మురికినీరు..మంచి నీరు వేరు చేస్తుండు.
తాలును జల్లెడ పడుతుండు.
బియ్యంలో మెరిగెలు ఏరేస్తుండు!
ఎగిరిపోయే చిలకలేవని లెక్కేస్తుండు.
గోడమీద పిల్లులకు గంటలు కట్టిండు.
కాంగ్రెస్ లో చేరి కుడితిలో పడ్డ ఎలుకలను చూస్తుండు.
అవకాశవాదులకు రాజకీయం లేకుండా చేస్తుండు.
కారుకు కొత్త రూపును తెస్తుండు.
పనిచేసే వారెవరు…పారిపోయేవారెవరో తేలుస్తుండు.
అవకాశవాదులను దోషులుగా నిలుపుతుండు.
రాజనీతికి కొత్త భాష్యం చెబుతుండు.
అదీ కేసిఆర్ రాజకీయ చాణక్యం.
ఏ పార్టీకి అర్థం కాని రణతంత్రం.
ఎంత మంచినీటిలోనైనా చుక్కమురికి నీరు చేరితే మొత్తం చెడిపోతుంది. ఎంత మంచి తేనేలోనైనా ఒక్క చుక్కనీటి చుక్కకలిపితే పాడైపోతుంది. సరిగ్గా బిఆర్‌ఎస్‌లో ఇదే జరిగింది. నీటిలో మురికినీరు చేసినా శుద్ది చేసే అవకాశం వుంటుంది. కాని తేనెను బాగు చేయలేం. తిరిగి తేనెను ఉపయోగించలేం. ఇప్పుడు సరిగ్గా బిఆర్‌ఎస్ అదే స్దితిలో వుంది. అందుకే పాచి నీరును వేరు చేయాలి. ప్రతి ఇంట్లో వాటర్ ప్యూరిఫయర్ ఏర్పాటు చేసుకున్నట్లే బిఆర్‌ఎస్ అధినేత కేసిఆర్ కూడా పార్టీని శుభ్రం చేస్తున్నారు. మలినమైన, మకిలమైన నాయకులను దూరం పెడుతున్నారు. నిజానికి గేట్లు ఎత్తేశామని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంది కాని, అసలు గేట్లు ఎత్తింది కేసిఆర్. పట్టి పట్టి లింగం కడితే భక్తుడు కాలేదు. నమ్మకం లేని వారిని ఎంత పట్టి వుంచినా బుద్ది మార్చుకోలేరు. వారికి కనీసం పశ్చాత్తాపం వుండదు. అందుకే కేసిఆర్ గత ఎన్నికల్లో చేసిన త్యాగం విలువ ఎవరూ గుర్తించలేకపోయారు. కేసిఆర్ నాయకులను ఎంతనమ్మారో వారికి ఇప్పుడు అర్ధం కాదు. ఓవైపు కాంగ్రెస్, మరో వైపు బిజేపి చేస్తున్న ప్రచారం ప్రజలతోపాటు బిఆర్‌ఎస్ నేతలు నమ్మారు. పార్టీని అలాంటి వాళ్లే నిండా ముంచారు. కేసిఆర్ ప్రజల్లోకి రాడు. ప్రజలను కలవడు. నాయకుల అప్పాయింటు మెంటు ఇవ్వడు. వారితో మాట్లాడడు. కనీసం వారికి విలువ ఇవ్వడు..అని ఎంత మంది ఎన్ని రకాలుగా ప్రచారం చేసినా కేసిఆర్ ఎప్పుడూ స్పందించలేదు. కారణం ఆయన తన పనితోనే పదేళ్లు సమాధానం చెప్పాడు. ఏ నాయకుడికి ఏం కావాలో, ఏ నియోకవర్గానికి ఏం చేయాలో అంతా చేశాడు.
