ఆదాయం వున్న పోస్టులకు అధిక డిమాండ్
అందినకాడికి దండుకోవడమే లక్ష్యం
వేలంపాటలో అధిక మొత్తం చెల్లించినవారికే అటువంటి పోస్టులు
పెట్టిన పెట్టుబడికి లాభంకోసం ప్రజలను పీడిస్తున్న ఉద్యోగులు
కొందరు చిన్నస్థాయి ఉద్యోగులకు కూడా కోట్ల విలువైన ఆస్తులు
అవినీతికి స్వేచ్ఛనిస్తున్న మన ప్రజాస్వామ్యం
ఏసీబీ అంటే భయపడే రోజులు పోయాయి
పట్టుబడినా పోస్టులు పదిలం…అవినీతికి లేదు అడ్డం
హైదరాబాద్,నేటిధాత్రి:
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వమనే రథానికి అధికార యంత్రాంగం చక్రాలవంటివారు. వీరు లేకపోతే పాలన సాగదు. అందువల్లనే పాలనా యంత్రాంగానికి అంతటి ప్రాధాన్యత. ప్రభుత్వం అమలు చేయాలనుకున్న సంక్షేమ పథకాలు, ప్రజలకు అందించాల్సిన వివిధ రకాల సేవలు ఈ యంత్రాంగం ద్వారానే జరుగుతాయి. అధికారంలో వున్న పార్టీ తన హామీలను సక్రమంగా అమలు చేయడానికి చక్కటి ప్రణాళికతో ముందుకు తీసుకెళ్లేది ఈ ప్రభుత్వ అధికారులే! మరోమాట లో చెప్పాలంటే ప్రజాసేవలో అధికార్లది అత్యంత కీలకమైన పాత్ర. ఎందుకంటే ప్రభుత్వం తన పాలనా శైలిని మాత్రమే చెబుతుంది. కానీ దాన్ని విజయవంతంగా అమలు చేసేది ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చేలా కృషిచేసేది అధికార యంత్రాంగమే. ఇంతటి కీలకమైన స్థానాన్ని ఆక్రమిస్తున్నందువల్లనే అడుగడుగునా అవినీతికి ఆస్కారం వుంటుంది. ప్రభుత్వ పాలనను భ్రష్టుపట్టించేది,అధికారపార్టీని అప్రతిష్టపాలు చేసేది కూడా ఈ అవినీతి మాత్రమే! ప్రభుత్వ అధికార యంత్రాంగంలో పనిచేసే ఉద్యోగులు రిటైరయ్యే వరకు తమ తమ స్థానాల్లో కొనసాగుతారు. అదే ప్రభుత్వానికి నేతృత్వం వహించే పార్టీ పదవీకాలం ఐదేళ్లు మాత్రమే! అందువల్ల పాలనలోని ప్రతి అంశాన్ని మంత్రులకు వివరించడం ద్వారా, సదరు పార్టీ తన హామీలను చట్టబద్ధమైన రీతిలో అమలు చేసేలా సలహాలు ఇచ్చి దిక్సూచిగా వ్యవహరించేది ఉన్నతాధికార్లు.
ప్రజాస్వామ్యంలో ఇంతటి ప్రధాన పాత్ర పోషించే పాలనా యంత్రాంగంలోకి అవినీతి వేరుపురుగు ప్రవేశిస్తే, సర్వం భ్రష్టమైపోతుంది. ప్రభుత్వంపై ప్రజల్లో తప్పుడు అభిప్రాయం ఏర్పడి కుప్ప కూలే అవకాశముంది. అందువల్ల ఈ పాలనా యంత్రాంగం ఎప్పుడూ ప్రభుత్వ ఆధీనంలో, ని బంధనల మేరకు పనిచేయించగలిగే ఫ్రేమ్‌వర్క్ ఒకటి రూపొందించబడి వుంటుంది. కానీ అవినీతి పెచ్చరిల్లినప్పుడు, ఈ ఫ్రేమ్‌వర్క్ పనిచేయడంలేదు. ప్రభుత్వాలు మారేకొద్దీ ఈ అధికార యంత్రాంగంలో చాలామంది బలంగా వేళ్లూనుకుపోయి, అవినీతి మార్గాల్లో అక్రమ సంపాదనకు అలవాటు పడటం వర్తమాన చరిత్ర. ఇది రానురాను మరింత వికృతరూపం దాలుస్తున్నట్టు తెలంగాణలో జరుగుతున్న కొన్ని సంఘటనలను పరిశీలిస్తే అవగతమవుతుంది. ముఖ్యంగా దిగువస్థాయి అధికార్లు ఏదశకు చేరుకున్నారంటే, అవసరమైతే తమ అక్రమ సంపాదన దన్నుతో మంత్రులపై తప్పుడు ప్రచారాలు చేయించి, వారి పదవులకే ఎసరుపెట్టే స్థాయికి ఎదగడం వర్తమాన వైచిత్రి!
