https://epaper.netidhatri.com/
`కొత్త జిల్లాల కుదింపైనా, కత్తిరింపైనా కయ్యమే!
`కుదింపు పేరుతో ప్రభుత్వం కత్తిరింపు కుయుక్తులు.
`అశాస్త్రీయత పేరుతో పేను గొరుగుడు పనే..
`మా జిల్లా వద్దన్నవారెవరైనా వున్నారా?
`కుదించమని సూచించారా?
`ప్రజలనుంచి వచ్చిన డిమాండ్లే కొత్త జిల్లాలు!
`జిల్లాల కుదింపు అసాధ్యం.
`కొట్లాడి సాధించుకున్న జిల్లాల కోత కుదరదు.
`సిరిసిల్లకు జెల్లకొడతారా?
`ములుగును ముంచగలరా?
`పాలమూరు పార్టులు పేర్చుతారా?
`ఖమ్మం జిల్లా క్రోడీకరిస్తారా?
`మళ్ళీ ఉద్యమాలు ఎగదోయాలని చూస్తున్నారా?
`చల్లగా వున్న తెలంగాణలో రాజకీయ వేడితో చలికాచుకుంటారా?
హైదరబాద్,నేటిధాత్రి:
ఒక ప్రశ్నకు వంద సమాధానాలు ఫరవాలేదు. అంతేకాదు వంద ప్రశ్నలకు కూడా ఒకే సమాదానం వుండేలా కూడా చూసుకోవాలి. వైద్య పరిభాషలో సర్వ రోగ నివారణిలా వుండాలి. ఎందుకంటే అదే పరిపాలనలో మరింత పారదర్శకతను ఆవిష్కరిస్తుంది. సమాధానాలు వెతుక్కునేంత పని ప్రజలకు లేకుండా చేస్తుంది. అందుకే పరిపాలనలో కొనసాగింపుండాలే కాని, కుదుపులు, కుదింపులు వుండకూడదు. కత్తిరింపులు కొన్ని విషయాలలో అసలే వుండకూడదు. జనం కావాలని కోరుకున్నవాటిని ముట్టుకోవడం అంటే మళ్లీ సమస్యను మొదటికి తెచ్చినట్లే. నిజంగానే ఏ పాలకులైనా చిన్న చిన్న తప్పిదాలు చేయొచ్చు. వ్యవస్ధీకృతంగా జరగొచ్చు. అలాంటప్పుడు వ్యవస్ధనే రూపు రేఖలు మార్చాలనుకుంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదం కూడా వుంటుంది. ఆపరేషన్ చేసిన ఆరోగ్యం కుదుటపడేయాల్సిన చోట, అవయవమే తీసేస్తా? అంటే అది వైద్యమనిపించుకోదు. అలాగే పాలకులు తీసుకునే నిర్ణయాలు జనామోదం పొందేలా వుండాలి. జిల్లాల విషయంలో కొత్త ప్రభుత్వం వేలు పెట్టడం అంటే తేనెతుట్టెను కదిలించడమే. ఇది ఎవరికీ మంచిది కాదు. ప్రభుత్వాలు సహజంగా ప్రజా వ్యతిరేక చర్యలు చేపట్టాలని ఎప్పుడూ అనుకోవు. ప్రజల ఆలోచనల నుంచే పాలకులు కొన్ని ప్రయత్నాలు మొదలుపెడతారు. అది కొన్ని సార్లు చిన్నచిన్న పొరపాట్లు జరగొచ్చు. అంత మాత్రాన ప్రయత్నమే తప్పని అనుకోకూడదు. ఇప్పుడు అదే జరుగుతోంది. పరిపాలనా సౌలభ్యం కోసం గత ప్రభుత్వం తెలంగాణలోని పది జిల్లాలను 33 జిల్లాలగా విభజించింది. అధికార యంత్రాంగాన్ని కూడా అందుకు అనుగుణంగా మార్చివేసింది. ఏ అధికారి ఎలా పని చేయాలి. ఎంత వరకు పనిచేయాలి. ఎన్ని ఇన్‌చార్జిలుగా తన పనిని విభజించుకోవాలన్నదానిపై అధికారులకు కూడా ఓ స్పష్టత వచ్చింది. అలాంటి దాన్ని మరోసారి సరిచేయాలనుకోవడం తప్పు కాదు. కాని శాస్త్రీయత