కార్యకర్తపై జరిగిన దాడికి కాంగ్రెస్ బాధ్యత తీసుకోవాలి
హైదరాబాద్ రహమత్ నగర్‌లో బీఆర్ఎస్ కార్యకర్త రాకేష్‌ను మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో జరిగిన సంఘటనల నేపథ్యంలో రహమత్ నగర్‌లో గాయపడిన బీఆర్ఎస్ కార్యకర్త రాకేష్‌ను మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. అనంతరం కార్యకర్తపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు వచ్చి 24 గంటలు గడవకముందే కాంగ్రెస్ గూండాయిజానికి పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాము పదేళ్లు అధికారంలో ఉన్నామని, ఎన్నో ఉప ఎన్నికల్లో గెలిచామని కానీ, ఎప్పుడు కాంగ్రెస్ సభ్యులపై తాము దాడులు చేయలేదని అన్నారు. కాంగ్రెస్ చేస్తున్న రౌడీయిజాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. బీఅర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, తమ కార్యకర్తపై జరిగిన దాడికి కాంగ్రెస్ బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. దొంగ ఓట్లు, గూండాగిరి, డబ్బులు పంచడం వల్లే కాంగ్రెస్ గెలిచిందని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు.తాను అహంకారం తగ్గించుకోవాలన్న రేవంత్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఎవరిదీ అహంకారమో ప్రజలే గమనిస్తున్నారన్నారు. ఒకే ఒక్క ఎన్నికలో గెలిచిన ఆనందంలో నిన్న ఊరేగింపు చేశారని, తాము ఎన్నో ఎన్నికలు గెలిచినా పార్టీ గుర్తును గాడిదపై పెట్టి ఊరేగింపులు చేయలేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ గూండాయిజం ఆపకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని కేటీఆర్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం స్థానిక నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.
