కుట్రల కాంగ్రెస్‌!?

https://epaper.netidhatri.com/

`అధికారం కోసం ఎంచుకునేవన్నీ అడ్డదారులే!

`అరాజకీయ దుష్ట పన్నాగాలే?

`అనాదిగా అనుసరిస్తున్న దొంగ దారులే!

`ఎన్నికల సమయంలో నమ్ముకునేవి అల్లర్లే!

`గతంలో వైఎస్‌ పై ఆ పార్టీ నేతలు చేసిన ఆరోపణలే!

`కర్ణాటక డికే అనుసరించే ఫార్ములా ఇదే!

`కర్ణాటక లో తెరలేపి, తెలంగాణ లో ప్రయత్నించి…

`కర్ణాటక లో కాంట్రాక్టర్లను రంగంలోకి దించి..

`నలభై శాతం ప్రచారం చేయించి.

`తెలంగాణ లో కాళేశ్వరం ప్రాజెక్టు పై బురద జల్లి

`తెలంగాణ రైతు దృష్టి మళ్లించే రంగు పులిమి

`కాళేశ్వరం మీద అసత్య ప్రచారం చేయించి,

`అబద్దాల ప్రచారాలనే అస్త్రాలు చేసుకొని..

`తెలంగాణ లో కాంగ్రెస్‌ ను నమ్మే పరిస్థితి కనిపించడం లేదని,

`ఆపసోపాలు పడుతున్న కాంగ్రెస్‌.