పేరుతో మళ్లీ కొంత గందరగోళం సృష్టిండం మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్దితి రావొచ్చు. ఎందుకంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల ప్రజలు కాంగ్రెస్ వైపు నిలిచి గెలిపించారు. ఇప్పుడు అదే గ్రామీణ ప్రాంతాలలో మరోసారి ఆత్మగౌరవం అన్నది నిద్రలేపే ప్రయత్నం చేయొద్దు. గత ప్రభుత్వం చేపట్టిన జిల్లాల విభజన శాస్త్రీయంగా జరగలేదన్నది కొంత వరకు వున్న మాటే అయినా పాలనా పరంగా చాలా దూరం వెళ్లింది. ఇప్పుడు మళ్లీ మానిన గాయాన్ని రేపడం వల్ల ఎవరికీ మేలు జరగకపోవచ్చు. ప్రభుత్వం వేసిన కమీషన్ అవే జిల్లాలను సమర్ధిస్తే ప్రభుత్వం పరువు పోతుంది. కొన్ని మార్పులు కోరితే, వాటి అమలుకు ప్రభుత్వం పూనుకుంటే వ్యతిరేకత వస్తుంది. ఎలా చూసినా ప్రభుత్వానికి ఇబ్బందికరమే…కమీషన్ వేశాక ఏదో ఒకటి చేయకపోతే ప్రభుత్వం చేతగాని తనం కూడా అవుతుంది. కాకపోతే చిన్న, చిన్న సమస్యల కోసం తేనెతుట్టెను కదిలించడం అన్నది సరైంది కాకపోవచ్చు.
జిల్లాల పునర్వవ్యవస్ధీకరించేందుకు ప్రత్యేకంగా ఓ కమీషన్ ఏర్పాటు చేస్తామని ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ప్రకటన చేయడం జరిగింది.
ఈ కమీషన్ జిల్లాల విభజనపై సమగ్రమైన అధ్యయనం చేసి, ప్రభుత్వానికి ఒక రిపోర్టు ఇస్తుంది. ఇంత వరకు బాగానే వుంది. కాని కమీషన్ తన అధ్యయనం తర్వాత దాన్ని ప్రజల ముందు వుంచి, మళ్లీ ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతుందని చెప్పడమే అసంబద్ధం. ఎందుకంటే ముందు ఎక్కడైనా ప్రజాభిప్రాయ సేకరణ చేపడతారు. అది ముందు జరగాల్సిన విషయం. ప్రజాభిప్రాయంలో వెల్లడైన అంశాలతో కమీషన్ ఒక అధ్యయనం చేసి, ఒక కూర్పు చేస్తే దానికి శాస్త్రీయత వుంటుంది. కమీషన్ ఒక రిపోర్టు ఇచ్చిన తర్వాత అది ప్రభుత్వం భహిర్గతం చేయకుండా దాచినా సరైంది కాదు. ఒక వేళ బైటపెట్టి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టినా ప్రజలు అంగీకరించే పరిస్థితి వుండదు. గతంలో అనేక కమీషన్లు చూశాం. కాని ఏదీ అమలు చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు కూడా అదే జరుతుంది. ఒక వేళ ప్రభుత్వం పూర్తి స్దాయిలో దృష్టిపెట్టి కమీషన్ పని త్వరగా పూర్తి చేసి రిపోర్టు ఇచ్చినా, రాజకీయ కోణంలో ప్రభుత్వం వెనకడుగు వేయొచ్చు. దాంతో పుణ్య కాలం పూర్తి కావొచ్చు. ప్రభుత్వం అబాసు పాలు కావొచ్చు. జిల్లాల విభజన సమయంలో కొన్ని ఉద్యమాలు తీవ్రంగా సాగిన సందర్భాలు చూశాం. జనగామ ప్రాంతం గతంలో నిజాం హయాంలో నల్లగొండ జిల్లాలో వుండేది.
ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వరంగల్ జిల్లాలోకి వెళ్లిపోయింది.
అప్పటి నుంచి జనగామకు వరంగల్‌తో అనుబంధం పెరిగింది. జిల్లాల విభజన సమయంల జనగామను హన్మకొండ జిల్లాలో అలాగే వుంచినా బాగుండేది. కాని గత ప్రభుత్వం తొలుత యాదాద్రి, భువనగరి జిల్లాలో కలిపింది. దాంతో జనగామలో పెద్దఎత్తున ఉద్యమం సాగింది. నిజానికి కేసిఆర్ ప్రభుత్వం అశాస్త్రీయతను ప్రదర్శించింది. అయితే జనగామ ప్రాంతం భువనగిరి పార్లమెంటు పరిధిలోకి వెళ్లింది. దాన్ని దృష్టిలో వుంచుకొని గత ప్రభుత్వం జనగామను యాదాద్రిలో కలిపారు. కాని పోరుగడ్డ జనగామ అందుకు అంగీకరించలేదు. తెలంగాణ ఉద్యమం జరిగినంత కాలం 144 సెక్షన్ అమలులో వున్న జనగామలో, తెలంగాణ వచ్చాక కూడా అదే సెక్షన్ అమలులో వుంది. అయినా ప్రజలు వెనక్కి తగ్గలేదు. తెలంగాణ కోసం ఎంత ఉద్యమం చేశారో…జిల్లా కోసం కూడా అంతే ఉద్యమం చేశారు. తెలంగాణలో ఆసిఫాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, వనపర్తి, ములుగు, జనగామలు చిన్న జిల్లాలుగా గుర్తించారు. మరి జనగామను ప్రభుత్వం ముట్టుకునే ప్రయత్నం చేస్తే మళ్లీ ఉద్యమం మొదలౌతుంది. తెలంగాణలో జరిగిన ఈ అశాస్త్రీయతను చూసిన తర్వాతే ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన జిల్లాల విభజన పార్లమెంటు స్ధానాలను దృ ష్టిలో పెట్టుకొని చేశారు. అయితే 2026లో మళ్లీ దేశ వ్యాప్తంగా పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల డీ లిమిటేషన్ వుంది. అప్పుడు మారితే ఏం జరుగుతుందన్నది అక్కడ కూడా ఆగమ్య గోచరమే అవుతుంది. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంటు నియోజకవార్గల వారిగా జిల్లాల విభజన చేపడితే, డీలిమిటేషన్ సమస్య మళ్లీ ముందుంది. దాంతో సమస్య మళ్లీ మొదటికి రావొచ్చు.
ఇదంతా లేనిపోని పితలాటమమే తప్ప ప్రయోజనం వుండదు.
ఎందుకంటే ములుగు జిల్లా కోసం ప్రస్తుత మంత్రి సీతక్క ఎంతో కాలం పోరాటం చేసి సాదించుకున్నారు. ఇప్పుడు ఆమె మంత్రి వర్గంలో వున్నారు. ప్రభుత్వం ఒక వేళ మంత్రి వర్గంలో ములుగు జిల్లాలను తొలగించాన్న దానిపై చర్చ వస్తే ఏం చేస్తారు? ఒక వేళ ఆమె జిల్లారద్దుకు అంగీకరించకపోతే ప్రభుత్వానికి తలనొప్పి. ఒక వేళ ఒప్పుకుంటే జిల్లా సాధన కోసం రాజకీయ ప్రయోజనం కోసమే ఉద్యమం చేసిందన్న అపవాదు మూట గట్టుకుంటుంది. అంతే కాకుండా జిల్లా ఏర్పాటు కావడం వల్లనే ములుగులో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయడం జిరిగింది. ఆ పనులు కూడా పూర్తి దశలో వున్నాయి. ఒక వేళ ములుగు జిల్లా రద్దు అంటే ముందు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయాల్సిన పరిస్ధితి అక్కడే మొదలు కావొచ్చు. అందుకే పరిపాలన సాఫీగా సాగే పనులకు పూనుకుంటేనే ఎంతైనా మంచిది.