చాలా మందికి గుర్తులేని అంశమేమిటంటే నాయకులు ఎవరూ హైదరాబాద్‌లో వుండకూడదు. నియోజకవర్గంలోనే వుండాలి. ప్రజలకు అందుబాటులో వుండాలి. అభివృద్దిలో భాగస్వామ్యం కావాలి. అదీ ప్రజాస్వామ్య సూర్తి. అంతే కాని నిత్యం నాయకులు సిఎంను కలుస్తూ, వారితో సంభాషణలు చేస్తూ, ప్రజలిచ్చిన విలువైన సమయాన్ని వృధా చేస్తూ కాలయాపన చేయడం చేయడం కేసిఆర్‌కు ఇష్టం వుండదు. అంతే తప్ప నాయకులను కలవకుండా రాజకీయాలు సాగుతాయా? ఈ మాత్రం చిన్న విషయాన్ని నాయకులు మిస్సయ్యారు. అందుకే చాలా మంది ఎమ్మెల్యేలు ప్రజలకు దూరమయ్యారు. ఎమ్మెల్యేలు , నాయకులతో నిత్యం కూర్చుని, ప్రగతిని పక్కనపెట్టి, సంక్షేమాన్ని దూరం పెట్టి కాలం గడిపేందుకేనా తెలంగాణ తెచ్చుకున్నది. నాయకులతో, జనసంచారంతో వివాదాలకు కేంద్రంగా మారితే అది గాంధీభవన్ అవుతుందేగాని, ప్రగతి భవన్ ఎలా అవుతుంది? ఇదే బిఆర్‌ఎస్ నాయకులు చాలా మంది గుర్తించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు చూస్తున్నారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ప్రతి సారి పాలకులు డిల్లీ వెళ్లాలి. అక్కడనుంచి అనుమతి రావాలి. వారు చెప్పిందే చేయాలి. వారి అనుమతితోనే ప్రభుత్వం నడవాలి. ఇలాంటివి కోరుకునేవారు ప్రజలకు మేలు చేయలేరు. రాజకీయాలకు న్యాయం చేయలేరు. పత్రికలకు రాసుకోవడానికి వార్తలు మాత్రమే వుంటాయి. ఏ నాయకుడు ఏం మాట్లాడుతున్నాడు. ఏ నాయకుడు ఏం సమావేశమేర్పాటు చేస్తున్నాడు..ఈ వార్తలే కనిపిస్తాయి. కాని పదేళ్ల కేసిఆర్ పాలన ఏనాడు అలాంటి వార్తలు వినిపించలేదు. ప్రతి రోజు నీళ్ల గురించి చర్చ జరిగింది. ప్రతి రోజూ రైతు సంక్షేమం ఆలోచన సాగింది. ప్రతి క్షణం పేద వర్గాల అభ్యున్నతి కోసం ప్రయత్నం జరిగింది. అందులో భాగంగానే మిషన్ కాకతీయ వచ్చింది.
తెలంగాణలోని 46 వేల చెరువులకు మళ్లీ కలొచ్చింది. వాటిలోకి నీళ్లొచ్చాయి. తెలంగాణ వ్యాప్తంగా కాలువలొచ్చాయి. అసలు చెరువులు ఎలా నిండాయో కూడా తెలియని కాంగ్రెస్ వాళ్లకు సమాధానం చెప్పలేని నాయకులు, బిఆర్‌ఎస్‌లో కొనసాగుతున్నారంటే ఆశ్చర్యంగా వుంది. చెరువులు ఎలా నిండాయో కళ్లారా చూసిన నాయకులే వాటి గురించి చెప్పుకోలేకపోతే, ప్రజలకేం పనిచేస్తారు. పార్టీకేం ఉపయగపడతారు. అలాంటి వారికి పదవులు తప్ప, ప్రజాక్షేమం పట్టదు. మిషన్ భగీరధ అంటే ఏమిటి? ప్రతి ఇంటికి నీళ్లెక్కడి నుంచి వస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఒట్టిపోయిన బావులు ఎలా నిండాయి. ఎండిపోయిన బోర్లు ఎలా పొలాలకు నీళ్లందించాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడు వస్తుందో..ఎప్పుడు పోతుందో…ఇళ్లలో ఎప్పుడూ వుండని కరంటు కేసిఆర్ పాలనతో రెప్పపాటు పోకుండా వుందో ఎవరికీ పట్టలేదు. కాళేశ్వరం వంటి ప్రాజెక్టు వచ్చింది. తెలంగాణ సాగు విస్తీర్ణం పెంచింది. పుట్లకొద్ది ధాన్యపు రాశులు ఎలా వచ్చాయి. ఎప్పుడో చెరువులు నిండితే కనిపించే చేపలు తెలంగాణ నుంచి ఎగుమతి ఎలా అవుతున్నాయన్నది ఏ నాయకుడైనా అధ్యయనం చేశాడా? చేస్తే బిఆర్‌ఎస్‌ను వదిలి వెళ్లేవారు కాదు. ప్రగతిని కాంక్షించలేని నాయకులను కూడా కడుపులో పెట్టుకున్న కేసిఆర్‌ను కూడా వదిలేసుకునేందుకు సిద్దపడ్డవారినికాపాడుకోవాల్సిన అవసరం లేదు. అందుకే కేసిఆరే గెట్లెత్తారు. దాంతో గోడమీద పిల్లులు దూకేస్తున్నాయి.
ఒక్క మాటలో చెప్పాలంటే కేసిఆర్ నాయకులను జల్లెడ పడుతున్నాడు. ఎవరు మన నాయకుడు, ఎవరు కాదన్నది తేల్చేస్తున్నాడు. బియ్యంలో మెరిగలు ఏరేసినట్లు ఏరేస్తున్నాడు. కాని వాళ్లు మాత్రం మేమే వెళ్లిపోతున్నామనుకుంటున్నారు. అలా వెళ్లిపోతున్నవారిలో ఇంత కాలం పదవులు అనుభవించినవాళ్లు, ఎంతో కొంత పార్టీ గుర్తించిన వాళ్లే వున్నారు. నిజానికి పార్టీ కోసం ఎంతో చేసినా, కేసిఆర్‌ను నమ్ముకొని వున్నవారు కండువా మార్చుకోవాలన్న ఆలోచన కూడా చేయడంలేదు. ఏ ముహూర్తానా గులాబీ కండువా భుజాన వేసుకున్నారో..ఆఖరు దాకా దాన్నే మోస్తామనుకునేవారు కూడా బిఆర్‌ఎస్‌లో చాలా మంది వున్నారు. వారు చాలు. కొత్త రక్తం ఎక్కిస్తే చాలు. పాత నీరంతా పోతుంది. పాచి నంతా తొలగించే పని మొదలైంది. మన వాళ్లెవరో, కాని వాళ్లెవరో తేల్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది.
