Maize Purchase Center Stalled in Narsampet
ప్రారంభానికే పరిమితమైన మొక్కజొన్నలు కొనుగోలు కేంద్రం
ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డికి మచ్చ తెచ్చే విధంగా పిఎసిఎస్ నిర్వాకం.
గోదాములు ఓపెన్ చేయడం లేదంటూ సాకు చెపుతున్న సొసైటీ సిబ్బంది
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు.
నర్సంపేట,నేటిధాత్రి:
మొక్కజొన్న రైతులకు ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం కొనుగోలు కేంద్రం వద్ద చెల్లించేందుకుగాను మార్క్ పెడ్ ద్వారా నర్సంపేట వ్యవసాయ ప్రాథమిక సొసైటీ ఆధ్వర్యంలో మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో గత నెల 22న నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రారంభించగా అది నేటికీ ఆచరణకు నోచుకోలేదు. రైతులు మొక్కజొన్న కోసిన నాటి నుండి అకాల వర్షాలుతో అష్ట కష్టాలు పడుతూ వానకు తడుస్తూ ఎండకు ఎండుతూ.. మొక్కజొన్నలను ఎండబెట్టగా ఆ రైతు కుటుంబాలు మార్కెట్ యార్డు వద్ద ఎప్పుడు మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారో అని గత 20 రోజులుగా పడిగాపులు కాస్తున్నారు. మొక్కజొన్నల కొనుగోళ్ల విషయంపై కొనుగోలు కేంద్ర నిర్వాహకులైన నర్సంపేట సొసైటీ సిబ్బందిని మొక్కజొన్నల కొనుగోలు అనంతరం వాటిని నిలువ పెట్టేందుకు గోదాములు తెరవడం లేదంటూ చుక్కలు చూపిస్తున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. మార్కెట్ ద్వారా మొక్కజొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన సందర్భంగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అక్కడే మొక్కజొన్నలను ఆరబోసి అమ్మకానికి సిద్ధంగా ఉంచిన మహిళా రైతుతో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభం
చేయించారు.ఐతే ప్రారంభం చేయించేటప్పుడు మహిళా రైతుతో మొక్కజొన్నలను గోనే సంచుల్లో నింపి కాంటా పెట్టినట్లుగా సంబంధిత కొనుగోలు కేంద్ర నిర్వాహకులు ఫోటోలు దింపించుకొని పలు పత్రికలలో ,సోషల్ మీడియాలో ప్రచురణ చేసుకున్నారు. కానీ ప్రారంభం చేసి పది రోజులైనా ఆ మహిళా రైతు బాణోతు శాంత అనే కుటుంబం యొక్క మొక్కజొన్నలను కొనుగోలు కేంద్రం నిర్వాహకులు కొనుగోలు చేయకపోవడంతో తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించి మొక్కజొన్నలు అమ్ముకోవడం గమనార్హం.గత 20 రోజుల క్రితం నుండి నర్సంపేట వ్యవసాయ మార్కెట్ లో మొక్కజొన్నలు ఎండబెట్టుకున్నాం.వ్యవసాయ సహకారం సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ మార్క్ పేడ్ సహకారంతో మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రారంభం చేయడంతో మాకు మంచి మద్దతు ధర వస్తుందని ఆశపడ్డాము.కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభం అయినప్పడినుండి

సొసైటి వాళ్ళను అడుగుతున్నాము.మొక్కజొన్నలు కొన్న తర్వాత వాటి స్టాక్ ( నిల్వ) చేయడానికి గోదాములు ఇవ్వడం లేదని అందుకు కొనుగోలు చేయడం లేదని నర్సంపేట సొసైటి సీఈఓ రాజు తెలిపారని దుగ్గొండి మండలం రేకంపెల్లి గ్రామానికి చెందిన గాదం లలిత అనే మహిళా రైతు ఆరోపించారు. ఏది ఏమైనప్పటికీ నర్సంపేట నియోజకవర్గ రైతుల శ్రేయస్సు కోరే ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రారంభించిన మొక్కజొన్నల కొనుగోలు కేంద్రం అక్కడికే పరిమితం కావడం ఎమ్మెల్యేకు తీరనిమచ్చ అని పలువురు రైతులు కొనుగోలు కేంద్రం నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