ప్రజాసంబంధాలకు సంబంధించిన శాఖల్లో పనిచేసే ఉద్యోగులు అవినీతికి పాల్పడే అవకాశాలు ఎక్కువ. కొందరు నిజాయతీ పరులైన అధికార్లు లేకపోలేదు. కానీ వీరిశాతం చాలా తక్కువ. అవినీతి అధికార్లు సంపాదన ఎక్కువగా ఉండే పోస్టులకు వెళ్లడానికి అవసరమైనంత చెల్లించడానికిఎంతమాత్రం సంకోచించడంలేదు. రానురాను ఇదొక వేలంపాటగా మారిపోయింది. అంటే ఉ ద్యోగులే తమకు కావలసిన పోస్టులకోసం పై అధికార్లకు పెద్దమొత్తాల్లో లంచాలు సమర్పించుకొని ఆ పోస్టులో నియామకమైతే, ప్రజలను ఏ స్థాయిలో పీడిరచుకు తింటారో అర్థం చేసుకోవ చ్చు. ఒకప్పుడు లంచం అంటే చాటుమాటుగా, భయంగా తీసుకునే పద్ధతికి ఎనాడో కాలం చె ల్లింది. ఇప్పుడంతా బహిరంగమే. ఒక్కొక్క పనికి ఇంత మొత్తం అని నిర్ణయించి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు. పై అధికార్లకు అప్పటికే నజనారానాలు చెల్లించి పోస్టులోకి రావడంవల్ల ఎవ రూ అడగరనే ధైర్యం పెరిగిపోయింది. తాము లంచంగా ఇచ్చిన మొత్తానికి రెట్టింపు లాభార్జన వసూళ్ల రూపంలో సంపాదించాలన్న యావ బాగా ముదిరింది. ఈ కారణంగానే కొన్ని శాఖల్లో దిగువస్థాయి ఉద్యోగుల ఆస్తులు వందలకోట్లకు చేరుతున్నాయి. ఒకవేళ అవినీతి నిరోధక శాఖ అధికార్లకు పట్టుబడినా వీరిలో భయం ఏకోశానా కనిపించంలేదు. తాము సంపాదించిన మొత్తంలో కొంత ఖర్చుచేసి కేసులనుంచి బయటపడి తిరిగి పోస్టుల్లో చేరుతున్నారు. ఎ.సి.బి.కి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ఉద్యోగులు కోర్టుకెళ్లి ఏదోరకంగా తిరిగి తమ పోస్టుల్లో కొనసాగుతున్నారు.
ఇటీవల ఎ.సి.బి.కి పట్టుబడిన అధికార్లు తమపై కేసులు నిరూపణ అయ్యే వరకు పోస్టుల్లోనే కొనసాగించాలని, నేరం నిరూపణ అయితే అప్పుడే కఠిన శిక్ష విధించవచ్చునని కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు కూడా వారికి అనుకూలంగా తీర్పు చెప్పడం వారిలో మనోధైర్యాన్ని రెట్టింపు చేసింది. నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఈవిధంగా పట్టుబడి సస్పెండ్ అయిన అధి కార్లను, కేసు పూర్తయ్యేవరకు పోస్టులోకి తీసుకోదు. కానీ కోర్టు తమకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును సదరుశాఖ మంత్రివద్దకు తీసుకెళ్లి, తమకు తిరిగి పోస్టుల్లోకి తీసుకోవాలని ఇటీవల అటువంటి అధికార్లు సంబంధిత శాఖ మంత్రివద్దకు వెళ్లి విజ్ఞప్తి చేశారు. అయితే అందుకు మం త్రి ససేమిరా అనడంతో వీరికి ఏం చేయాలో పాలుపోలేదు. ఇదే సమయంలో మంత్రి నిజాయతీగా పనిచేయమంటూ హితోక్తులు పలకడం వారికి ఎంతమాత్రం నచ్చలేదు. ఇప్పటివరకు లం చాల రూపంలో విపరీతంగా ఆదాయాన్ని పొందుతున్న ఈ అధికార్లకు ఇప్పుడు కేవలం జీతం రాళ్లతోనే బతకాలంటే మనసు ఎంతమాత్రం ఒప్పుకోదు. తప్పుడు మార్గాల్లో వచ్చే అధికాదాయంద్వారా విలాసాలకు, ఆస్తులు సమకూర్చుకోవడానికి అలవాటుపడిన అధికార్లు ఇప్పుడు మంత్రిపై గుర్రుగా వున్నారు. విచిత్రమేమంటే సదరు మంత్రివర్యులు, ఈ అధికార్ల అవినీతిబాగోతంపై ఒక పత్రికలో వచ్చిన వార్తలను చూపించి, నిజాయతీగా పనిచేసుకోవాలని కోరడం వారికి తీవ్ర ఆగ్రహం కలిగించింది.
