Consumers Must Know Their Rights and Responsibilities: CCI
వినియోగదారులు హక్కులు,బాధ్యతలు గుర్తించాలి
#నెక్కొండ, నేటి ధాత్రి:
ప్రస్తుత డిజిటల్ మార్కెటింగ్ శకంలో వినియోగదారులు తమకు చట్ట ప్రకారంగా సంక్రమించిన హక్కులపై అవగాహన పెంచుకొని బాధ్యతలను గుర్తించి ముందుకు సాగాలని కన్జ్యూమర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా( సిసిఐ) రాష్ట్ర ఉపాధ్యక్షులు,విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ బూర్గుపల్లి శ్రవణ్ కుమార్ శాస్త్రి అన్నారు. జాతీయ వినియోగదారుల వారోత్సవాలను పురస్కరించుకొని నెక్కొండ మండలంలో సోమవారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు మండల స్థాయిలో వ్యాసరచన పోటీలను నిర్వహించారు. నెక్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు అనుముల శ్రీదేవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. ఉత్పత్తి, సేవలలో వస్తున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు వినియోగదారులకు పటిష్టమైన రక్షణ చర్యలను తీసుకొచ్చేందుకు వినియోగదారుల రక్షణ చట్టం 2019లో అనేక మార్పులు తెచ్చారన్నారు. 1986లో తీసుకువచ్చిన వినియోగదారుల రక్షణ చట్టంలో ఆరు హక్కులతో పాటు న్యాయవివాదాలపై కొన్ని పరిమితులు ఉన్నాయని, వాటిని గుర్తించి ఈ చట్టానికి మరింత పదును పెడుతూ కేవలం ఉత్పత్తిదారులు, అమ్మకందారులే కాకుండా ప్రజలను ఆకట్టుకునేందుకు మభ్య పెట్టే మోసపూరిత ప్రకటనలు ఇచ్చే సెలబ్రిటీలు మొదలుకొని తమ ఉత్పత్తులకు ప్రచారం చేసే ప్రతి ఒక్కరు చట్ట పరిధిలో బాధ్యులవుతారన్నారు. ఇప్పుడు ఆన్లైన్లో మార్కెటింగ్ లావాదేవీలు విస్తృతంగా సాగుతున్నాయని, ఈ లావాదేవీలన్నింటిని చట్టపరిధిలోకి తెచ్చారన్నారు. వినియోగదారుల కోర్టుల పరిధితో సంబంధం లేకుండా డిజిటల్ విధానంలో ఫిర్యాదుల నమోదు, న్యాయ విచారణ, జరిమానా చెల్లింపుల ప్రక్రియకు శ్రీకారం చుట్టిందన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వినియోగదారులను చైతన్య పరచాల్సిన అవసరం అధికార యంత్రాంగంపై వినియోగదారుల సంఘాలపై ఉందని నొక్కి చెప్పారు. పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులలో వినియోగ విద్య పట్ల అవగాహన పెంచేందుకు వినియోగదారుల సమాచార కేంద్రాలు ప్రయత్నిస్తుండడం శుభసూచకం అన్నారు. ప్రధానోపాధ్యాయులు శ్రీదేవి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల నిర్వహణ ద్వారా విద్యార్థులలో వినియోగ విద్య పట్ల మరింత అవగాహన పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో వివిధ పాఠశాలల నుండి ఎంపికైన విద్యార్థులు గైడ్ టీచర్ వినయ్ కుమార్, సి ఆర్ పి లు శ్రీనివాస చారి, సుమలత, తదితరులు పాల్గొన్నారు.
