
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే సిహెచ్ రాజారెడ్డి
చేర్యాల పట్టణంలో సీపీఐ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం
చేర్యాల నేటిధాత్రి…
కాంగ్రెస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు ఈ దేశానికి మలుపు అని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే సిహెచ్ రాజారెడ్డి అన్నారు. శుక్రవారం చేర్యాల మండల కేంద్రంలోని సీపీఐ మండల సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రాజారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల భూములను గుంజుకోవడానికి బిజెపి ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలు తీసుకురావడాన్ని నిరసిస్తూ లక్షలాదిమంది రైతులు ఢిల్లీ నగరం చుట్టుముడితే వెయ్యి మందికి పైగా చావుకు కారణమైన బిజెపికి ఎందుకు ఓటేయాలని రైతులు ప్రశ్నిస్తున్నారన్నారు. అలాగే కార్మికులకు ఉపయోగపడే 44 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు కోడులుగా చట్టం తేవాలనుకున్న బిజెపి ఐదు కోట్ల మంది కార్మికులు తీవ్రంగా వ్యతిరేకించినా పట్టించుకోని బిజెపిని అధికారం నుంచి తొలగించాలని కార్మికులు కంకణం గట్టుకున్నారని ఆయన అన్నారు. అందువల్ల కార్మికులు, కర్షకులు పేద ప్రజలు బిజెపిని ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రంలో ఇంతకాలం అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చినప్పుడే తెలంగాణ మీద అధికారం కోల్పోయిందని రాజారెడ్డి అన్నారు. తెలంగాణ పేరు చెప్పి అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రంలో ఏడు లక్షల కోట్ల అప్పుచేసిన బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. రాష్ట్ర సంపదను దోచుకొని దాచుకున్న బీఆర్ఎస్ నాయకులను ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇలాంటి రాజకీయ వాతావరణంలో దేశ రక్షణ భద్రత కొరకు మైనార్టీల, పేద ప్రజల సంక్షేమం కొరకు ఇండియా కూటమిలో భాగస్వామి అయిన కాంగ్రెస్ పార్టీకి భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐగా సంపూర్ణ మద్దతిస్తూ తమ కార్యకర్తలు గెలిపించడం కోసం నిర్విరామంగా కృషి చేస్తున్నారని, ప్రజలంతా అర్థం చేసుకొని చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాజారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యులు అందె అశోక్, సీపీఐ డివిజన్ నాయకులు జంగిలి యాదగిరి, పొన్నబోయిన మమత, నంగి కనకయ్య, గుజ్జుక రమేష్, సిరిగిరి రాజు, రాసూరి శ్రీనివాస్, బైకని యాదయ్య, మనేపల్లి కిష్టయ్య, కొండ నాగరాజు, సురేందర్, రాజు తదితరులు పాల్గొన్నారు.