ఎందుకంటే కాంగ్రెస్ విషయంలో ఒక మాట చెప్పుకోవాలి. గత పదేళ్ల కాలంలో కూడా అవకాశవాదులే కారెక్కారు. కాని పదేళ్లుగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అసలు సిసలు కాంగ్రెస్ వాదులు ఆ పార్టీలోనే వున్నారు. ఇప్పుడు కూడా బిఆర్‌ఎస్‌లోఎంత మంది కరుడుగట్టిన గులాబీ దళం వుందో తేల్చుకోవాల్సిన తరుణం ఏర్పడిరది. ప్రతిపక్షంలో వున్నప్పుడు కొట్లాడేవారు కావాలే గాని, పదవుల కోసం ఆశపడేవారు ఎంత కాలమున్నా, ద్రోహులే అవుతారు. కోవర్టుల అవతారమే ఎత్తుతారు. సమయం చూసి కండువా మార్చేస్తారు. పార్టీ ప్రణాళికలు అమ్ముకుంటారు. పార్టీవేసేఎత్తులను అవతలివారికి లీక్ చేస్తుంటారు. అందుకే వెళ్లిపోయేవారిని ఎక్కడా ఆపాలని చూడడం లేదు. కాకపోతే ఇంత కాలం నమ్మకస్తులుగా వున్నవారిలో ఒకరిద్దరిని ఆపే ప్రయత్నం చేసినా, నీతి మాలిన వాళ్లు వెళ్లిపోయారు. అందుకే కేసిఆర్ ఇకపై ఎవరినీ ఆపేందుకు సిద్దంగా లేరు. వుండేవాళ్లే మన వాళ్లు. వెళ్లేవాళ్లు పరాయి వాళ్లు..అని గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. అంతే..అదేంతే…
దీనిని అర్ధం చేసుకోలేని వాళ్లు ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. బిఆర్‌ఎస్ ఖాళీ అవుతుందనే వార్తలు నమ్మేవారు కూడా నాయకులు కావడం వారి దౌర్భాగ్యం. పార్టీపై ఈగ కూడా వాలకుండా చూసుకోవాల్సిన వాళ్లు, తామే ఈగలై వెళ్లిపోతామంటే ఆపాల్సిన అవసరం కేసిఆర్ కులేదు. పైగా వెళ్లిపోయేవారంతా భయపడి వెళ్లిపోతున్నారు. అంటే తాము తప్పు చేశామని ఒప్పుకుంటున్నారు. తప్పుడు నేతలు బిఆర్‌ఎస్‌లో వుండాల్సిన అవసరం లేదు. గుమ్మడి కాయల దొంగలు అంటే భుజాలు తడుముకునేవారు బిఆర్‌ఎస్‌లో వుండి కూడా ఉద్దరించేదేమీ లేదు. రాజకీయ పార్టీ అన్న తర్వాత కొట్లాడే వాడే పార్టీకి సైనికుడౌతాడు. భయపడేవాడు పారిపోతాడు లేకుంటే, శత్రు పక్షం చేరి, చీడపురుగౌతాడు. పార్టీని పట్టిన చెదపురుగౌతాడు. అందుకు చెక్కకు పెట్టిన చెదకు మందే సరైన వైద్యం. పార్టీ నుంచి వెళ్లిపోయే అవకాశవాదులకు గేట్లు తెరవడమే అసలైన రాజకీయం. కేసిఆర్‌ను మించిన రాజకీయం ఎవరూ చేయలేరు. ఇంకా వందేళ్లయినా కేసిఆర్ రణతంత్రం పసిగట్టలేరు. బిఆర్‌ఎస్ ఓటమికి కారణం…నాయకత్వ లోపం కాదు…పార్టీని భ్రష్టుపట్టించిన స్వార్ధపరుల పాపం. అందుకే పాపాత్ములు పోవాల్సిందే. పాచినీరు మురికి కాలువలోకి వదలాల్సిందే…కొత్తనీరు తెచ్చుకోవాల్సిందే… యువతరం నీడలో బిఆర్‌ఎస్ గులాబీ మళ్లీ రెపరెపలాడాల్సిందే. పల్లెలన్నీ గులాబీ మయం కావాల్సిందే…కేసిఆర్ నాయకత్వంలో స్వర్ణయుగం చూడాల్సిందే..