హైదరాబాద్‌,నేటిధాత్రి:
కాంగ్రెస్‌ పార్టీ కర్నాటక గెలుపుతో ప్రజల మద్దతు కూడగట్టుకున్నాన్న భ్రమలో వుంది. పైగా కర్నాటకలో చేసిన కుట్ర రాజకీయాలు ఎక్కడైనా చెల్లుతాయన్న పగటి కలలు కంటోంది. కర్నాకటలో కాంగ్రెస్‌ చెప్పిన కట్టుకధలు తేటతెల్లమౌతున్నాయి. కర్నాకట రైతులు ఏకంగా తెలంగాణకు వచ్చిన కాంగ్రెస్‌ మోసాలు ఎండగుడుతున్నారు. కర్నాటక రైతులను నమ్మించి మోసం చేశారని దుమ్మెత్తిపోస్తున్నారు. పెనం మీద వున్న రైతులను పొయ్యిలో పడేశారని కాంగ్రెస్‌ను శాపనార్దాలు పెడుతున్నారు. రైతులను నట్టెట ముంచారు. గెలిపించిన కర్నాటక ప్రజల బాగోగులు, పాలన గాలికొదిలేసి తెలంగాణ ఎన్నికల పేరుతో తాము గొప్ప పనిచేశామంటూ ఇక్కడ అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. కర్నాకటలో గొప్ప పధకాలు అమలు చేస్తున్నామని నమ్మించాలని చూస్తున్నారు. ఒక్క కేసిఆర్‌ ను ఓడిరచేందుకు జాతీయ స్ధాయి నుంచి నేతలను దిగుమతి చేసుకొని, అన్ని రాష్ట్రాల నుంచి నాయకులు వచ్చి తెలంగాణ మీద కుట్రలు చేసేందుకు బయలుదేరారు. ఇన్ని కుట్రలా? అసలు కాంగ్రెస్‌ అంటేనే మోసాలకు కేరాఫ్‌ అడ్రస్‌. కాంగ్రెస్‌ అంటేనే స్కామ్‌లకు పెట్టింది పేరు. కాంగ్రెస్‌ అంటే అవినీతికి ఆనవాలు. కాంగ్రెస్‌ అంటే దుర్మార్గాలకు ఆలవాలం. డెబ్బై ఏళ్ల దేశ స్వాతంత్య్ర పాలనలో పాలన చేసింది సింహా భాగం కాంగ్రెస్‌ పార్టీయే. ఆనాటి నుంచి అబద్దాలు, అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాలు, అడ్డదారులు, పెడదోరణలు సర్వ అవలక్షణాలు కలిసిన ఏకైక పార్టీ కాంగ్రెస్‌ పార్టీ.
పదేళ్లుగా దేశంలో అధికారం కోల్పోవడంతో తట్టుకోలేకపోతోంది.
తెలంగాణ కూడా పాలన చేతిలోనుంచి జారిపోయిందని మధనపడుతోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీ అంటూ పదేపదే సెల్ఫ్‌ డబ్బా కొట్టుకుంటోంది. ఒక్కసారి ప్లీజ్‌ అని మొసలి కన్నీరు కారుస్తోంది. అలాంటి వారిని తెలంగాణ సమాజం హర్షిస్తుందా? ఆదరిస్తుందా? అసలు తెలంగాణ ఊరికే ఇచ్చిందా? 2004 ఎన్నికల సమయంలో కూడా ఇలాగే పదేళ్లు అధికారానికి దూరమై తెలంగాణ ఇస్తామని అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్‌ పార్టీ. ఇచ్చిన హమీని పదేళ్లు మర్చిపోయి, ఆఖరకు అనివార్య పరిస్ధితుల్లో తెలంగాణ ఇచ్చింది. పదేళ్లు చేసిన కాలయాపన పాపానికి, యువత బలిదానాల ఉసురు తగిలి కాంగ్రెస్‌ ఓడిపోయింది. ఒక్క తెలంగాణలోనే కాదు దేశంలోనే కోలుకోలేనంత ఘోరంగా ఓడిపోయింది. అయినా కాంగ్రెస్‌లో మార్పు రావడంలేదు. అదే అబద్దాలు..అవే మోసాలు..అవే కుట్రలు..ఇంకా ఎంత కాలం? ఇలాంటి నీతి మాలిన రాజకీయాలు చేసే కాంగ్రెస్‌ ను ప్రజలు గమనిస్తూనే వుంటారు. అసలు తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్రజలు ఎందుకు అధికారం కట్టబెట్టాలో అన్న ఒక్క ప్రశ్నకు చెప్పడానికి సమాదానం లేదు. ఎంతసేపు కుట్ర…కర్నాటకలో అధికారంలో వున్న పార్టీని అబాసు పాలు చేయడంలో అక్కడ నిర్మాణ రంగ కాంట్రాక్టర్లను వాడుకున్నది. కమీషన్‌ నలభై శాతం అంటూ పెద్దఎత్తున ప్రచారం చేయించింది. ప్రజలను నమ్మించింది. లేనిపోనివి సృష్టించడంలో కాంగ్రెస్‌ మించిన డోఖా పార్టీ మరొకటి లేదని నిరూపించింది. దానికి తోడు ప్రజలకు కొన్ని వరాలు కురిపించింది. అలాగే రైతులను కూడా నమ్మించింది. ఆఖరుకు వారిని కూడా మోసం చేసేసింది. ఇచ్చిన హమీలను గాలికి వదిలేసింది. తమ చేతగాని తనంతో చేతులెత్తేసింది. పైకి మాత్రం అంతా బాగుందన్నట్లు తెలంగాణకు వచ్చి ప్రచారం చేస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్‌ను గట్టెక్కించేందుకు కర్నాకటక డబ్బును వరదలా పారిస్తోంది.
కర్నాటకలో చేసిన జిమ్మిక్కులే తెలంగాణలో చేసి గెలవాలని చూస్తోంది.
