Congress Leader Supports Victim Family After Horse Attack
బాధిత కుటుంబానికి అండగా నిలిచిన కాంగ్రెస్ నేత శ్రీరాం రాజేష్
నేటిధాత్రి వరంగల్
ఖిలా వరంగల్ చిల్డ్రన్స్ పార్క్లో ఇటీవల గుర్రం దాడిలో ప్రమాదవశాత్తు మృతి చెందిన బాధిత కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు శ్రీరాం రాజేష్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఇప్పటికే ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన ఆయన, స్థానిక మంత్రి కొండా సురేఖ ద్వారా మరింత సహాయం అందేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం శుక్రవారం అటవీ, పర్యావరణం, దేవాదాయ శాఖల మంత్రి శ్రీమతి కొండా సురేఖ మురళీధర్ రావును బాధిత కుటుంబ సభ్యులతో శ్రీరాం రాజేష్ కలిపించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ బాధిత కుటుంబాన్ని ఓదార్చి, ధైర్యంగా ఉండాలని సూచించారు. కొండా దంపతులు ఎల్లవేళలా మీకు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని, అలాగే బాధిత కుటుంబానికి నివాసంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు శ్రీరాం రాజేష్ తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ సీఐని పిలిపించి, గుర్రం యజమానులను గుర్తించి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పగడాల సతీష్, బత్తుల నవీన్ కుమార్, అక్షిత్ పటేల్, ప్రియదర్శిని, శ్రీలత, లతతో పాటు బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