వెంటనే వారు తమకు అనుకూల మీడియా వ్యక్తుల వద్దకు వెళ్లి, పరిస్థితిని వివరిస్తే, యూనియన్ నేతల వద్దకు వెళ్లి సదరు వార్తలను ఖండిరచమని కోరమని సలహా ఇవ్వడంతో వారు అదేవిధంగా తమ యూనియన్ నాయకులపై ఒత్తిడి తెచ్చారు. ఇక వార్తలు రాసిన పత్రిక విలేకర్లు త మను రూ.20లక్షలు డిమాండ్ చేయగా తాము అంగీకరించకపోవడంతో, తప్పుడు వార్తలు రాసినట్టు ఈ అధికార్లు తమకు అనుకూల మీడియాలో వార్తలు రాయించుకోవడం, ప్రసారం చేయ డం మొదలుపెట్టారు. ఆవిధంగా తమకు అనుకూలంగా పనిచేసిన మీడియాకు కొంత ముట్టజె ప్పారు. పనిలోపనిగా ఇదే మీడియా సహాయంతో తమకు హితవు చెప్పిన మంత్రికి వ్యతిరేకంగా వార్తలను వండటం మొదలుపెట్టారు. ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడటమే కాకుండా, అవినీతి ఊబిలో కూరుకుపోయిన ఈ అధికార్లు తాము సంపాదించిన పాపపు సొమ్ముతో, మంత్రులనే ఏకంగా టార్గెట్ చేయడం మొదలుపెట్టారంటే వారి ఆర్థిక మూలాలు ఎంత బలంగా వున్నాయో అర్థమవుతుంది.
అవినీతి సంపాదన ఒకస్థాయి దాటిన తర్వాత, పార్టీ టిక్కెట్లకోసం రాజకీయ నాయకులతో పోటీపడుతున్నారంటే అతిశయోక్తి కాదు. ఒక సంఘటనలో ఒక అధికారి ఒక ప్రముఖ పార్టీ నేత వ ద్దకు వెళ్లి తనకు పార్టీ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తూ, రూ.25కోట్లు పార్టీ ఫండ్‌గా ఇచ్చేందుకు ముందుకు రావడమే కాదు, ఎన్నికల్లో తన ఖర్చు తానే పెట్టుకుంటానని ఆఫర్ ఇచ్చాడంటే ఆయన అవినీతి సంపాదన ఏస్థాయిలో ఉన్నదో చెప్పల్సిన అవసరం లేదు. ఒకప్పటి వరంగల్ జిల్లాకుచెందిన ఒక చిన్నస్థాయి ఉద్యోగి తన కుమార్తెకు ఏకంగా రూ.5కోట్లు కట్నం చెల్లించాడంటే అవినీతి సంపాదన ఏస్థాయిలో వుందో అర్థం చేసుకోవచ్చు. కొద్ది నెలల క్రితం ఇదే జిల్లాకు చెందినఒక రెవెన్యూ అధికారి కుమారుడికి వివాహం నిశ్చయమైంది. సరిగ్గా ఇదే సమయంలో రూ.7కోట్ల విలువైన ఆయన ఆక్రమ ఆస్తులు జప్తుకు గురయ్యాయి. పెళ్లి ఆగిపోతుందని అంతా భయపడ్డారు. కానీ పిల్ల తరపువారు మాత్రం, ‘జప్తు అయింది ఏడుకోట్లే కదా! ఇంకా చాలా కోట్ల ఆస్తి వుంటుంది. భయపడాల్సిన అవసరం లేదు. మన అమ్మాయి సుఖపడుతుంది’ అంటూ వివాహా న్ని చక్కగా జరిపించేశారు. అవినీతి ఇస్తున్న భరోసాకు ఇంతకు మించిన నిదర్శనం ఏముంటుంది? ఒకరకంగా చెప్పాలంటే అవినీతి ‘చట్టబద్ధతను’ సంతరించుకున్నదనుకోవాల్సిన పరిస్థితులు దాపురించాయి. రెవెన్యూశాఖలో లంచాలు మరిగిన అధికార్లు పహణీల్లో పేర్లు మార్చడానికి కూడా వెనుకాడటంలేదు. పట్టేదారు పాస్‌పుస్తకం కావాలంటే ఎకరానికి రూ.