కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు
నేతృత్వంలో పురుమళ్ల శ్రీనివాస్‌పై పీసీసీ అధ్యక్షునికి-కాంగ్రెస్ ముఖ్యనేతల ఫిర్యాదు
పెద్ద సంఖ్యలో హైదరాబాద్ తరలివెళ్లిన కాంగ్రెస్ నాయకులు
కరీంనగర్ నేటిధాత్రి:
పీసీసీ అధ్యక్షునితో గాంధీభవన్‌లో భేటి, శ్రీనివాస్ వ్యవహారంపై సుదీర్ఘంగా చర్చ గత నెల 28 వతేదీ నాటి ఘటనపై నివేదిక తెప్పించుకొని శ్రీనివాస్‌పై
చర్యలు తీసుకుంటామని నేతలకు పీసీసీ అధ్యక్షుని హామీ. సానుకూలంగా స్పందించిన మహేశ్‌కుమార్ గౌడ్. గత నెల 28వ తేదీన కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా నిర్వహించిన సన్నాహాక సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌పై కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి పురుమళ్ల శ్రీనివాస్ పరోక్షంగా దూషణలకు దిగిన అంశంపై ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, పార్టీ పరిశీలకులు, ముఖ్యనేతల నుంచి నివేదిక తెప్పించుకొని తగిన చర్యలు తీసుకుంటామని పీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలకు హామీ ఇచ్చారు. పార్టీ పరువు తీసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. పార్టీ పరువు బజారుకు ఈడ్చే వారిపై, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ, బీజేపీ, బీఆర్ఎస్తో లోపాయికార ఒప్పందం చేసుకొని మంత్రి పొన్నం ప్రభాకర్‌పై దూషణలకు దిగుతూ, పార్టీ పరువు తీస్తున్న పురుమళ్లను శ్రీనివాస్‌ను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు నేతృత్వంలో కరీంనగర్ జిల్లాకు రెండు వందల మంది కాంగ్రెస్ ముఖ్యనేతలు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ ముఖ్యనేతలు రెండు వందల మంది స్వచ్ఛందంగా మూకుమ్మడిగా సంతకాలు సేకరించి హైదరాబాద్ లోని గాంధీభవన్‌కు తరలివెళ్లారు. వెలిచాల రాజేందర్ రావు అధ్వర్యంలో కాంగ్రెస్ ముఖ్యనేతలు గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్ గౌడ్‌ను కలిశారు. మంత్రి పొన్నంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పురుమళ్ల శ్రీనివాస్‌ను వెంటనే బహిష్కరించాలని, తద్వారా పార్టీని బలోపేతం చేయాలని విన్నవించారు. ఈసందర్భంగా పురుమళ్ల వ్యవహారంపై పీసీసీ అధ్యక్షుడితో సుదీర్ఘంగా చర్చించారు. గత నెల 28వ తేదీన జరిగిన సమావేశంలో పురుమళ్ల మంత్రి పొన్నంపై చేసిన అనుచిత వ్యాఖ్యలు, దూషణలు, మంత్రిపై అక్కసు వెళ్లగక్కుతున్న వైనం, ఆయనతో పార్టీకి జరుగుతున్న నష్టం, తదితర అంశాలను ముఖ్యనేతలు మహేశ్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకొచ్చారు. అన్ని విషయాలను పీసీసీ అధ్యక్షులు ఓపికగా విన్నారు. ఈసందర్భంగా కాంగ్రెస్ నేతలతో పీసీసీ అధ్యక్షులు మాట్లాడారు. పురుమళ్ల వ్యవహారాన్ని పార్టీ నేతల నుంచి తెలుసుకున్నానని, వెలిచాల రాజేందర్ రావు తన దృష్టికి తీసుకొచ్చారని, పూర్తి వివరాలతో నివేదిక తెప్పించుకొని తగిన చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. మీరు ఏలాంటి ఆందోళన చెందవద్దు, పార్టీలో అధిష్టానమే సుప్రీం, వారి ఆదేశాలను పాటించాలని సూచించారు. బహిరంగంగా విమర్శలు చేస్తూ పార్టీ పరువు తీసే వారిని ఉపేక్షించమని, సీనియర్ నేత, మంత్రి పొన్నం ప్రభాకర్‌పై శ్రీనివాస్ వ్యక్తిగతంగా దూషణలకు దిగడం పద్దతి కాదని, ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొచ్చి సానుకూలంగా చర్చించుకుంటే బాగుంటుందని తెలిపారు. ఇలా వ్యవహరించడం బాగా లేదని, శ్రీనివాస్ తీరు సరిగా లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని, మరో వైపు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పీసీసీ అధ్యక్షులు నేతలకు సూచించారు.