కాని తెలంగాణ ప్రజలు ఎంతో విజ్ఞలు. కాంగ్రెస్‌ను ఎదిరించే తెలంగాణ తెచ్చుకున్నారు. కాంగ్రెస్‌తో పదేళ్లు కొట్లాడి తెలంగాణ తెచ్చిన కేసిఆర్‌ పాలన సాగిస్తున్నాడు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పాలన అందిస్తున్నాడు. అలాంటి కేసిఆర్‌ నాయకత్వాన్ని దెబ్బతీయాలంటే లేనిపోనివి సృష్టించాలి. సమాజాన్ని ఆగం చేయాలి. కొన్ని వర్గాలను చీల్చాలి. కులాల కుంపట్లు రగిలించాలి. అవసరమౌతే మత మౌడ్యాలు కూడా రెచ్చగొట్లేదాకా కూడా కాంగ్రెస్‌ వెనకాడని చరిత్ర వుంది. ఈ విషయాన్ని ఎవరో కాదు సాక్ష్యాత్తు ఆపార్టీకి చెందిన నేతలే ఉమ్మడి రాష్ట్రంలో చెప్పిన సందర్భాలున్నాయి. తనను అధికారంలో నుంచి దించేసేందుకు వైఎస్‌ రాజశేఖరరెడ్డి, హైదరాబాద్‌లోని పాత బస్తీలో మతకలహాలు సృష్టించారని ఒకప్పుడు మర్రిచెన్నారెడ్డి ఆరోపించారు. అంటే ఆ పార్టీలో విభేధాలున్నా, ఇతర పార్టీలు అధికారంలో వున్నా జరిగే పరిణామాలు ఇలా వుంటాయని కూడా వాళ్లే చూపించారు. అలాంటి ఆరోపణలు ఎదుర్కొన్న రాజశేఖరెడ్డి పాలనా కాలంలోనే లుంబినీ పార్కు, గోకుల్‌ చాట్‌లో ఏక కాలంలో బాంబు దాడులు జరిగాయి. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌ అంటే, తెలంగాణ అంటే కల్పిత భయానక వాతావరణం సృష్టించిందే కాంగ్రెస్‌. కాని తెలంగాణ వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడా లేనంత ప్రశాంతత తెలంగాణలో వచ్చింది. దేశంలోనే అత్యంత సేఫెస్టు ప్లేస్‌ హైదరాబాద్‌ అని మారు మ్రోగిపోతోంది. గత డెబ్బై సంవత్సరాల తెలంగాణ చరిత్రలో పదేళ్ల పాటు ఎలాంటి అలజడి లేకుండా, హాయిగా సాగిపోతున్న కాలమంటే ఇదే…కేవలం కేసిఆర్‌ పాలనలోనే శాంతి వెల్లివిరుస్తోంది. పాత బస్తీ,కొత్త బస్తీ అన్న తేడాలేదు. హైదారబాద్‌ మహానగరం అంతా అర్ధరాత్రి కూడా మెలుకువుగానే వుంటుంది. మెరుస్తూనే వుంటోంది. రాత్రిళ్లు కూడా పగటి పూట జనసంచారానే తలపించేంత ప్రశాంతంగా సాగుతోంది. అంతగొప్పగా పాలన సాగుతుంటే తెలంగాణ కేవలం అధికారం కోసం కాంగ్రెస్‌ మళ్లీ కుట్రలకు తెరతీస్తోంది. ప్రజల మనసు గెల్చుకోలేనప్పుడే ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతోంది.
తాజాగా కళేశ్వరం మీద దుష్ప్రచారం సాగిస్తోంది.
కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టాలంటే పాలకులకు ధైర్యం కావాలి. అయినా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది ఆశామాషీ కంపనీ కాదు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎల్‌అండ్‌టి. నిర్మాణంలో ఏదైనా పొరపాటు జరిగినా సరిదిద్దాల్సిన బాద్యత కూడా ఆ కంపనీదే. ప్రాజెక్టు జీవితం కాలం నిర్వహణ బాధ్యత దానిదే. కనీసం ఆ మాత్రం అవగాహన లేకుండా, ప్రాజెక్టు అగ్రిమెంట్లు చూడకుండా, ఏదో జరిగిపోతోందని ప్రజల్లో లేని పోని అపోహలు సృష్టించి అధికారంలోకి రావాలనుకుంటోంది. కాని అది చెల్లదు. ఎందుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు జీవిత కాలం దాని పర్యవేక్షణ మొత్తం ఆ కంపనీదే బాద్యత. అనవసరంగా ప్రజల్లో భయాందోళనలు సృష్టించానలని కాంగ్రెస్‌ తహతహలాడుతోంది. ఈ విషయంలో మరోసారి కాంగ్రెస్‌ బొక్కబోర్లాపడడం తధ్యం. ఎందుకంటే కాంగ్రెస్‌ చెప్పేవన్నీ అబద్దాలే అని ప్రజలకు తెలుసు. అధికారంలో వున్న ఏ రాష్ట్రాలలో చేయని అభివృద్ది చేస్తామంటూ కాంగ్రెస్‌ కల్లబొల్లి మాటలు చెబితే జనం నమ్మడానికి సిద్దంగా లేరు. ఎందుకంటే ముందు కర్నాటక రైతులకు నిరంతరంగా తొమ్మిది గంటల కరంటు ఇవ్వలేక చేతులెత్తేశారు. రెండు గంటలకంటే ఎక్కువ కరంటు ఇవ్వలేమని తేల్చేశారు. తెలంగాణలో 24 గంటల అన్ని రంగాలకు నిరంతరం అందుతోంది. రైతాంగానికి మొత్తం ఉచితంగా అందుతోంది. అలాంటి తెలంగాణలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలనను కాంగ్రెస్‌ విమర్శించడాన్ని ప్రజలే సహించరు. అసలు తెలంగాణ ఆదాయం జీతాలకే సరిపోవడం లేదంటారు? జీతాలే సరిగ్గారావడం లేదంటారు? రైతు బంధు అంతమంది రైతులకు ఎందుకంటారు? ఇప్పుడేమో! రైతు బంధు పేరు మార్చి దాని మొత్తాన్ని పెంచుతామంటున్నారు. మొత్తం బిఆర్‌ఎస్‌ పథకాలకే కొంత మొత్తంలో సొమ్మును పెంచి, కొత్త పేర్లతో రాజకీయం మొదలుపెట్టారు. అంతే తప్ప కాంగ్రెస్‌ కొత్తగా చెప్పింది లేదు. ఒక వేళ గెలిస్తే ఇచ్చేదేమీ లేదు. పథకాలకు గుండు సున్నా చుట్టడమే కంగ్రెస్‌కు తెలుసు. కొనసాగింపు కాంగ్రెస్‌ చరిత్రలోనేలేదు. మాట మీద నిలబడే తత్వం ఎప్పుడూ లేదు. ఇప్పుడూ రాదు. కర్నాకటలో కూడా మరోసారి నిరూపించారు. ఇంకా ఎలా నమ్మమంటారు. నమ్మితేనే మోసం చేస్తారు…మోసం చేస్తారని తెలిసి నమ్మడం మళ్లీ జనానిదే తప్పంటారు. అందువల్ల నమ్మకమన్న పదమే ఆపార్టీ డిక్షనరీలోనే లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *