించే కాటన్ ఇయర్‌బడ్‌లను చెవిలోకి నెట్టినప్పుడు అవి లోపల ఉన్న సున్నితమైన చర్మాన్ని దెబ్బతీస్తాయి. ఇంకా లోపలికి మరింత నెట్టినప్పుడు, ఇయర్‌వాక్స్‌ను మరింత ముందుకు నెట్టవచ్చు. ఇది ఇయర్‌వాక్స్‌ను కుదించి బయటకు రాకుండా నిరోధించవచ్చు. ఇవన్నీ చెవి నొప్పి లేదా వినికిడి లోపానికి దారితీయవచ్చు.
చెవి ఇన్ఫెక్షన్లకు కారణాలు ఏమిటి?
ఇయర్ బడ్స్ వాడేటప్పుడు బయటి నుండి వచ్చే బ్యాక్టీరియా చెవిలోకి ప్రవేశించడమే కాకుండా లోపలి సున్నితమైన చర్మానికి గాయాలు కలిగించి ఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ తీవ్రమైన నొప్పి, దురద, దుర్వాసనను కలిగిస్తుంది. ఇయర్ వాక్స్ గట్టిపడినప్పుడు ఇది ధ్వని తరంగాలు చెవిపోటును చేరకుండా నిరోధించవచ్చు. ఇది తాత్కాలికంగా లేదా శాశ్వతంగా వినికిడి లోపం ఏర్పడే ప్రమాదానికి దారితీస్తుంది. మన చెవులు తమను తాము శుభ్రపరుచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. చాలా సందర్భాలలో ఇయర్ వాక్స్ సహజంగా బయటకు వస్తుంది. మీ చెవిలో నొప్పి, దురద లేదా మీ వినికిడిలో ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. సరైన పద్ధతులను ఉపయోగించి వైద్య నిపుణులు మాత్రమే ఇయర్ వాక్స్ ను సురక్షితంగా తొలగించగలరు. గుర్తుంచుకోండి. మన ఆరోగ్యం గురించి మనం అప్రమత్తంగా ఉండాలి. చెవి సంబంధిత సమస్యల విషయానికి వస్తే దానిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు.
(NOTE: ఇంటర్నెట్లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)