పురుమళ్ల పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారు-కాంగ్రెస్ ముఖ్యనేతలు
పురుమళ్ల శ్రీనివాస్ వ్యవహారం రోజు రోజుకు శృతిమించుతున్నదని, బీజేపీ, బీఆర్ఎస్తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని పార్టీలోనే ప్రతిపక్ష నేతలాగా వ్యవహరిస్తున్న తీరు విస్మయం కలుగుతున్నదని పీసీసీ అధ్యక్షుని దృష్టికి కాంగ్రెస్ నేతలు తీసుకొచ్చారు. కరీంనగర్లో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా మారిందని, శ్రీనివాస్ వ్యవహరిస్తున్న తీరుతో పార్టీ పెద్దలే తలలు పట్టుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. గత నెల 28వ తేదీ సోమవారం కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా సన్నాహాక సమావేశం జరిగిందనీ, దీనికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, డీసీసీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ, పార్టీ పరిశీలకులు, ఇతర ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారని వివరించారు. పురుమళ్ల శ్రీనివాస్ కుట్రపూరితంగా అలజడి సృష్టించేందుకు హాజరై మంత్రి పొన్నంపై పరోక్షంగా దుర్భాషలాడారని పేర్కొన్నారు. సమావేశానికి వచ్చిన ఏఐసీసీ కార్యదర్శి, పరిశీలకులు, పార్టీ పెద్దల ముందే పార్టీ లైన్ దాటి తమరిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. దీంతో అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే శ్రీనివాస్‌పై తిరగబడ్డారని తెలిపారు. ఇప్పటికే పార్టీ పెద్దలు ఆయనకు రెండు సార్లు షోకాజ్ నోటీస్ అందించారని, అయినా ఆయనపై ఏలాంటి చర్య మాత్రం తీసుకోలేదనీ, పట్టపగ్గాల్లేకుండా నీచంగా పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారని విన్నవించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్‌కు శ్రీనివాస్ అమ్ముడుపోయారని ఫిర్యాదు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్తో లోపాయికార ఒప్పందం చేసుకొని పార్టీకి నష్టం చేకూరుస్తున్నారని, ఇలాంటి వ్యక్తిని వెంటనే పార్టీ నుంచి తక్షణం సస్పెండ్ చేయాలని కోరారు. లేకపోతే కరీంనగర్లో పార్టీకి భవిష్యత్ ఉండదని పేర్కొన్నారు. ఈసమావేశంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్, పీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ జనద్ రహమాత్ హుస్సేన్, జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ మడుపు మోహన్, తుమ్మనపల్లి శ్రీనివాస రావు, కిసాన్ సెల్ జిల్లా చైర్మన్ పురం రాజేశం, జిల్లా గౌడ్ సంఘ అధ్యక్షులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, తాజా మాజీ కార్పొరేటర్లు, నాయకులు ఆకుల నరసన్న నర్మదా, కోటగిరి భూమా గౌడ్, గంట కళ్యాణి శ్రీనివాస్, మల్లికార్జున రాజేందర్, పడిశెట్టి భూమయ్య, పత్తెమ్ మోహన్, మాచర్ల ప్రసాద్, మాజీ ఎంపీపీ సుధగోని లక్ష్మీనారాయణ గౌడ్, జక్కని ఉమాపతి బొమ్మ ఈశ్వర్ గౌడ్, బోనాల మురళి, గడ్డం శ్రీరాములు, మాచర్ల అంజయ్య గౌడ్, చెప్యాల శ్రీనివాస్ గౌడ్, తాళ్ల పెళ్లి సంపత్ గౌడ్, బత్తిని చంద్రయ్య, అనరాసు కుమార్, కుంబాల రాజ్ కుమార్, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.