లక్ష డిమాండ్ చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈమొత్తం మరింత ఎక్కువ వుంటోంది. రెండెకరాలున్న రైతు రెండు లక్ష లు లంచంగా ఇవ్వగలడా? కానీ తప్పడంలేదు. లంచం ఇవ్వు…సేవను పొందు అనేరీతిలో ప్ర భుత్వ సేవలు తయారయ్యాయి. దీన్నే ‘అవినీతిలో నీతి’ అని సరిపుచ్చుకోవాలో తెలియని దుస్థితి! వచ్చేకాలంలో ఈ అవినీతి మరింత జడలువిప్పి కొత్త పోకడలతో ప్రజలను ‘అలరించ’వచ్చు. కొన్ని ప్రాంతాల్లో స్థలాలు, పొలాల రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన స్టాంపు ఫీజుకు రె ట్టింపు చెల్లిస్తే తప్ప పనులు జరగడంలేదు. అంటే చెల్లించే రెట్టింపు మొత్తం అధికార్లు పంచుకోవడానికి సరిపోతోంది.
మరి ఇంతటి విచ్చలవిడి అవినీతికి అంతం పలకలేమా? అంటే ఇందుకు ఒక్కటే మార్గం! కీలక మైన ప్రజాసంబంధాల శాఖల్లో పోస్టులకు ఉద్యోగ భద్రత వుండకూడదు! చిన్న అవినీతి లేదా తప్పు జరిగినా తక్షణం ఉద్యోగం వూడుతుందన్న భయం వుండాలి. అవినీతికి సంబంధించిన వి చారణలో బాధితులు చెప్పే అంశాలకే ప్రాధాన్యం ఇవ్వాలి. నిజాయతీ అధికార్లకు ప్రోత్సాహం, తగిన అండదండలు అందించాలి! ఉద్యోగ యూనియన్లకు ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వకూడదు! యూనియన్లు గుదిబండలు తప్ప ప్రజాసేవకు పనికిరావు!
ప్రైవేటు సంస్థలు విజయవంతమవుతున్నాయంటే పై అంశాలను పాటించడమే ప్రధాన కారణం.కానీ మన వ్యవస్థ ఎంతగా భ్రష్టుపట్టిపోయిందంటే, ఈ లంచం అనే భూతం, ఓటు వేసేదగ్గరి నుంచి మొదలై పై స్థాయి వరకు ఊడలు పాకిపోయింది. రాజకీయమే పెట్టుబడిగా మారినప్పు డు అవినీతి మాత్రమే లాభాలు తెచ్చిపెడుతుంది. నిజాయతీగా వుండేవాడు ఎందుకూ కొరగా కుండా పోయే రోజులివి! కానీ నిజాయతీగా వ్యవహరించే అధికార్లు ‘నిప్పు’లాగా ఎప్పుడూ వెలుగుతూనే వుంటారు. వారికి సమాజంలో వుండే గౌరవం, అవినీతి అధికార్లకు వుండదు. డబ్బు విలాసవంతమైన జీవితాన్నిస్తుంది కానీ, నైతికతతో కూడిన ప్రశాంతతను మాత్రం ఇవ్వదు! అవినీతిలో మునిగిన వారి జీవితం ‘మీటరు’ సక్రమంగా పనిచేయని ఆటో ప్రయాణం వంటిది. వేగంగా పెరుగుతూ, ఒక్కసారిగా పడిపోతుంది! ఇక లేవడం కష్టం!